శుక్రవారం , 1 నవంబర్ 2024

‘మల్లుగానిబండ’పై ఆది మానవులు గీసిన బొమ్మలు

కడప: మైదుకూరు సమీపంలోని రాణిబాయి దగ్గర ఉన్న ‘మల్లుగానిబండ’పై ఆదిమానవులు గీసిన బొమ్మలను (రేఖా చిత్రాలను) యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ వెలుగులోకి తెచ్చింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ శనివారం ఈ రేఖాచిత్రాలను విడుదల చేశారు. చిత్రాలను అధ్యయనం చేసిన విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం అవి బృహత్ శిలాయుగం, నవీన శిలాయుగాలకు చెందినవిగా తేల్చింది.

చరిత్ర పురావస్తుశాఖ విభాగాధిపతి డాక్టరు రామబ్రహ్మం, భూవిజ్ఞానశాఖ సహాయాచార్యులు డాక్టరు కె.రఘుబాబు, చరిత్ర పురావస్తుశాఖ పరిశోధక విద్యార్థి ఎస్వీ శ్రీనివాసులు, మైదుకూరుకు చెందిన రాజేష్ రేఖచిత్రాలను కనుగొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మైదుకూరు – బద్వేలు దోవలో  9వ కిలోమీటరు నుంచి 26 కిలోమీటర్ల మధ్య దక్షణం వైపు కడప బేసిన్ రూపాంతర ప్రాప్త అవశేష శిలలతో నిర్మితమై ఉందన్నారు.

చదవండి :  21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు
ఆదిమానవులు గీసిన బొమ్మలు
ఆదిమానవులు గీసిన రేఖాచిత్రాలు

ఈ శిలలను క్వార్త్జెట్ శిలలంటారని చెప్పారు. ఇవి క్వార్ట్జ్, ఐరన్ ఆక్సైడ్‌లతో నిర్మితమై ఉంటాయి. ఈ రాతి ఆవాసంలో సుమారు 100 వరకు మానవుల, జంతువుల రేఖాచిత్రాలు వివిధ భంగిమల్లో తెల్లని రంగుతో చిత్రించారన్నారు. త్రిశూలాన్ని ధరించిన మానవులు, తోడేలుపై చేతిలో రెండు వైపులా త్రిశూలాన్ని ధరించిన మనిషి ప్రయాణం, బంతిని చేతబట్టిన మానవులు, తలకు కవచం, గుర్రంపై ఖడ్గంతో పల్లకిలో ప్రయాణించే వీరుడు, గాడిదలతో తలపడే సన్నివేశాలు, చెట్టుపై తేనెపట్టు ఇలా పలు రకాల రేఖాచిత్రాలు గుర్తించామన్నారు. ఇవి కెయోలిన్ అనే బంకమన్నుతో గీశారని వేల సంవత్సరాల కాలం నాటివిగా వివరించారు. ఆదిమానవులు ఉమ్మిని, జంతువుల కొవ్వును, ఎముకల పొడిని జిగురు పదార్థంగా ఉపయోగించారని చెప్పారు.

చదవండి :  'సాహిత్య విమర్శ'లో రారాకు చోటు కల్పించని యోవేవి

ఈ రాతి నివాసాన్ని స్థానికంగా ‘దివిటి మల్లన్న బండ లేదా మల్లుగానిబండ’ గా పిలుస్తారన్నారు.

పరిశోధనా బృందాన్ని ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ అభినందించారు. పరిశోధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ కన్జర్వేటరు ఆఫ్ ఫారెస్టు ప్రిన్సిపల్ ఎ.వి.జోసఫ్, కన్జర్వేటరు వైల్డ్ లైఫ్ సర్కిల్ శాంతిప్రియా పాండే, కడప కర్నూలు అధికారులు రవికుమార్, శివశంకర్‌రెడ్డి, ప్రొద్దుటూరు డీఎఫ్‌వో సామివివేకానంద, సువర్ణకుమార్ సహకరించారన్నారు.

ఇదీ చదవండి!

యోగి వేమన విశ్వవిద్యాలయంపై

ఈరోజు యోగి వేమన విశ్వవిద్యాలయ బంద్

యోవేవి పాలకుల తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం విశ్వవిద్యాలయ బంద్‌కు పిలుపునిచ్చినట్లు రాయలసీమ విద్యార్థి వేదిక కోకన్వీనరు దస్తగిరి, ప్రతినిధి నాగార్జున …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: