
ఆయనకు దమ్ము, ధైర్యం లేదా?
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు సీబీఐని ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేదని రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. రాజంపేటలో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా కాంగ్రెస్, టీడీపీ మోకాలొడ్డుతున్నాయన్న ఆయన సీబీఐ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అని, ఇప్పటికే ప్రజల్లో దానిపై చులకన భావం ఏర్పడిందన్నారు. చివరకు సీబీఐ పనితీరును అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించడం తెలిసిందేనన్నారు.
బెయిల్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా సీబీఐ పనిచేస్తున్నదన్నారు. సీబీఐ సర్కారు పంజరంలో చిలుక అని ఆయన ఎద్దేవా చేశారు. బెయిల్ రానివ్వకుండా కేసు దర్యాప్తు పేరుతో నెలలు తరబడి కొనసాగిస్తూ సీబీఐ తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నదన్నారు.
జగన్‌కు జనాదరణ ఉందని, ఆ జనమే ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారని, తప్పకుండా ఆయన బయటకు వస్తారని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.