శుక్రవారం , 18 అక్టోబర్ 2024
ఇచ్ఛాగ్ని
ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

ఇచ్ఛాగ్ని (కథ) – కేతు విశ్వనాథరెడ్డి

పెద్దకూతురు హరిత పుట్టిల్లు చేరి మూడు మాసాలు దాటింది. ‘తరాలు మారాయి సంస్కారాల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి. సామరస్యానికి మార్గమేమిటో ఏ రకంగా కుదురుతుందో అది?” అని హరిత తల్లి కస్తూరి తల్లడిల్లింది. సంస్కారం కొలిమిలో కాల్చటానికి తన కూతురు ఇనుమూకాదు, ఇత్తడీ కాదు, మనిషి రక్తమాంసాలున్న మనిషి. వాడి పీహెచ్‌.డి. చదువూ, ఆ యూనివర్శిటీ లెక్చరరు ఉద్యోగమూ తగలెయ్యనా? అని హరిత తండ్రి లెనిన్‌ బాబుకు ఆగ్రహం కలిగింది. తల్లిదండ్రుల తల్లడిల్లడాలూ, ఆగ్రహాలూ కాపురాల్ని సంధించలేవు. ఈ భయం పట్టుకున్నాక హరిత ముందున్న వాస్తవ సమస్యల్ని తెలుసుకో టానికి కస్తూరి, లెనిన్‌ బాబులు ప్రయత్నించారు.

మొదటి సమస్యగా పెళ్ళినాడు అడ్డంరాని కులం ఏడాది కాపురంలో చిచ్చుపెడుతోందని తెలిసిన మరుక్షణం లెనిన్‌ బాబు తన బాధను అణచుకోలేకపోయాడు. మాటల సందర్శంగా కస్తూరితో వాపోయాడు:

“మా నాన్నవి కమ్యూనిస్టు రాజకీయాలు. మీ నాన్నవి గాంధీ రాజకీయాలు. వాళ్ళూ, వాళ్ళ స్నేహితులూ కులాలూ, మతాలూ చూడలేదు. తమ పిల్లల్ని చూడనివ్వలేదు. ఆ మత్తులో పడి భవిష్యత్తును ఊహించలేదు”.

ఇరవై అయిదు ఏళ్ళక్రితం జరిగిన తమ కులాంతర వివాహాన్ని, దండల మార్పిడి ఒప్పందం పెళ్ళిని, జ్ఞాపకం చేసుకుంటూ భర్త మధనపడుతున్నాడని కస్తూరి గుర్తించింది.

“సంప్రదాయం నుండి మనమే బయటపడలేనప్పుడు, ఎవరినో నిందించి ఏం లాభం?” అంది కస్తూరి అనునయంగా.

కస్తూరి ప్రశ్నలోని ‘మనమే’ అనే మాటమీది నొక్కుడును లెనిన్‌బాబు (గ్రహించాడు. తమాయించుకూంటూ అన్నాడు:

“బాధవల్ల మతిపోతుంది. సొంత బాధయినపుడు నోరు అదుపు తప్పుతుంది. ఈనాటి ప్రభావాల పుణ్యమా అని ఆ మకిలి నాకూ అంటినట్టుంది. మామూలు మనిషిని కదా? అది కాదు నేననేది. తిరువేతి యూనివర్శిటీలో ముందుగానే కుల రాజకీయాలు ఎక్కువట. యూనివర్శిటీల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్ళు గదా ఉండేది. విద్యార్థులకు వాళ్ళు చూపే ఆదర్శం ఇదేమో”? అల్లుడు వీటిలో రాటుదేలాడట. వాళ్ళ సంఘంలో చాలా ముఖ్యుడట. అమ్మాయి అంది”.

“అదే ప్రధానం కాకపోవచ్చు,” కస్తూరి నిట్టూర్చి భర్త పక్కన కూర్చున్నదల్లా లేచిపోతూ అంది.

ఆ విధంగా చర్చ మధ్యలో కస్తూరి వెళ్ళిపోయిందంటే, ఇక చర్చ సాగించటమూ, ఘర్షణకు దిగటమూ తనకు సమ్మతం కాదని సూచించటం అని లెనిన్‌ బాబుకు తెలుసు, పెళ్ళయిన కొత్తలోనే వాళ్ళిద్దరూ కలసి చేసుకోని అతి చిన్న ఒడంబడిక అది. ఇష్టంలేని విషయాలూ, ఆవసరం లేని గొడవలూ ప్రస్తావనకు రావటం మొదలైతే లెనిన్‌ బాబు కూడా అంతే. పీచుమిఠాయి లాగుడువాదాలవల్ల జీవితానికి రవ్వంత ప్రయోజనం లేదు. ఈ రహస్యం వాళ్ళు గుర్తించినట్టుంది.

రెండవ సమస్యగా హరిత నిరుద్యోగం ప్రస్తావనకు వచ్చింది. ఆ రోజు లెనిన్‌బాబు కస్తూరితో అన్నాడు:

“సైకాలజీలో ఎం.ఎ., పిహెచ్‌.డి. చేసింది. ఉద్యోగం రాకపోతుందా చిన్నదో చితకదో అనుకున్నాడేమో. పెళ్ళికి ఒప్పుకున్నాడు”.

