అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -1

మెగాసిటీ తెలుగువాళ్ళ కోసమా తమిళుల కోసమా?

“బెంగళూరుకు ఉపనగరంగా అనంతపురాన్ని అభివృద్ధి చేయాలి.” – మొన్న (ఆగస్టు 7) కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు. అంటే బెంగళూరు నగరం యొక్క జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనంతపురం వరకు (గూగుల్ మాప్స్ ప్రకారం 214 కి.మీ.) ఉందని ఒకవైపు అంగీకరిస్తూ, మనరాష్ట్రం దక్షిణభాగంలో మెగాసిటీగా అభివృద్ధిచెయ్యడానికి రాష్ట్రసరిహద్దుల్లో ఉన్న తిరుపతిని ఎంచుకోవడం ఏ రకమైన విజ్ఞతో ఆలోచించుకోవాలి. అభివృద్ధి విషయంలో మెగాసిటీ పరిధి ఒక్క ఆ నగరానికే పరిమితం కాదు. నగరం వెలుపల అన్ని దిక్కులా కనీసం 200 కి.మీ. వరకు విస్తరిస్తుంది. మనరాష్ట్రంలో మెగాసిటీగా అభివృద్ధి చెయ్యడానికి ఒక నగరాన్ని ఎంచుకోవాలంటే ఆ నగరానికి నలువైపులా మనరాష్ట్రంలోని ఎన్ని ప్రాంతాలకు ఆ అభివృద్ధి విస్తరించే అవకాశముందో ముందు చూడాలి.

ktతిరుపతి రాష్ట్ర సరిహద్దు (ఊతుకోట్టై) నుంచి కేవలం 75 కి.మీ. దూరంలో ఉంది. ఆ తర్వాత వచ్చేదంతా తమిళనాడే. తూర్పు దిక్కున చూడబోతే సముద్రమాయె (జోడించిన మ్యాపు KT.png చూడండి). ఒకవేళ మనరాష్ట్రంలోని ఇతర ప్రాంతాలన్నీ ఇప్పటికే అభివృద్ధిచెంది ఉన్నట్లైతే ఆ అభివృద్ధిలో తమిళులకూ భాగం పంచివ్వడానికి గానీ, సముద్రంలో పారబోయడానికి గానీ అభ్యంతరం ఉండనక్ఖర్లేదు (పోర్ట్ సిటీ విషయంలో ఐతే ఆ లెక్క వేరు). కానీ ఒకపక్క రాజధాని నిర్మాణానికే దిక్కులేక విరాళాల పేరుతో దీనంగా అందరి దగ్గరా అడుక్కుంటున్న మన రాష్ట్రం మెగాసిటీలాంటి అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు దాని మూలంగా చుట్టూ జరగబోయే అభివృద్ధి ఫలాలు పూర్తిగా స్వరాష్ట్రంలోని ప్రాంతాలకే అందేటట్లు చూడడం కనీస విజ్ఞత.

తిరుపతి ఇప్పటికే అంతర్జాతీయ ప్రాముఖ్యత గల యాత్రాస్థలం. దాదాపు 10 విశ్వవిద్యాలయాలు నెలకొన్న విద్యాకేంద్రం. కొత్తగా ఒకవైపు ఐటీ కేంద్రంగానూ, ఇంకోవైపు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా పారిశ్రామికాభివృధి కేంద్రంగానూ ప్రమోట్ చెయ్యబడుతున్న ప్రాంతం. అదనంగా మెగాసిటీగా కూడా దాన్నే అభివృద్ధిచెయ్యడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం అతిస్వల్పం. ఇంకా చెప్పాలంటే ఆ ప్రయత్నం కొండకు రాళ్ళు మోసినట్లే అవుతుంది.

మెగాసిటీ మూలంగా రాష్ట్రప్రజలకు గరిష్ఠంగా మేలు కలగాలంటే రాష్ట్రంలో అన్నిరంగాల్లోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు నడిబొడ్డు, ఆరు జిల్లాల ప్రజలకు 200 కి.మీ. లోపలే అందుబాటులో ఉన్న కడప నగరం అత్యుత్తమ ఎంపిక. తిరుపతి పరిధిలో ఆంధ్రప్రదేశ్ లోని కేవలం మూడు జిల్లాలే ఉండగా కడప పరిధిలోకి మొత్తం 6 జిల్లాలు వస్తాయి.

మెగాసిటీ ప్రణాళికలో భాగంగా రాష్ట్రవిభజన బిల్లులో ప్రతిపాదించిన ప్రతిష్ఠాత్మక సంస్థలు IIT, IIM, సెంట్రల్ యూనివర్సిటీలను ఇప్పటి వరకు ఒక్క యోగి వేమన విశ్వవిద్యాలయం తప్ప ఇతరత్రా ఉన్నతవిద్యాసంస్థలే లేని కడపలో నెలకొల్పడం వల్ల ఇటు ఇండస్ట్రియల్ కారిడార్లోగానీ, అటు ఐటీ కారిడార్లో గానీ భాగం కాని జిల్లాకు న్యాయం చేసినట్లవుతుంది. నిరంతర కరువుపీడిత ప్రాంతం కావడం వల్ల వ్యవసాయరంగంలో ఎటూ అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. పారిశ్రామికంగానూ రాష్ట్రంలో అట్టడుగు స్థానమే (దిగువన మూడో నంబరు పేరాలో గణాంకాల పట్టిక చూడండి). ఆ లోటును పూడ్చేలా ఇతర రంగాల్లో ఎదగాలంటే ఇదొక్కటే మార్గం.

చదవండి :  జానమద్ది విగ్రహానికి పూలదండేయడానికి అనుమతి కావాల్నా?

రాష్ట్రప్రభుత్వం తరపున పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, తదితరుల నుంచి ఇప్పటివరకు వెలువడిన ప్రకటనల ప్రకారం చూసినా ఏ ఒక్క అభివృద్ధి ప్రణాళికలోనూ భాగం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల నుంచి వెలేసినట్లు దూరంగా ఉంచబడిన ఏకైక జిల్లా కడప. అది తప్ప మిగతా జిల్లాలన్నీ ఇటు ఇండస్ట్రియల్ కారిడార్లోగానీ, అటు ఐటీ రంగంలోగానీ, లేదా ప్రతిపాదిత ఉన్నతవిద్యాసంస్థల్లో ఏదో ఒకటి స్థాపించడానికిగానీ స్పష్టమైన హామీలు పొందినవే.

పారిశ్రామికరంగంలో దాదాపు 120 భారీ, మధ్యతరహా పరిశ్రమలతో ఇప్పటికే ఇతర జిల్లాలకు అందనంత ఎత్తులో ఉన్న చిత్తూరు జిల్లాలోనే ఒకపక్క (చిత్తూరు, ఒంగోలులలో) National Investment and Manufacturing Zones (NIMZ), ఇంకోపక్కన ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ కారిడార్, ఐటీఐఅర్ లే కాక జిల్లాలో ఉన్న 8 విశ్వవిద్యాలయాలకు అదనంగా ఒకేచోట రెండు కేంద్రసంస్థలను నెలకొల్పడం, పక్కనే అభివృద్ధిలో అట్టడుగున ఉన్న కడప జిల్లాకు మొండిచెయ్యి చూపడం ఏరకంగా సమన్యాయం?

  పిడుక్కు, బియ్యానికి ఒకే మంత్రమా?

రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న సంస్థల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి:

i. స్థానికులకు నేరుగా ఉపయోగపడే AIIMS, NIT, కేంద్రీయ విశ్వవిద్యాలయం లాంటివి మొదటి రకం. వీటిలో AIIMS మెరుగైన వైద్యసౌకర్యాలను స్థానికులకు నేరుగా అందుబాటులోకి తెస్తే NIT, కేంద్రీయ విశ్వవిద్యాలయం అడ్మిషన్లలో రాష్ట్రం మొత్తానికి చెందిన విద్యార్థులకు కోటా ఉంటుంది.

