
అఖిల భారత విద్యార్థి సమాఖ్య – యువజన సమాఖ్యలు రూపొందించిన బ్యానర్
సీమ అభివృద్దిపై వివక్షకు నిరసనగా ఆందోళనలు
కడప: సీమ సమగ్రాభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్దిపైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకూ రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ, 24, 25 తేదీలలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నట్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్యల జిల్లా నాయకులు చెప్పినారు.
మంగళవారం స్థానిక రారా గ్రంథాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ… రాయలసీమపై వివక్ష చూపితే సహించేదిలేదని పరిస్థితిలో మార్పురాకపోతే ప్రభుత్వంపై తిరగబడతామని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతం అన్ని రంగాలలో వెనుకబడిందని, వివక్షకు గురైందని అధికారిక కమిటీలు, లెక్కలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ విషయాలన్నింటిపై జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, యువకులను చైతన్యవంతులను చేసి తిరుగుబాటు చేయడానికి సిద్ధం చేస్తామన్నారు.
ఈ నెల 16, 17 తేదీలలో కర్నూలులో సమావేశం జరిగిందనీ ఉద్యమ కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా రాయలసీమకు చెందిన నాయకులే పరిపాలన సాగించినా ఒరింగిదేమీ లేదన్నారు.
కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మద్దిలేటి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య, నగర కార్యదర్శి అంకుశం, నాయకులు జగన్‌నాయక్, శివ, వీరయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.