“చిన్నదో చితకదో చేయమనటానికి మీ వాళ్ళూ, మా వాళ్ళూ అనుకున్నారా? యూనివర్శిటీలోనే కావాలట. హరిత చదువుకూ, తన గౌరవానికీ దీటుగా. ఆశలండీ బాబూ”? అంది కస్తూరి నవ్వుతూ.

అన్యమనస్కంగా లెనిన్‌బాబు మరొక వైనం ప్రస్తావించాడు:

“ఆ ఉద్యోగం రాబట్టుకోటానికి డబ్బు కావాలట. ఏ అవస్థలైనా మనకుండనీ, సమకూర్చవచ్చుననుకో. సిఫారసులు – పెద్ద పెద్ద సిఫారసులు – ఎక్కడ నుండి తేగలం, నీ ఖాదీ స్టోర్సు ఉద్యోగంతో, ఎదుగూ బొదుగూ లేని నా వ్యాపారంతో, కొద్దిపాటి వ్యవసాయంతో? మా నాన్న ఇప్పుడు బతికి ఉన్నా, ఆయన రాజకీయాలకు ఎవళ్ళు పలికి ఉండేవాళ్ళు? మీ నాన్న బతికి ఉన్నా ఇప్పటి రాజకీయవాదుల మీద ఆయన ఉపన్యాసం మాత్రమే విని ఉండే వాళ్ళం.”

లెనిన్‌బాబు మాటల్లోని తన తండ్రి మీది ‘ప్రేమపూర్వకమైన హాస్యాన్ని కస్తూరి ఆనందించింది. సరదాగా తీసుకుంది. తండ్రీ మామలమీద లెనిన్‌ బాబుకు అమితమైన ఆపేక్ష ఉందని తెలుసు. తండ్రి సంపాదించిపెట్టి పోలేదనీ, మామ కాణి కట్నం ఇవ్వలేదనీ లెనిన్‌ బాబు తనను ఏనాడూ సాధించలేదు. కాకపోతే చుట్టూ జీవితంలో వచ్చిన మార్పులు చూసి, ఎప్పుడైనా ఆర్థికమైన తమ తగ్గుస్థితికి బాధపడేవాడు. ఆ విధంగా చూస్తే తాను యాదృచ్చికంగానైనా అదృష్టవంతురాలినే అనుకునేది కస్తూరి.

లెనిన్‌ బాబు మరొక అనుమానం వ్యక్తం చేశాడు.

“హరిత ఉద్యోగ ప్రయత్నాలకు అల్టుడడిగిన డబ్బూ, సిపారసులూ అసలు కారణాలు కావేమో”?

“ఏం, చెప్పగలం? ‘కారణాలు తెలిసినంత మాత్రాన్నే కార్యాలు ఊడిపడవు’ అని మామయ్యగారనేవారు.. హరిత మనసేదో తీవ్రంగా గాయపడినట్టుంది. కొన్ని చెప్పింది. ఇంకా చాలా విషయాలు తన కడుపులోనే దాచుకున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఒత్తి పండుచేయటం ఎందుకని బలవంతం చేయలేదు” అంది కస్తూరి గుంభనంగా.

“అసలింతవరకు మనిద్దరం కలిసి హరితతో మాట్లాడలేదు. హరిత ఏ పరిష్కారం చెబుతుందో? తననే అడగటం మంచిదనుకుంటాను. చిన్నపిల్లకాదు; మనకంటే ఎక్కువ చదువుకుంది”.

“పరిష్కారం హరితే చెప్పగలిగితే ఈ మనస్తాపం ఎందుకు? సమస్యలు తమవైనప్పుడు వాటి నుండి బయటపడి ఆలోచించగలిగితే గదా పరిష్కారాలు తోచేది?” లెనన్‌బాబు ప్రతిపాదనలు తోచిపుస్తూ అంది కస్తూరి. మరొక మాటను కూడా కలిపింది.” కొంత కాలం ఆగి చూద్దాం”.

అప్పుడు లెనిన్‌ బాబుకు తన జేబులోని ఉత్తరం సంగతి జ్ఞాపకానికి వచ్చింది. ఉత్తరం తీసి కస్తూరి చేతికిస్తూ అన్నాడు:

“రాజ్యలక్షుమ్మ అమ్మమ్మ అని అపుడపుడూ చెబుతుంటానే, ఆమె ఉత్తరం రాసింది. ఈవాళే వచ్చింది చదువు”.

కస్తూరి ఆ ఉత్తరాన్ని ఒకటి రెండుమార్వు చదువుకుంది:

హైదరాబాదు
19-9-1993

బాబూ,

నీ ఉత్తరం అందింది. పెద్దమ్మాయి హరిత విషయంగా మీరు పడుతున్న ఆందోళనను అర్థం చేసుకోగలను. ఎనభై ఏళ్ళు పైబడిన ఈ జీవితంలో స్త్రీల కన్నీళ్ళు నేనెన్ని చూడలేదు? ఇప్పుడూ నా కాపురం వాటి మధ్యనేగదా?

హరిత కొన్ని రోజులపాటు ఇక్కడ వుంటుంది. వెంట తీసుకొని రా తప్పక, కస్తూరిని కూడా చూసింది ఒక్కమారే కదా? ముగ్గురూ రండి. సంకోచాలేవీ పెట్టుకోవద్దు. మన కుటుంబాల మధ్య ఉండేది స్వాతంత్య్రం రోజులనాటి బంధం. ఇప్పటి రోజులది కాదు. బంధువులూ, రక్తబంధువుల అవసరాల బంధం కూడా కాదు. వెలివేసినవాళ్ళూ పోగా, మిగిలిన ఆ మా వాళ్ళంతా- కొడుకూలూ, కోడళ్ళూ, మనుమలూ, మనుమరాళ్ళూ- ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు బాబూ. అడక్కపోయినా బాధ్యత అనుకుంటూ డాలర్లు బ్యాంకులో నాపేరు మీద జమ చేస్తున్నారు. నాకుగా వాళ్ళ డబ్బు అవసరంలేదు. ఈ వృద్దుల సంక్షేమ కేంద్రం కోసం మీ తాతయ్య ఇచ్చిపోయింది చాలు.

చదవండి :  రాతిలో తేమ (కథ) - శశిశ్రీ

మీ తాతయ్య బతికి ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన సంస్కారం, ఆయన పోయినప్పుడు నువ్విచ్చిన ధైర్యం, సాటి’స్త్రీగా నీ భార్య కస్తూరి చూపిన సహనం మరువలేను. ఆ రోజు నుండి కొత్త మనిషిని కూడా అయ్యాను.

నా ఆరోగ్యం బావుంది. వయసుతో వచ్చే చిన్న చిన్న నలతలు ఎప్పుడైనా అంతే. మీరొచ్చి చూస్తారు కదా!

ఇట్లు అమ్మమ్మ
రాజ్యలక్షుమ్మ

భర్త చేతికి ఉత్తరం తిరిగి ఇస్తూ కస్తూరి అంది:

“రాజ్యలక్షుమ్మగారికి హరిత విషయం రాసినట్టు మీరు నాతో అనలేదే. దానిదేముందిలెండి. ఇప్పుడు తెలిపారు గదా. మన ఇంటికి వచ్చిపోయే వాళ్ళ పలకరింపులతో హరితకు ఇబ్బంది. సానుభూతులో, సలహాలో వినటం అమ్మాయికి కష్టంగా ఉండవచ్చు. పైగా నిర్వ్యాపారం. వీటి నుండి హరిత కొన్నాళ్ళు దూరంగా ఉండటమే మేలేమో”.

“అలాగే ముగ్గురం వెళదాం”, భార్య ముఖంలోకి చూస్తూ సమ్మతికోసం లెనిన్‌ బాబు అడిగాడు.

కస్తూరి అంగీకారసూచకంగా తల ఊపింది.

“హరితకు ఈ విషయం చెబుతాను” అంది, పెరట్లో ఉన్న హరితకోసం వెళుతూ. హైదరాబాద్‌ ప్రయాణం గురించి హరితకు తల్లి చెప్పింది. రాజ్యలక్షుమ్మ అమ్మమ్మ వివరాలు హరితకు పెద్దగా తెలియవు, గాలి మార్పుకోసం హైదరాబాద ప్రయాణానికి హరిత అంగీకరించింది. తన శిథిలమైన మనస్సుకు ఆ కొత్త చోటు ఊరటను ఇవ్వవచ్చు. దినదినం ఇక్కడ శ్రేయోభిలాషుల చిన్న చిన్న విచారణ సంఘాల ముందు సంజాయిషీలు చెప్పుకోకుండా  అనుకుంది హరిత.

ముగ్గురూ హైదరాబాద్‌ ప్రయాణమయ్యారు. వివేకానందనగర్‌ కాలనీలో రాజ్యలక్షుమ్మ ఉంటున్న ఇంటికి వెళ్ళారు. రాజ్యలక్షుమ్మ ఆ ఉదయం ఇంట్లోనే ఉంది.

రాజ్యలక్షుమ్మను చూసీ చూడగానే హరిత విస్తుపోయింది.

రాజ్యలక్షుమ్మ పచ్చటి పసిమి. ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి ముఖకవళికలు. నుదుట కొట్టొచ్చేట్లు కనిపించే పెద్ద కుంకుమబొట్టు. పళ్ళూడినట్టు లేదు. కుదురైన మనిషి. ముడుతలు అంతగాలేని బక్కపలచటి శరీరం. చిలకపచ్చ పెద్దంచు కాఫీరంగు సాదా నేత చీరలో. మెడలో అరిగిపోయిన పెద్ద పగడాల దండ. ఎవరినైనా ఆకర్షించే విగ్రహం,ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే శక్తీ ఉత్సాహమూ, పని తన్మయత్వమూ ఆమెవి. హరితను ఆమె ఆకర్షించింది.

హరితకు రాజ్యలక్షుమ్మ ఉంటున్న ఇల్లు కూడా చాలా బాగుంది. లక్షలు ఖరీదు చేసే కొత్త తరహా వాస్తు నిర్మాణం. ఇంటి చుట్టూ పూలమొక్కలూ, పళ్ళ చెట్లూ? గదిని కలయచూస్తున్న హరిత దగ్గరకు వచ్చి ఆప్యాయంగా భుజాలు ఊపుతూ రాజ్యలక్షుమ్ము అంది.

“ఈ ఇల్లు నాది అనుకునేవు హరిత తల్లీ? మీ పెద్దమామయ్యది, అంటే నా పెద్ద కొడుకుది. వాళ్ళంతా అమెరికా వెళుతూ నన్ను ఈ ఇంటికి కాపలా ఉంచి పోవాలా? ఓల్డ్‌ ఏజ్‌ హోంలో చేర్పించి పోవాలా? అని నెలరోజులు తర్జన భర్జనలు పడ్డారు. సరిగ్గా ఆ రోజుల్లోనే నా సమస్యకూ, నాలాటి వాళ్ళ సమస్యలకూ పరిష్కారం నాకు తోచింది. నా
నిర్ణయం చెప్పాను. ఈ ఇంట్లో రెండుగదులు నాకు కేటాయించారు. మిగతా ఇల్లు అద్దెకిచ్చుకున్నారు.

హరిత మీద చూపిన ఆప్యాయతకు కస్తూరి మురిసిపోయింది. హరితకు ఇబ్బంది లేదు ఇక్కడ అనుకుంది కస్తూరి.

వచ్చిన రోజే రాజ్యలక్షుమ్మ నడుపుతున్న వృద్దుల సంక్షేమ కేంద్రాన్ని హరితా, కస్తూరీ, లెనిన్‌బాబూ చూశారు. రాజ్యలక్షుమ్మ ప్రతిదీ వెంట ఉండి వివరిస్తూ చూపించింది.

లెనిన్‌ బాబుకు రాజ్యలక్షుమ్మ మీద గౌరవం మరింత పెరిగింది. సోవియట్‌ రష్యాలో పర్యటించి వచ్చిన ఒక నాయకుడి ఉపన్యాసాన్ని లెనిన్‌ బాబు అప్పుడెప్పుడో విన్నాడు. ‘సోవియట్‌ యూనియన్‌ పసిపిల్లలకూ, వృద్దులకూ ఒక స్వర్గం’ అని ఆ నాయకుడు చేసిన ప్రశంన లెనిన్‌బాబుకు గుర్తుకొచ్చింది.కానీ ఇప్పుడు ఇక్కడ వృద్దస్త్రీలు వీధుల్లో ముష్టెత్తుకుంటున్నారన్న వార్తలూ, ఫోటోలూ మనసులో మెదిలాయి. ఇలాంటి సంస్థ తనకోసం కాకుండా ఇతరులకోసం ఏర్పరచటం గొప్ప విషయం అని రాజ్యలక్షుమ్మ ను లెనిన్‌ బాబు మనసులో చాలా మెచ్చుకున్నాడు.

కస్తూరికి సంక్షేమ కేంద్రంలోని పద్దతులూ, (క్రమశిక్షణా నచ్చాయి. కస్తూరి నాన్న వార్దాలో గాంధీజీ ఆశ్రమంలో కొన్నాళ్ళున్నాడు. ఆయన తఠచూ చెబుతూ ఉండిన అక్కడి క్రమశిక్షణ కస్తూరి స్మృతిలో మెదిలింది.

హరితకు అక్కడి వాతావరణం కొత్తగా, వింతగా, అయోమయంగా కనిపించింది. మరీ ఒకరిద్దరు తప్ప, మిగిలినవాళ్ళందరూ జట్టు జట్టుగా పనుల్లో నిమగ్నమై కనిపించారు. తీపి పదార్థాలు చేస్తూనో, కారపు పదార్థాలు చేస్తూనో, పొళ్ళు కొడుతూనో, పచ్చళ్ళు పెడుతూనో. వృద్దుల సంఘజీవితంలోని చైతన్యమేమిటో హరితకు అర్ధంకాలేదు. కూలికి చేసినట్టు యాంత్రికంగా పనులు చేస్తున్నారేమో? ఏ దిక్కూ లేకపోవటం వల్ల ఈ పద్దతిలో జీవించటం అలవాటు చేసుకున్నారేమో? అనుకుంది. తాను చదివి, పరిశోధన చేసిన సామాజిక మనో విజ్ఞానంలోని విషయాలేవీ ఆ క్షణంలో హరితకు గుర్తుకురాలేదు. వృద్దుల సంక్షేమ కేంద్రంలో నలుగురూ కలిసి చేసే పనిలో ఆనందమూ. బాధ్యతా ఉండి ఉండవచ్చునని హరిత అనుకోలేకపోయింది. ఈ రకం వృద్దులు చేయగలిగిన పనులు వాళ్ళను చురుకుగా ఉంచుతాయనీ, కేంద్రం ఆదాయానికి తోడ్పడతాయనీ, తద్వారా మరికొంతమంది అనాథ
వృద్ద స్త్రీలకు ఆశ్రయం లభిస్తుందనీ హరిత భావించలేకపోయింది. సంస్థల వ్యవహారాలు హరితకు అనుభవంలో లేవు,

రెండు రోజులుండి హైదరాబాద్‌లో హరితను వదలి లెనిన్‌బాబూ, కస్తూరీ మిర్యాలగూడ తిరిగి వెళ్ళిపోయారు. హరిత కొన్నాళ్ళపాటు హైదరాబాద్‌లో ఉండటానిక్షి ఒప్పుకున్నాక, ఆ తర్వాత అయిదారు దినాల వరకూ హరిత రోజుకొక్క పర్యాయం వృద్దుల సంక్షేమ కేంద్రానికి వెళుతూ వచ్చినా, ఆ వృద్దుల ప్రపంచంలో హరిత మమేకం కాలేకపోయింది. తన వయసుకూ, అభిరుచులకూ, కోరికలకూ పొంతనలేని ప్రపంచంగా ఆ చిన్న ప్రపంచం కనిపించింది. ఇక్కడ తానుండి చేసేదేమిటి, సాధించేదేమిటి? అనుకొంది. రాజ్యలక్షుమ్మ ఇంట్లోని పుస్తక ప్రపంచంలో ఎక్కువకాలం గడిపింది.

చదవండి :  భాషల అభివృద్ధి మండలి సభ్యునిగా కేతు విశ్వనాథరెడ్డి

రాజ్యలక్షుమ్మ ఆ రోజు రాత్రి అడిగింది:

“హరితమ్మా! నీకిక్కడ తోచకుండా ఉందా ? పోనీ ఏం చేయదలచుకున్నావో చెప్పు. అదే చేద్దువు గాని. ఆ విషయంలో నేను చేయగలిగింది చేస్తాను- మీ అమ్మా నాన్నలకు తెలిపి”.

రాజ్యలక్షుమ్మ మాటల్లోని అంతరార్థం హరితకు బోధపడింది. అంటే తన విషయాలు కొన్ని తెలుసన్నమాట అనుకుంది. హరిత మౌనం చూసి రాజ్యలక్షుమ్మ అడిగింది:

“ నా జీవితం ఎలా సాగిందో మీ నాన్న నీ కెప్పుడూ చెప్పలేదా?”

“చెప్పలేదు. అవసరం వస్తే తప్ప ఏ విషయం నాన్న చెప్పడు అమ్మమ్మా. అడగటం మర్యాద కాదనుకున్నాను” అంది హరిత.

“ఆయన చనిపోయి ఇప్పటికి ఇరవై ఏళ్ళు పైబడింది.”

కళ్ళు తుడుచుకుంటున్న ఆ వృద్దురాల్ని చూసి హరిత నిశ్చేష్టురాలైంది.

“మరి నుదుట ఆ కుంకుమ … అది . .. “హరిత తడబడింది.

రాజ్యలక్షుమ్మ తనజీవితకథను చెప్పుకుపోయింది:

“మా నాన్నావాళ్ళది వినుకొండ దగ్గర పల్లెటూరు. కవి జాషువా పేరు విని ఉంటావు. ఆయన పుట్టిన ఊరికి దగ్గరన్నమాట. మాది కలిగిన కుటుంబమే. మేం ముగ్గురం అప్పచెల్లెళ్ళం. నాకు అప్పుడు పదకొండో ఏడు పడిందో, పండ్రెండుదాటిందో గుర్తులేదు. వ్యక్తురాలినయ్యాను. దగ్గర సంబంధం అని మా నాన్న నా గొంతు కోశాడు. చదువుకుంటానని మొత్తుకున్నా పెళ్ళిచేశాడు. నా మొగుడు . .. ఆ ఎద్దు… కాదు ఆంబోతు తన పక్కలోకి రాలేదని గొడ్డును బాదినట్టు బాదాడు ఆ రోజు, మళ్ళీ మళ్ళీ అంతే … ఆ మనిషిని చూస్తేనే నాకు కంపరం. మా వాళ్ళు మూర్ఖులు. ‘మేమందరం సంసారాలు చేస్తున్నామే’ అని కొందరన్నారు. ‘మొగుడి పక్కలోకి పోకపోవటానికి నువ్వేం మాచకమ్మవా? అని ఎగతాళి చేసినవాళ్ళు కూడా ఉన్నారు.

భరించలేక ఒక రోజు మా పెదనాన్నతో చెప్పుకొని ఏడ్పాను. ఆయన అపుటికే నా పెళ్ళి విషయంగా మావాళ్ళతో గొడవపడి ఉన్నాడు. మా పెదనాన్న ఆర్య సమాజీకుడు. గాంధీ శిష్యుడు. వాళ్ళింట్లో మనుషుల్లాగా ఆ ఇంట్లో అంటు లేదు. కులం లేదు. మతం లేదు. బలవంతపు పెళ్ళిళ్ళు లేవు, పైగా స్వాతంత్రోద్యమం రోజులు. పెదనాన్నవాళ్ళింటికి
ఎవరెవరో పెద్ద పెద్దవాళ్ళు వచ్చిపోయేవాళ్ళు. మీ ఇద్దరు తాతయ్యలు కూడా మా పెదనాన్నకు మంచి మిత్రులు … ఆయనే నా గోడు విని నన్ను ఆదుకుంది.

అందర్నీ కాదని బంధువులంతా మొత్తుకుంటున్నా నన్ను మా పెదనాన్న ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు, లక్ష్మీబాయమ్మగారు అని ఉండేవాళ్ళు వాళ్ళవద్దకు తీసుకువెళ్ళారు. ‘నువ్వు మాలపల్లి చదివావా?” స్వీయకథను ఆపి, తేనె కలిపిన నిమ్మరసం కొంచెం తీసుకొని ఆ గ్లాసు పక్కనుంచి రాజ్యలక్షుమ్మ హరితను అడిగింది.

“మాలపల్లి బి.ఎ.లో మా నాండిటైల్‌ చదివాను” అంది హరిత.

“ఆ ఉన్నవ పంతులుగారూ, లక్ష్మీబాయమ్మ గారూ నడుపుతూ ఉండే శారదానికేతన్‌లో మా పెదనాన్న చేర్పించాడు. పెదనాన్న పలుకుబడికి జడిసి అటువైపువాళ్ళూ ఇటువైపువాళ్ళూ అప్పటికి నోరు మూసుకున్నారు. ఈలోగా ఆ మొగుడుపోయాడు. బొట్టు చెరపాలని మళ్ళీ యుద్దాలు. నా చిన్నతనంలోని ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికీ నా
కన్నవాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మరిచిపోలేను”.

రాజ్యలక్షుమ్మ జీవితకథలోని చరిత్ర అంతా హరితకు అర్ధంకాలేదు. ఇప్పటి పెళ్ళిళ్ళకంటే అప్పటివి ఇంకా భయంకరంగా ఉండి ఉండాలి అనుకుంది. బాల్యవివాహాల చరిత్ర హరితకు కొంత తెలుసు. మరి తాతయ్యతో జరిగింది రెండోపెళ్ళా? అని రాజ్యలక్షుమ్మను హరిత అడగటానికి సిగ్గుపడింది.

“హరితమ్మా! ఆ శారదా నికేతన్‌లో చదువే లేకపోతే, మీ తాతయ్య లాంటి మనిషీ నాకు దొరికి ఉండేవాడుకాదు,” రాజ్యలక్షుమ్మ కంటి తడి తుడుచుకుంది. మళ్ళీ తన కథను ప్రారంభించింది:

“నాకు పద్దెనిమిదేళ్ళు దాటేనాటికి హిందీ పండిట్‌ ట్రెయినింగ్‌ పూర్తిచేశా ఫిరంగి పురంలో ఉద్యోగమైంది. మా పెత్తల్లి తోడుగా ఉండేది. పెదనాన్న కాంగ్రెసు పనులమీద ఆ ఊళ్ళూ, ఈ ఊళ్ళూ తిరుగుతూ ఉండేవాడు. బళ్ళారిలో మీ తాతయ్య అప్పటికే బాగా పరిచయం. నాకు వయసు ఇరవై దాటింది. ఒకరోజు ఉన్నట్టుండి మీ తాతయ్యను వెంటతీసుకొని మా పెదనాన్న ఫిరంగిపురం వచ్చాడు. ఆ రోజు సాయంత్రం నాకు కళ్ళకు కట్టినట్టు జ్ఞాపకం ఉంది. పిల్లలకు హిందీపాఠం చెబుతున్నాను. ఆయనను పెదనాన్న పరిచయం చేశాడు.

మనిషిలో మర్యాద కనిపించింది. మాట కొంత మొరటు. నన్ను అడిగారు: “అప్ప అన్నీ వివరంగా చెప్పినారు. నీ కిష్టమైతే పెండ్లి చేసుకుందామి? అని. నాకెందుకో సిగ్గు ముంచుకొచ్చింది. ముందు ధైర్యం కూడగట్టుకున్నాను. ‘మా నాన్నలాగా పెదనాన్న ఆడపిల్లల గొంతులు కోసే రకం కాదు. మీరు ఆడవాళ్ళను హింసించేవాళ్ళు కాదనుకుంటాను’ అన్నాను. ఆ మాటలకు మీ తాతయ్య పకపకా నవ్వారు. ఎవరైనా ఎదిరించినట్టు మాట్లాడితే అలా నవ్వటం ఆయనకు
అలవాటని పెళ్ళయ్యాక తెలిసింది. ఆర్య సమాజ పద్దతిలో మా పెళ్ళి జరిగిపోయింది”.

“తర్వాతేమైంది? తాతయ్య పెద్దవాళ్ళ నుండి ఇబ్బందులేం రాలేదా?” హరిత కుతూహలంతో అడిగింది.

“రాకేం? బోలెడు వచ్చాయి. మీ తాతయ్యకు తల్లీ తండ్రీలేరు. ఆ ఇంటికి పెద్ద వాళ్ళన్నయ్య అడ్వకేటు ఆస్తి పంపకాలు చేశాడు. వెలివేశాడు, సాటి బంధువులు రభస చేశారు. తాతయ్య తమ్ముడు బళ్ళారి రాఘవగారి బృందంలో నటుడు. మా వైపు అండగా నిలిచాడు. అయినా, కొన్నాళ్ళు మానసిక హింస తప్పలేదు. సంపద ముందు ఏ వెలీ
నిలవలేదు. బంధువులందరూ క్రమక్రమంగా మళ్ళీ చేరువయ్యారు. మీ తాతయ్య చనిపోయినప్పుడు మళ్ళీ సమస్య … చనిపోతూ ఆయన కోరిన కోరికను నేను పాటించినందుకు …”

చదవండి :  కథకుల సందడితో పులకరించిన నందలూరు !

కథను ఆపి, లేచి అద్దం ముందు కుంకుమబొట్టు దిద్దుకుంటున్న రాజ్యలక్షుమ్మను చూసి ఏం మనిషి! అనుకుంది హరిత.

కూర్చొని బొట్టు సరిచూసుకుంటూ చెప్పంది రాజ్యలక్షుమ్మ:

“ఈ నుదుటి బొట్టు నేను మట్టిలో కలిసేదాకా ఉండి తీరాలని మీ తాతయ్య నాతో ఒట్టు వేయించుకున్నాడు. మరణించే కొన్ని క్షణాలముందు ఒట్టు వేయించుకోవటం వెనుక మీ తాతయ్య చీన్న నాటి రోజుల కథ ఉంది. ఆయన తండ్రి పిన్న వయసులోనేపోయాడు. దినాలలో తల్లిని విధవరాలు చేసిన దన్ని ఆ మహానుభావుడు ఎనాడూ క్షమించలేదు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న తల్లిని ఊరగిస్తున్నట్టు నడిపించింది. జమ్మిచెట్టు కింద పిండాకూడుంచి గాజులు పగలకొట్టిందీ, బొట్టు చెరిపిందీ, తెల్లచీర కట్టించిందీ తాతయ్య జీవితాంతం మరచిపోలేదు. “మీ పెదనాన్నను అడుగు, వేదాల్లో ఉందేమో ఈ అమానుషం? శాస్త్రాల్లో ఉందేమో అడుగు. ఆయన నాకు గురువు. తండ్రి, మామ అన్నీ, అని తల్లి విషయం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అనేవారు … నన్ను చూడటానికి మీ నాన్న వచ్చినప్పుడు ‘ఏం తప్పు? ఆమె ఇష్టం’ అని నా కొడుకుల్ని నిలదీశాడు తెలుసా? మీ నాన్న మా చిన్నబ్బాయి దయానంద్‌ క్లాసుమేటు. మన అపేక్షలు మూడుతరాలవి. మీ నాన్న ఇచ్చిన నైతికబలం మరచి పోలేంది.” రాజ్యలక్షుమ్మ బొట్టును మళ్ళీ దిద్దుకుంది.

ఏం ధైర్యం! అనుకుంది హరిత లోపల మెచ్చుకుంటూ.

రాజ్యలక్షుమ్మ తాత్వికంగా అంది:

“నా కథకేంగానీ, మన బాల్యాలూ, మన యౌవనాలూ, మన పెళ్ళిళ్ళూ, కాపురాలూ, వృద్దాప్యాలూ అన్నిటికీ మన ఆడవాళ్ళమే కర్తలైతే ఎంత బావుండు?”

అద్భుతమైన మనిషి అనుకుంది హరిత.

ఆ క్షణాల్లో తల్లివైపు కుటుంబమూ, తండ్రివైపు కుటుంబమూ, వాళ్ళ ఒప్పందం పెళ్ళీ, శాస్త్రీయంగా జరిగిన తన పెళ్ళీ, తన భర్తవైపు వాళ్ళూ, తన ఏడాది సంసారం, తన నైరాశ్యం అన్నీ హరితకు మనసులో మెదిలాయి. రాజ్యలక్షుమ్మ జీవితాన్ని తలచుకొని, వ్యక్తులు చాలా బలమైనవాళ్ళో, సంఘం బలమైందో హరిత తేల్యుకోలేకపోయింది.

రాజ్యలక్షుమ్మ పడుకోబోతు అంది:

“హరితా! మన కేంద్రంలోని వాళ్ళకు కొందరికి మానసికమైన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు గతాలను అంత సులభంగా మరిచిపోలేరు. అత్తల ఆరళ్ళూ, భర్తల నిరాదరణలూ, బంధు హింసలూ, తరం మారిన పిల్లలు పట్టించుకోకపోవటాలూ . .. ఎన్నో. వాటి మధ్య నలిగి వచ్చినవాళ్ళు. నువ్వు నూర్జహాన్‌ను చూశావు గదా ! వాళ్ళ మత
నియమాల ప్రకారం ఒక పెళ్ళి చెడినప్పుడల్లా మరొకటి చేసుకొని మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది. ఇప్పుడేం మిగిలింది? స్తిమితం లేని మనసు …. వృద్దాప్యం … ఇలాంటి వాళ్ళకు బతికే ధైర్యం కావాలి. శరీరాలకు వచ్చే రోగాలు నయం చేయటానికి ఒక డాక్టరున్నాడు. మనసు జబ్బులకు సలహాలిచ్చే మనిషి కావాలి. నువ్వు సైకాలజీలో పీహెచ్‌.డి. చేశావని మీ నాన్న చెప్పాడు. నీ కిష్టమైతే ఇక్కడ ఉండిపోరాదా? ఉద్యోగం అనుకో . . . పసిపిల్లల్లాంటి వృద్దులకు సేవ అనుకో … నీ భర్త వద్దకు తిరిగి వెళ్ళాలనుకుంటే ఆది ఇంకా మంచి నిర్ణయం కావచ్చు”

“కాదు” అంది హరిత

“పడుకో,పొద్దుపోయింది.” అంది రాజ్యలక్షుమ్మ పరమ శాంతంగా.

రెండు మాసాలు గడిచాయి. హరిత నుండి వచ్చిన ఉత్తరాన్ని కస్తూరి భర్తకు చూపింది:

అమ్మా,

నీకు తెలిసిన ఆ ఒక్క ముఖ్యమైన సంగతినీ నీ కడుపులోనే దాచుకున్నావనీ, నాన్నకు చెప్పలేదని (గ్రహించాను. తిరుపతికి నువ్వే వచ్చావు. నన్ను మిర్యాలగూడకు తీసుకొని వచ్చావు. నువ్వు తిరుపతి రాక ముందు మూడు రోజుల క్రితం నేను నిద్రమాత్రలు మింగింది నా పిరికితనమే కావచ్చు. అతను కులాన్నీ డబ్బునూ మాటిమాటికీ గుర్తుచేస్తున్నా సహించాను. కులానికి నేను కర్తను కాదుగా? ఉద్యోగం లేదని సాధిస్తే ఓర్చుకున్నాను. అది నా కొంగున
కట్టిలేదుగా? తాను మగవాణ్ణనే దురహంకారం అడుగడుగునా జ్ఞాపకం చేస్తే ఎన్నాళ్ళు తలవంచుకోగలనో చెప్పు? ఒకటే నస. అది అవమానం. అది హింస. రేపు మగపిల్లలు పుడితే తండ్రిలాగా రాటుదేలుతారు. ఆడపిల్లలు పుడితే ఆ ఇంట్లో మానసికమైన మరుగుజ్ఞులవుతారు, జరిగిందేదో జరిగింది పోనీ. 

వృద్దుల సంక్షేమ కేంద్ర బాధ్యతల తలమునకలై ఉన్నా. ప్రధాన బాధ్యతల్ని చూసుకోక తప్పని స్థితి నాకిప్పుడు. వేరే రకం అశాంతి ఏమైనా ఉందేమో కాని ఆ సంసారంలోని నరకయాతన లేదు గాక లేదు. నేను ఆదర్శం కోసం బతుకుతున్నానని అనుకోవటం లేదు. ఇక్కడ జీవేచ్చ కనిపిస్తోంది. వీళ్ళలో జీవితేచ్చ చూస్తున్నాను.

నాన్నకు వేరుగా ఉత్తరం పోస్టు చేస్తున్నాను. ఈ ఉత్తరం నాన్నకు నువ్వెలాగూ చూపుతావని తెలుసు గదా నాకు. అలాగే తనకు రాసిన ఉత్తరాన్ని నాన్న నీకు చూపుతాడు.

హరి.

లెనిన్‌ బాబు ఇచ్చిన హరిత ఉత్తరాన్ని కస్తూరి చదువుకుంది:

నాన్నా,

రాజ్యలక్షుమ్మ అమ్మమ్మ చనిపోయి మూడు వారాలు దాటింది. చివరి క్షణాల్లో ఎవరికీ ఉత్తరం రాయనవసరం లేదని చెప్పింది. ఎలక్ట్రిక్‌ క్రిమటోరియంలో కాల్చమని చెప్పింది. ఏ దినాలూ పాటించ వద్దంది. అమెరికాలో వాళ్ళవాళ్ళకు ఆ మొన్ననే విషయాలన్నీ పోస్టు చేశాను.

రాజ్యలక్షుమ్మ అమ్మమ్మ లాంటి పునిస్త్రీని నాకు పరిచయం చేసినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటాను.

పెళ్ళిని మించిన జీవితాన్ని చూస్తున్నాను ఇప్పటికి.

మీ హరిత

(1995, ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక)

రచయిత గురించి

డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సంచాలకునిగా పదవీ విరమణ పొందిన వీరు 1939 జులై 10న కడప జిల్లా కమలాపురం తాలూకాలోని రంగసాయిపురం గ్రామంలో జన్మించారు. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’,’ జప్తు’, ‘ఇఛ్చాగ్ని’ పేర్లతో వీరి కథలు సంకలనాలుగా వెలువడ్డాయి.

ఇదీ చదవండి!

రాజంపేట

రాజంపేట పట్టణం

రాజంపేట పట్టణ విశేషాలు, చరిత్ర, జనాభా వివరాలు మరియు ఫోటోలు. రాజంపేటకు వెళ్లే వారి కోసం అవసరమైన సమాచారం మరియు సూచనలు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: