
సిటీబస్సుల కోసం కడపలో మరో వాహనశాల
ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి (వాహనశాల) నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు.
నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో కడపలో కూడా సిటీ బస్సులు నడవనున్నాయి. మార్చి తొలి వారంనుంచే సిటీ బస్సులను తిప్పాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదట ప్రస్తుతం ఉన్న బస్టాండునుంచే వీటిని నడపాలని అధికారులు నిర్ణరుుంచారు. జవహర్‌లాల్ నెహ్రూ అర్బన్, రూరల్ మేనేజ్‌మెంట్ కింద గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 40 బస్సులను కడపకు కేటారుుంచారు. వీటి నిర్వహణ కోసమే ఆర్టీసి మరో వాహనశాల నిర్మిస్తున్నట్లు సమాచారం.
సిటీ బస్సులు నడపాల్సిన మార్గాలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు కలిసేలా మార్గాలను గుర్తించనున్నట్లు తెలుస్తోంది. రాజంపేట మార్గంలోని ఒంటిమిట్ట, పులివెందుల రోడ్డులోని పెండ్లిమర్రి, కర్నూలు మార్గంలోని చెన్నూరు, రాయచోటిమార్గంలోని ఎన్టీపీసీ, ఎర్రగుంట్ల మార్గంలోని కమలాపురం వరకు నడపాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. దీంతో పాటు నగరంలో దేవునికడప, రిమ్స్, రైల్వేస్టేషన్, పాత బస్టాండు, అల్మాస్‌పేట, బిల్టప్, అప్సర సర్కిల్, చిన్నచౌకు, ఐటీఐ సర్కిల్ తదితర ప్రాంతాలను గుర్తిస్తున్నారు.