ii. ఇక రెండో రకం సంస్థలు అడ్మిషన్ల విషయంలోగానీ, ఇతరత్రాగానీ స్థానికతకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వని IIT, IIM లాంటివి. ఐనప్పటికీ వాటి వల్ల స్థానికంగా రెండు లాభాలున్నాయి:

స్థానికంగా నాణ్యమైన వస్తుసేవలకు గిరాకీ పెరగడం, తద్ద్వారా కొందరికి నేరుగా ఉపాధి కలగడం తక్షణ ప్రయోజనమైతే ఆయా సంస్థలు అవి నెలకొన్న ప్రాంతాల్లో గ్రోత్ ఇంజిన్స్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉండడం, మరీ ముఖ్యంగా పారిశ్రామిక, వ్యాపార/వాణిజ్యరంగాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అభివృద్ధి అవకాశాలను పసిగట్టే నైపుణ్యం గల ఎంట్రప్రెన్యూరియల్ మైండ్స్ కలవాళ్ళు దేశం నలుమూలల నుంచి అక్కడికొచ్చి శిక్షణ పొందడం ఆ ప్రాంత అభివృద్ధికి రాచబాటలు వేయగలదు. ఇది దీర్ఘకాలిక/శాశ్వత ప్రయోజనం.

పై రెండు రకాల సంస్థల్లో ఏవేవి ఎక్కడ స్థాపించాలన్న విషయమై ప్రకటనతో వారం రోజుల కిందటి వరకు రోజుకో రకంగా, ఒకదానికొకటి పొంతనలేని ప్రకటనలతో (విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, తిరుపతి నగరాల్లోనే అన్ని సంస్థలూ నెలకొల్పుతామని ఒకరోజు, విమానాశ్రయాలున్నచోటే అని ఇంకొకరోజు, 8 జిల్లాల్లో 11 సంస్థలని ఒకరోజు, 13 జిల్లాల్లో 11 సంస్థలని ఒకరోజు (“అదెలా సాధ్యమండే???”), మా చేతుల్లో ఏం లేదు, ఒక్కో సంస్థ కోసం మూడేసి చోట్ల స్థలాలు ఎంపికచేసి పంపమని కేంద్రప్రభుత్వం చెప్పిందని ఒకరోజు, 11 జిల్లాల్లో 11 సంస్థలని ఒకరోజు, ఇలా) ప్రజలకు పిచ్చెక్కించారు నారాయణగారు – ఎక్కడ నెలకొల్పితే అధికశాతం ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్న అంశాన్ని మాత్రం ఏరోజూ లెక్కలోకి తీసుకోకుండా.

చదవండి :  కడప.ఇన్ఫో పేరుతో విషం చల్లుతున్నామా?

kadapa AIIMSAIIMS: వైద్య సౌకర్యాల విషయానికి వస్తే, కోస్తాంధ్రలో విశాఖపట్నంలోని కె.జి. హాస్పిటల్ మొదలుకుని గుంటూరు మెడికల్ కాలేజీ వరకు, నాణ్యమైన వైద్యసేవలందించే ప్రభుత్వ మరియు ప్రైవేటు అస్పత్రులు చాలానే ఉన్నాయి. రాయలసీమలో ఆ మూలనున్న తిరుపతి, ఈమూలనున్న కర్నూలు తప్ప ఇతర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వైద్యసంస్థలే లేవు. సామీప్యత దృష్ట్యా కడపనుంచి ఎటువైపు చూసినా 200 కి.మీ. వరకు స్వరాష్ట్రంలోని జనావాసాలే ఉండగా AIIMS కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గుంటూరు-మంగళగిరి నుంచి రెండు దిక్కుల్లో మాత్రమే ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రాంతాలు, ఒక వైపు సముద్రం, ఇంకోవైపు పొరుగురాష్ట్రాలు ఉన్నాయి (జోడించిన మ్యాపు KG.png చూడండి). తెలంగాణవాసులకు సైతం వైద్యసేవలందించడానికి మనం సిద్ధంగా ఉన్నా, ఆ రాష్ట్రంలో మెడికల్ హబ్ గా అవతరించిన హైదరాబాదు, అదనంగా ఇంకో AIIMS రానుండడం వల్ల ప్రతిపాదిత AIIMS (ఆం.ప్ర.) పరిధి మరీ కుంచించుకుపోయి, తెలుగువారిలో అధిక సంఖ్యాకులకు అది దూరంగానే ఉండిపోతుంది. కడపలో నిర్మించినట్లైతే అరకొర వైద్యసౌకర్యాలకు పరిమితమైన ఆరు జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ఏది మేలో నిర్ణయించుకోవలసింది పాలకులే.

(పేదసాదలకు ఉపయోగపడవలసిన వైద్య సంస్థ విషయంలో పెరిగే దూరం మోయలేని భారమౌతుంది. పేషెంటు వైపు నుంచి ఆలోచించినట్లైతే – 200 కి.మీ. వరకు ప్రయాణం చెయ్యడానికి బస్సులో సాధారణంగా నాలుగైదు గంటలు పడుతుంది. పొద్దున్నే బయలుదేరితే ఆస్పత్రిలో చూపించుకుని రాత్రికి ఇల్లు చేరడానికి సరిపోయే గరిష్ఠదూరం 200 కిలోమీటర్లు. ఆస్పత్రిలో డాక్టర్లు వైద్యపరీక్షలు రాసిచ్చి, ఫలితాలతో మరుసటిరోజు రమ్మనడం సర్వసాధారణం. అలాంటప్పుడు ఆ రాత్రికి స్వగ్రామానికి వెళ్ళిరావాలనుకునే పేషెంట్లకు ప్రయాణదూరం 200 కి.మీ. మించకుండా ఉంటేనే అనుకూలం. లేనట్లైతే పేషెంటు, తోడుగా వచ్చిన అటెండెంటు ఆ రాత్రికి తప్పనిసరిగా ఆస్పత్రి సమీపంలో బసచేయాల్సి ఉంటుంది. అదొక అదనపు ఖర్చు కాగా, ఇంటిదగ్గర అత్యవసరమైన పనులేవైనా ఉన్నా, డబ్బు సర్దుబాటు చేసుకురావాలన్నా వీలుపడని పరిస్థితి. ఇవన్నీ అధికసంఖ్యాకులైన అల్పాదాయవర్గాలకు చెందిన సగటు పేషెంట్లు పడే బాధలు. ఇన్-పేషెంటైతే అదొక లెక్క. అలా కాక కొన్ని వారాలపాటు రోజూ డాక్టరు దగ్గర చూపించుకోవలసిన పేషేంట్లు వేలూరు CMC లాంటిచోట్లైతే కొన్ని వందల మంది ఉంటారు. వీళ్ళలో చాలా మంది చెట్ల కింద, లేదా దగ్గర్లోని లాడ్జిలలో ఒక్కోసారి నెలల తరబడి ఉండిపోవలసి వస్తుంది. కాబట్టి పేదవారికి సేవలు అందించవలసిన వైద్యసంస్థలెప్పుడూ వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల ప్రజలకు వీలైనంత దగ్గరగా ఉండడమే ఉత్తమం.)

పారిశ్రామిక రంగంలో:

1990ల ప్రథమార్థంలో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు కడపకు వచ్చారు. ఆయన మంత్రిమండలిలో రక్షణమంత్రిగా ఉండిన శరద్ పవార్‌ అంతకు కొన్నిరోజుల క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావడం వల్ల, రక్షణ శాఖ అప్పటికి పి.వి.యే చూస్తున్నారు. కడప బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన, ఈ జిల్లాలో ఖనిజవనరులెన్ని ఉన్నా ఈ జిల్లా పారిశ్రామికంగా అట్టడుగున ఉందని, వీలైతే ఇక్కడ (సైన్యానికి అవసరమైన ఆయుధాలను ఉత్పత్తిచేసే) ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ (https://ofbeproc.gov.in/) ఏర్పాటు చేస్తానని అని ఉన్నారు. ఆ మాట నిజం చేసే అవకాశం తొలిసారిగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యు.పి.ఏ. ప్రభుత్వం ఏర్పడినప్పుడు వచ్చింది.

చదవండి :  '14న బాబు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు'

రక్షణ శాఖకు చెందిన “మినీరత్న” భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) కర్మాగారం ఒకటి రాష్ట్రంలో నెలకొల్పే ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పట్లో ఈనాడులో వచ్చిన వార్తల ప్రకారం రాష్ట్రం మొత్తమ్మీద అందుబాటులో ఉన్న భూముల్లో కడప నగర శివార్లలోని కొప్పర్తి పారిశ్రామికవాడ అత్యుత్తమమని తేలింది. ఆ తర్వాత రాష్ట్రంలో అదనంగా అనంతపురం, ఇబ్రహీంపట్నం లలో కూడా బిడిఎల్ కర్మాగారాలను ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చింది రక్షణశాఖ.

తీరా కడపలో పనులు మొదలయే సమయానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ కర్మాగారాన్ని చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గంలోని పీలేరుకు తరలించుకుపోయాడు. చిత్తూరు జిల్లా పారిశ్రామికంగా కడప కంటే వెనుకబడి ఉన్నట్లైతే తరలించుకుపోయినా ఏ బాధా ఉండేది కాదు.

కానీ అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారమే జిల్లాలవారీ భారీ, మధ్య తరహా పరిశ్రమల వివరాలు ఇలా ఉన్నాయి (Src: www.apind.gov.in/library/district/kadapa.pdf and other similar links):

కడప: 11
చిత్తూరు: 102
అనంతపురం: 42
కర్నూలు: 39
శ్రీకాకుళం: 29
విజయనగరం: 22
విశాఖపట్నం: 73
తూగో: 57
పగో: 52
కృష్ణా: 80
గుంటూరు: 38
ప్రకాశం: 30
నెల్లూరు: 38

ఇవి పాత గణాంకాలే. కానీ ఇందులో పేర్కొనని, తదనంతర కాలంలో ఏర్పడిన పరిశ్రమల గురించి చెప్పాల్సివస్తే, కడప జిల్లాలో భారతి సిమెంట్స్ ఉండగా, చిత్తూరు జిల్లాలోని ఒక్క శ్రీసిటీ సెజ్ లోనే మొత్తం కడప జిల్లాలో ఉన్నన్ని భారీ బహుళజాతి పరిశ్రమలున్నాయనడం అతిశయోక్తి కాదు (మొత్తం అక్కడున్న పరిశ్రమల సంఖ్య 56. http://www.sricity.in/customer.html). మన్నవరంలోని BHEL, కడప నోటికాడినుంచి లాక్కున్న BDL వాటికి అదనం.

కొసమెరుపేమిటంటే అప్పటి ముఖ్యమంత్రి మోకాలడ్డినా రక్షణ శాఖ కొప్పర్తి భూముల మీద ఆశలు ఇంకా వదులుకోలేదు. అదే రక్షణశాఖ మళ్ళీ అదే కొప్పర్తిలో ఇప్పుడు మూడువేల ఎకరాల్లో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిచూపింది (http://www.andhrajyothy.com/node/62633). అలాగే కడప దగ్గర విమానాల విడిభాగాలను ఉత్పత్తిచేసే పరిశ్రమ నెలకొల్పే అంశం కూడా గత రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కార్యరూపం దాల్చలేదు.

కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలు ఏర్పాటుచేయించడానికి ఇప్పుడైనా చొరవచూపుతుందా?

(సశేషం)

– త్రివిక్రమ్

(g.trivikram@gmail.com)

రచయిత గురించి

సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

మిడిమేలపు మీడియా

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ …

ఒక వ్యాఖ్య

  1. kadapa janalaku jarigina inko pedda avamanam entante migilina 12 dist laku minister post lu ichadu..aa minister aa dist lalo abivruddi chesthunnademo kani ikkada prajalu votes veyaledane kopanni ippudu ee janala mida chuputunnadu.. ee sari kadapa ki vasthe cheppu tho samadanam cheppali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: