
అన్నమయ్య కథ – మూడో భాగం
ఇంటి పని ఎవరు చూస్తారు?
నారయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్నచిన్న కలతలు తప్పవు. వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి, ఇంతలో తగవులాడతారు. అంతలో కలిసిపోతారు. ఒకనాడు అందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకుపడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. “ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకుని పిచ్చి పాటలు పాడుకోవడమేనా? ఇంట్లో పనీ పాట ఎవరు చూస్తారు?” అని ఇంటివాళ్ళు దెప్పిపొడిచారు. “గాలి పాటలు కట్టిపెట్టి , అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చి పడేయ్” ఏ విసుగులో ఉన్నాడో నారాయణసూరి కొడుకును కసరినంత పని చేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిగా చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకుని అడవికి బయలుదేరాడు.
ఎవరికెవరు?
అన్నమయ్యకు అడవికి వెళ్ళడం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే వుంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి వుంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లేచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి వుంది. కొడవలితో కోస్తున్నాడు. ఉన్నట్లుండి “అమ్మా !!” అని కేక పెట్టాడు. చిటికిన వేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తనబంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. “అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పనిలేదనుకున్నాడు. అదే సమయాన దూరాన తిరుమల వెళ్ళే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలొ వున్న కొడవలిని విసిరేసాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు.
అన్నమయ్య తిరుపతి చేరాడు
ఆ యాత్రికులు ఎవరోకారు, సనకుడు మొదలగు మహా భక్తులు. వాళ్ల వేషం తమాషాగా వుంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము, ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టెనామాలు, శంఖ చక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలున్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెల మ్రోగిస్తూ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో “గోవిందా! గోవింద!” అంటూ నినాదాలు చేస్తున్నారు. వాళ్ళతో కలిసి తిరుపతి చేరాడు అన్నమయ్య.
అదివో అల్లదివో:
తిరుపతి చేరుతూనే గంగమ్మ గుడికి వెళ్లాడు. గ్రామశక్తికి దండం పెట్టినాడు. అలిపిరి చేరాడు. అక్కడ నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం. ఇక్కడ ‘తలేరుగుండు’ ఉంది. ఆ గుండు మీద ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. అన్నమయ్య ఆ గుండుకు నమస్కరించినాడు. ఆ గుండులో ఎన్నో మహిమలున్నాయట. కొండ ఎక్కే భక్తులు ఈ గుండును తలతో, మోకాటితో తాకి దండం పెట్టుకుంటే తలనొప్పి, కాళ్ళనొప్పులు ఉండవని నమ్మకం. ఎత్తుగా, విశాలంగా వ్యాపించి ఉన్న పర్వత శిఖరాలను చూసినాడు. ఆదిశేషుని పడగల్లా కనిపించాయి. ఆనందంతో చిందులు త్రొక్కుతూ పాడసాగాడు:
“అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకూ
అదె చూడుడూ అదె మ్రొక్కుడూ.. ఆనందమయము
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో.. అదివో
పావనములకెల్ల పావన మయము”
వేంకటేశ్వరస్వామి విహరించడానికి అనువుగా ఆదిశేషుడు క్రీడాశైలంగా నిలిచాడట.
అన్నమయ్య అలసిపోయాడు
ఆ బాలభక్తుడు కొండ ఎక్కుతున్నాడు. అలిపిరి గోపురం సమీపిస్తున్నది. అక్కడ కొంత నిటారుగా ఉంటుంది. దానికి ‘పెద్ద ఎక్కుడు’ అని పేరు. ఉత్సాహంగా అన్నమయ్య ఆ కొండ ఎక్కి గాలిగోపురం చేరినాడు. కొంత దూరంలో కర్పూరపు కాలువ ఉంది. అక్కడి నుండి కమ్మని వాసనలు వ్యాపిస్తున్నాయి. గుబురుగుబురుగా అలముకున్న చెట్లను, పొదలను, జలజలా ప్రవహిస్తూ వయ్యారంగా సాగిపోతున్న కొండవాగులను చూసుకుంటూ మోకాళ్ళ కొండ చేరినాడు. అక్కడ చేరేటప్పటికి మిట్ట మధ్యాహ్నమైంది. ఎండ కన్నెరగని పసిబాలుడు; ఎనిమిదేండ్లవాడు, అన్నమయ్య అలసిపోయినాడు. ఆకలిగా ఉంది. శోష వచ్చినట్లైంది. దట్టంగా అలుముకున్న వెదురు పొదల కింద అలానే, చెప్పుల కాళ్ళతోనే వాలిపోయాడు. వెదురు బొంగులలో దూరి గాలి వేణువులూదుతూ ఆ పసిబాలునికి జోల పాటలు పాడింది.
(ఇంకా ఉంది)
– కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి
[author image=”https://kadapa.info/gallery/albums/userpics/10001/thumb_kamisetty.jpg” ]
తితిదే వారి ‘శ్రీనివాస బాలభారతి’ పుస్తకమాలలో భాగంగా ప్రచురించిన ‘అన్నమాచార్యులు’ పుస్తకం కోసం కామిశెట్టి శ్రీనివాసులు గారు పరిశోధించి రాసిన కథ ఇది. కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎమ్మే పట్టా పొందినారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి వద్ద శిష్యరికం చేసిన వీరు చాలా కాలం పాటు తితిదేలో పనిచేసినారు. తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టుకు, శ్రీ వెంకటేశ్వరా దృశ్య శ్రవణ ప్రాజెక్టుకూ డైరెక్టరుగా వ్యవహరించినారు. అన్నమాచార్య సంకీర్తనలకు వ్యాఖ్యానాలు రాసినారు. తాళ్ళపాక కవుల జీవిత చరిత్రను రాసినారు.
[/author]