సోమవారం , 23 డిసెంబర్ 2024
రెక్కలు కథ

రెక్కలు (కథ) – కేతు విశ్వనాథరెడ్డి

కేతు విశ్వనాథరెడ్డి కథ – రెక్కలు

ఆ ‘ముగ్గురూ ఖాకి దుస్తుల్లో ఉన్న ఆడపిల్లలని తెలుస్తూనే ఉంది, వాళ్ళ ఎత్తుల్ని బట్టి, కదలికల్ని బట్టీ, పోలీసు స్టేషన్‌ ముందు ముసలి కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ ఆ ముగ్గురూ అటూ ఇటూ చూస్తూ నిల్చున్నారు. వాళ్ళకు దగ్గరలోనే మూడు బ్యాగులున్నాయి. మాకులాగే వాళ్ళకు కూడా ఎలక్షన్‌ డ్యూటీ పడినట్లుంది. మా రూటు లారీ ఆగీ ఆగగానే ఆ ముగ్గురాడపిల్లలూ బ్యాగులు పుచ్చుకొని లారీ వెనకవైపు నుల్బున్నారు. ఇరవై, ఇరవై అయిదేండ్లలోపు వయసుండవచ్చు. ఇంట్లో ఉన్న మా పెద్దమ్మాయి కన్నా పెద్దవాళ్ళై ఉండరు. ఆ ముగ్గురి వయనులకూ అటూ ఇటూ వయసులున్న నా కూతుళ్ళు చెయ్యలేని పని వీళ్ళు చేస్తున్నారు. ముచ్చటేసింది. కానీ ఈ రకం డ్యూటీలో గొడవలేవయినా ఎదురయితే పాపం? భయమేసింది. ఆడపిల్లల తండ్రిగా శంకించడం, కీడెంచడం, భయపడ్డం అలవాటయ్యాయి.

లారీ వెనుక తలుపు కుడిపక్క, మూలగా బాడీని ఆనుకొని వాళ్ళను చూస్తూ ఆలోచనల్లో పడ్డాను. ఆ ముగ్గురిలో ముందు నిలబడి ఉన్న అమ్మాయి తల ఎత్తి నన్ను చూస్తూ తన స్నేహితురాళ్లతో అంది.

“ఎట్లాగే…. లారీ వెనక డోరు తియ్యమందాం.”

తీస్తేనే మంచిదని నాకూ అనిపించింది. లారీలో వాళ్ళను చూశాను. పి.ఓ.లు, ఎ.పి.ఓ.లు చర్చల్లో మునిగి వున్నారు. చర్చల్లో లేని మా ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సిగరెట్‌ ఆనందంలో ఉన్నారు. డైవర్‌ ఇంజన్‌ ఆపలేదు, సీట్లోంచి దిగలేదు. క్లీనరూ దిగిరాలేదు. రూటు ఆఫీసర్‌ క్యాబిన్‌లోనే వున్నట్లుంది. కానిస్టేబులే మాట్లాడి వచ్చినట్టుంది. ఏం చేయడమా అనుకుంటూ దిక్కులు చూస్తున్నాను.

“ఇదిగో! ఇట్లాగే… చచ్చుమొగమా, చిన్నప్పుడు చింతచెట్లెక్కలేదా?” అంటూ అంతలోనే ఆ ముగ్గురి వెనుక ఉన్న అమ్మాయి ముందుకొచ్చింది.

ముసలి కానిస్టేబుల్‌ హెచ్చరించాడు, బొంగురు గొంతుతో. “జాగ్రత్త! జాగ్రత్త! తల్లీ! నీకు ముందే తొందర పాటెక్కువ. కాలుజారి పడేవు. స్టేషన్‌లో నుంచి ఒక స్టూలన్నా తెచ్చుకొని ఎక్కండి.”

అప్పటికే తొందరపాటెక్కువమ్మాయి లారీ బాడీలోకి చేరింది. లారీ వెనుక తలుపు మీదకి వంగి చెయ్యి ఊపుతూ అంది. “జారిపడటానికి ఇదేమన్నా బాత్‌రూమా సార్‌. స్టూలూ వద్దు, గీలూ వద్దు. ఊం ముందా బ్యాగు లందుకోండే.”

కింద ఉన్న ఇద్దరమ్మాయిలూ మూడు బ్యాగుల్ని అందించారు. లారీలోని అమ్మాయికి సాయపడి బ్యాగుల్ని నేను పక్కన పెట్టాను, మా పోలింగ్‌ స్టేషన్‌ ఎన్నికల సామగ్రి ఉన్న గోనె సంచి పక్క.

“ఆ ఇప్పుడెక్కండి. ఇద్దరూ ఇద్దరే. ఏం హోంగార్డులో ఏమో? ట్రాఫిక్‌ కంట్రోలే వణికిపోతూ చేస్తారు. ఇప్పుడా పల్లెల్లో సెక్యూరిటీ!”

“ఏం చేస్తాం! మనరోజులిట్లా. కానీ, ఎక్కండి మరి. ముందు నువ్వు నా చెయ్యి గట్టిగా పట్టుకో. కుడి కాలిబూటు అక్కడ ఆ మెట్టు దగ్గర అదిమి ఎడమచేత్తో ఆ కడ్డీ పట్టుకొని ఎక్కు,” గబగబా మాట్లా డుతూ, మరొకవైపు నవ్వుతూ ఆ ఇద్దరినీ ఒకరి తర్వాత ఒకరిని తొందరపాటమ్మాయి లారీలో కెక్కించింది. గోనె సంచీ మీద ముందు వైపు నింపాదిగా కూర్చొని ఉన్న మా పి.ఓ. నాగేశ్వరరావుకు ఈ దృశ్యం ఆనందం కలిగించినట్ట్లుంది. నా పక్కనున్న గోనె సంచీ మీదకు వచ్చి చేరాడు. ఆ ముగ్గురిలో ఓ అమ్మాయి గొణుక్కున్నట్లు అంది.

“ఇది తిమ్మసముద్రం రూటేనా?”

“ఏం మహాతల్లీ ఇది హిందూ మహాసముద్రం రూటనుకున్నావా? నీకెప్పుడూ ఏదో ఒక అను మానమే. ఒక్క పనీ చెయ్యలేవు ఏ అనుమానమూ లేకుండా. ముందుగా నువ్వే లారీ ముందు కట్టిన బోర్డు చూశావు. మన పలావుల సారూ చెప్పాడు. తీరా అక్కడికి వెళ్ళి నాయుడు కండ్రిగ ఇదేనా అనేవు. టోపీ లాక్కుపోతారు. మనం రెగ్యులర్‌ పోలీసులం కూడా కాదు. నోరు లేని జనం భయపడ్డానికి.”

“చూడండి సార్‌!” తొందరపాటమ్మాయి నావైపు తిరిగి అడిగింది.

“ఏం చెప్పేది!” అని అందామనుకున్నాను. జవాబుగా నవ్వి ఊరుకున్నాను. ఆ అమ్మాయి కూడా బదులు నవ్వేసింది.

అటు తిరిగి తన ‘స్నేహితురాళ్ళతో మాటల్లో పడిపోయింది. తొందరపాటమ్మాయి కలుపుగోలుతనం చూసి నాలో నేనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఈ అమ్మాయికి తొందరపాటెక్కువ అని పోలీసు కానిస్టేబుల్‌ అంటే అన్నాడు. కానీ, నాకట్లా అనిపించలేదు. మనస్తత్వంలో దృఢత్వం ఉన్నట్లుంది.

మనిషి సన్నగా ఉంది. మధ్యరకం ఎత్తు. పలచటి ముఖం. అతికినట్లు ముక్కు. గోధుమరంగు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించే అందం కాకపోవచ్చు. ముఖం తీరులో ఆకర్షణ ఉంది. కళ్ళలో తెలివి, చిలిపితనం, ధీమా, నిర్లక్ష్యం కనిపిస్తున్నాయి. ఆషామాషీ మాటతీరులో కొంటెతనం ఉంది. ఆకట్టుకునే లక్షణముంది. సందడి పిల్ల అనుకున్నాను.

లారీ టౌన్‌ దాటి తిమ్మసముద్రం దుమ్ము రోడ్డు మీద నెమ్మదిగా వెళుతుంది.

కేతు విశ్వనాథరెడ్డి కథ రెక్కలు

‘స్నేహితురాళ్ళతో మాట్లాడుతున్నదల్లా ఆగి ఆ సందడి పిల్ల నన్ను అడిగింది. “మీరే పోలింగ్‌ స్టేషన్‌ సార్‌?”

మా పి.ఓ… నాగేశ్వరరావు సమయం కోసమే కూర్చున్నట్లు జోక్యం చేసేసుకున్నాడు. “మా ఇద్దరిదీ ఏరువపాళెం. నేను ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ని. ఈయన మా ఎపి.ఓ..”

నాగేశ్వరరావును ఆ అమ్మాయి ఎగాదిగా చూస్తూ అడిగింది. “ఏరువపాళెం హరిజనవాడా సార్‌?”

“ఆ అదే,” అన్నాను నేను.

“నాకు డ్యూటీ వేసింది కూడా అక్కడే సార్‌,” అంది ఆ అమ్మాయి.

“మీ… నీకా?” నాగేశ్వరరావు ఆశ్చర్యపోయాడు.

“అవును సార్‌. నాకే. మీకేసినట్లే. వీళ్ళందరికీ వేసినట్లే,” అందరినీ చూపుతూ అంది.

“మా… మన పోలింగ్‌ స్టేషన్‌కు ఎంతమంది పోలీస్‌ పర్సనల్స్‌ని వేశారు?”

“ఏం సార్‌ ! ఏ పదిమందో లేకపోతే ఎలక్షన్‌ డ్యూటి చేసేటట్లు లేరే?”

ఆ మాట విన్న ఒక పి.ఓ. నవ్వుతూ అన్నారు.

“ఈ రూట్లోని స్టేషన్‌లు సమస్యలు లేనివి లెండి.”

గత ఎన్నికలలో మా ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ గా వున్న ఆర్ట్స్‌ కాలేజీ లెక్చరర్‌ నాగేశ్వరరావ్‌ వైపు తిరిగి అన్నాడు. “మీకేం పరవాలేదు మీ ఎ.పి.ఓ.. గారే అన్నీ చేసుకుపోతారు. చూసుకుంటారు. పోయిన ఎలక్షన్‌ లో చూసినా కదా. కొంత సీరియస్‌ మనిషి. అయితేనేం! పనిలో అఖండుడు. బ్యాలెట్ల మీద సంతకాలు పెడుతూ మీరు కూర్చుంటే చాలు.”

చదవండి :  'వాళ్ళు సీమ పేరు పలకడానికి భయపడుతున్నారు'

“అలా కింద వాళ్ళకే బాధ్యత అప్పగించడం నాకు సుతరామూ ఇష్టముండదండి. ఆఫీసరనే వాడు వేయి కళ్ళతో పని చేయించాలి ఎవరితోనైనా”, మహిళా హోంగార్డుల వైవు ముఖ్యంగా సందడి అమ్మాయి వైపు చూస్తూ నాగేశ్వరరావు పి.ఓ. దర్పంతో అన్నాడు.

లెక్చరర్‌ నా వైపు చూసి నవ్వి, పక్క మిత్రులతో మాటలు కలిపాడు. వాదం ముగిసింది.

తిమ్మసముద్రం రూటులో మలుపు దారిలోని మొదటి పోలింగ్‌ స్టేషన్‌ చేరడానికి గంటపైగా పట్టింది. అక్కడి పి.ఓ., ఎ.పి.ఓ.లతో సహా ఒక హోంగార్డు దిగింది.

లారీ లోంచే మా సందడి హోంగార్డు రూటు ఆఫీసర్‌తో కేక వేసి చెప్పింది.

“సార్‌! రూట్‌ ఆఫీసర్‌గారూ! అది నోరు లేనిది. కొంచెం బాగా చూడమని అందరికీ చెప్పి రండి.”

“అట్లానే అట్టానే,” రూట్‌ ఆఫీసర్‌ హామీ ఇచ్చాడు.

మా హోంగార్డు మిత్ర రక్షణ పద్ధతి చూసి ఆడపిల్లలంటే ఇట్లా ఉండాలి అని అనుకున్నాను. తిరిగి తిమ్మసముద్రం రూటులో పడి మరొక గంట ప్రయాణం చేసి రెండో పోలింగ్‌ స్టేషన్‌ చేరుకున్నాం. అక్కడ పోలింగ్‌ అధికారులిద్దరూ, అనుమానాల హోంగార్డు దిగాక మా హోంగార్డు ప్రిసైడింగ్‌ ఆఫీసరైన లెక్చరర్‌తో అంది.

“సార్‌ సార్‌ ! అది అనుమానపు పక్షి. మరేమి అనుకోకుండా మీలో ఒకరిగా చూసుకోండి.”

“అమ్మయ్య వీళ్ళిద్దరికీ ఇక ఇబ్బంది లేదు మనం మిగిలాం ఇంకెంత దూరమో? చీకటి పడేటట్ట్లుంది,” తనలో తాను మాట్టాడుకుంటున్నట్లు నా వైపు చూస్తూ మా సందడి హోంగార్డు అంది.

దూరం తెలియదు. ఈ రూటులో మాది చివరి పోలింగ్‌ స్టేషన్‌. జవాబివ్వలేదు.

ఈలోపు నాగేశ్వరరావు ఆ అమ్మాయితో మెల్లిగా కబుర్లు ప్రారంభించాడు. ఇప్పుడు లారీ బాడీలో ముగ్గురమే ఉన్నాం. నాగేశ్వరరావు కబుర్లు వినకూడదనుకున్నా సారం చెవున బడింది. మొదట్లో ఒకటి రెండు పొడి మాటల్లో ఆ అమ్మాయి ఉద్యోగ కర్తవ్యదీక్షను పొగిడాడు. ఆ తర్వాత వరుసగా తన చదువు, ఉద్యోగం, హోదా, అధికారాలు, ఇష్టాల దండకం చదివాడు. తను కాకినాడ ఇంజనీరింగ్‌ కాలేజీలో బి.ఇ. చదివాడట. కాలేజీ రోజుల్లో స్టూడెంట్‌ ఛైర్మన్‌ అట. తమది తాడేపల్లిగూడెం దగ్గరట. తమది మంచి ఆస్తి, పలుకుబడి ఉన్న కుటుంబమట. రోడ్డ, భవనాల శాఖలో చేరి ఐదేళ్ళయ్యిందట. తమవైపు జనం చాలా నాగరికంగా ఉంటారట. ఇంతమందిలో ఆ అమ్మాయిలోనే నాగరికత చూసి ఆశ్చర్యపోయా డట. ఏ కళ నుందో సందడి హోంగార్డు చురకలేయకుండా వింది. విందో లేదో?

మా పోలింగ్‌ స్టేషన్‌ ఏరువపాళెం హరిజనవాడకు చేరుకొనేసరికి చీకట్లు ముసురుకొస్తున్నాయి.

మా పోలింగ్‌స్టేషన్‌ హరిజనవాడకు అరకిలోమీటరు దూరంలో ఉన్న స్కూలు బిల్డింగు. ఇళ్ళు లేని ఏరువపాళెం దాటి, మాలవాడ దాటి, హరిజనవాడ మీదుగా వచ్చి చేరుకున్నాం. లారీ ఆగాక నాగేశ్వరరావు ముందు దిగాడు. తన బ్రీఫ్‌కేసు అందివ్వమని పురమాయించాడు. అందించాను. అందుకొని మాటా పలుకు లేకుండా స్కూలు ఆవరణ లోనికి కొంత దూరం వెళ్ళి నిల్చొని ఒళ్ళు విరుచుకున్నాడు. సిగరెట్‌ ముట్టించుకున్నాడు. ఎన్నికల సామాగ్రి ఉండే రెండు గోనె సంచుల్నీ, నా చిన్న సూట్‌కేసును, తన బ్యాగ్‌ను దింపుకోవడంలోనూ తోందరపాటమ్మాయే, సందడి పిల్లే, మహిళా హోంగార్డే తోడ్పడింది. అప్పుడా అమ్మాయి “పేరు అడిగాను, చనువు తీసుకొని. పంకజం అని చెప్పింది.

“ఈ స్కూలు టీచరుదానా ఇక్కడ ఒక పోలింగ్‌ ఆఫీసర్‌. మనం వచ్చేదాకా ఉండమంటినే. వుండి ఏర్పాట్లు అవీ చూడమని నిన్న చెప్పి పూడిస్తినే. మీరుండండి, నేనుదా పూడ్చి పంపుతాను. ఈ సర్పంచిదా వేలూరాస్పత్రిలో. వి.ఎం.లు, కె.ఎం.లు గోవింద కొట్టిరి. మాకుదా సావు,” రూట్‌ ఆఫీసర్‌ అసహనంగా లారీ ఎక్కి వెళ్ళబోతున్నాడు. స్కూల్‌ టీచర్‌ ఇద్దరు పిల్లలతో వచ్చాడు. వాళ్ళ చేతుల్లో రెండు లాంతర్లున్నాయి. స్కూల్‌ టీచర్‌తో మాట్లాడి రూట్‌ ఆఫీసర్‌ వెళ్ళిపోయాడు.

పిల్లలు మా సామాగ్రిని స్కూల్‌ గదిలోకి చేర్చారు. అది ఒకటే పొడవాటి గది. ఆ గదికి అటూ ఇటూ తలుపులైతే ఉన్నాయి. కిటికీల తలుపులైతే దాదాపు విరిగిపోయి ఉన్నాయి. స్కూల్‌ గదిలో రెండు టేబుళ్ళు, రెండు చేతులు విరిగిన కుర్చీలు, రెండు బెంచీలు ఉన్నాయి. ఒక మూల స్కూలు రికార్డు పెట్టె తాళం వేసి ఉంది. ఎడమవైపు ఒక మూల నాటిన రెండు కర్రల చుట్టూ రెండు దుప్పట్లతో ఆపాటికే “బూత్‌’ సిద్ధంగా ఉంది.

రెండు బెంచీలనూ నాగేశ్వరరావు ఎడమగోడకు దగ్గరగా పిల్లల చేత ఈడ్చించుకొని రాత్రి పడక సిద్ధం చేసుకున్నాడు. కుర్చీలో కూర్చొని బ్రీఫ్‌కేస్‌ చూసుకుంటున్నాడు. పంకజం కుడి గోడ దగ్గరలో బ్యాగు ఉంచింది. నేను మధ్యలో నా చిన్న సూట్‌కేసు పెట్టాను.

గోడలకు దిగకొట్టిన మాసిపోయిన దేశనాయకుల ఫోటోలను చూస్తూ, అట్టల మీద రాసినవాటిని నిశ్శబ్దంగా చదువుతూ గది చుట్టూ తిరిగి ఒక చోట నిలిచి పంకజం మాకు వినపడేటట్లు “స్రీలను గౌరవింపుము,” అని బిగ్గరగా చదివింది. “మంచివి రాశారు పిల్లలకు,” అని అక్కడే నిలబడిన స్కూలు టీచర్‌ను మెచ్చుకుంది.

“ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదా?” అని టీచరును నాగేశ్వరరావు అడిగాడు.

“లైన్‌లు మాత్రం ఒక అరకిలో మీటరు దూరంలో పోతున్నాయి సార్‌. మా రెండు వాడల్లోనూ కిరసనాయల బుడ్డే లైట్లు,” అని టీచరు నవ్వాడు.

“పెట్రోమాక్స్‌ లైటైనా దొరకదా?”

“ప్రయత్నిస్తిని సార్‌. దొరకలేదు. ఈ రెండు లాంతర్లలో ఒకటి మా ఇంట్లోది. రెండవది హరిజనవాడ లోని వయోజన విద్యా కేంద్రానిది. ఎలక్షన్‌లో ఈ ఇబ్బందులు తప్పవు సార్‌. ముందు ముఖాలు కడు క్కోండి. అదో ఆ ఎదురు బోరింగ్‌ ఉంది. బక్కెట్టూ, చెంబు పెట్టిస్తిని. భోజనాలు ఒక గంటకు రెడీ అవుతాయి. కోడి కూడా కోయిస్తి. మీరు నాన్‌ వెజిటేరియన్‌ కదా?”

చదవండి :  కువైట్ సావిత్రమ్మ (కథ) - చక్రవేణు

“వెజిటేరియన్‌,” అన్నాడు నాగేశ్వరరావు.

“అడిగానని ఏమీ అనుకోకండి మీరు బ్రామ్మలా సార్‌,” పంకజం నాగేశ్వరరావును అడిగింది.

“కాదు, మా ఇంట్లో అందరం వెజిటేరియన్‌లమే. ఎగ్‌ కూడా తినం. మా బంధువుల్లో కూడా అందరూ అంతే. మీరు తింటే నాకు అభ్యంతరం లేదు.”

తనకు పట్టింపులు లేవని పంకజం అంది.

“మా కలవాటే,” అని నేనన్నాను.

స్కూలు టీచరు, “సాంబార్‌ కూడా చేయిస్తి సార్‌,” అని పిల్లలను తీసుకొని వెళ్ళిపోయాడు.

పంకజం తన టోపీ తీసి పక్కన పెట్టింది. సబ్బు తీసుకొని ముఖం కడుక్కొని వచ్చింది. నేనూ, నాగేశ్వరరావు బోరింగ్‌ దగ్గరకు నడిచాం. మేము తిరిగి వచ్చేలోగా పంకజం చక్కగా చీరలోకి మారి వుంది. జుట్టు దువ్వుకుంటూ ఉంది. పోనీటెయిల్‌ వేసుకుంది. పంకజం వంక నాగేశ్వరరావు కళ్ళార్పకుండా తమకంతో చూడడం గమనించాను.

భోజనాల సందర్భంలో పంకజం కోడి ముక్కను కొరుకుతూ నాగేశ్వరరావును కదిలించింది.

“కూటికి పనికి రాని బ్రాహ్మణ్యం వదిలించుకోవాలని మేము చూస్తుంటే, అందులోకి కమ్మ బ్రాహ్మలని, రెడ్డి బ్రాహ్మలని మీరు జొరబడితే ఎట్లా సార్‌?”

నాగేశ్వరరావు ఆశ్చర్యపోతూ అడిగాడు. “నువ్వు బ్రాహ్మిన్‌ వా… పంకజం?”

“ఆ… శుభ్రంగా. అక్షరాలా. వైఖాసనులం. భారద్వాజస గోత్రమ. ఇంటి పేరేమనుకుంటున్నారు? ‘సేనాధిపత్యం! ఇప్పుడిట్లా హోంగార్డుల సేనలో రోజుకు పదిహేను రూపాయల దినకూలిలో ఉన్నాననుకోండి. అది వేరే సంగతి,” పంకజం పడిపడి నవ్వసాగింది.

మా ఇంట్లో ఏ రోజూ కూడా భోజనాల సమయంలో ఇంతటి సంతోష వాతావరణం నేను చూడ లేదు. కడుపు నిండా భోంచేశాను. అందరి భోజనాలయ్యాయి.

స్కూలు టీచరు పంకజాన్ని అడిగాడు. “రాత్రి మా ఇంట్లో పడుకొని ఉదయాన్నే రావచ్చు కదా సిస్టర్‌?”

“నాకేమీ ఇబ్బంది లేదు సార్‌. ఇది అడవి కాదు. తోడు మన సార్లున్నారు,” అంది పంకజం.

పంకజం ఆ విషయాన్ని అంత మామూలుగా తీసుకోవడం చూసి చకితుణ్ణయ్యాను. పంకజాన్ని నాగేశ్వరరావు మర్మంగా చూసినట్లు నాకనిపించింది. నాది అనుమానమే కావచ్చు.

టీచరు, టీచరుతో వచ్చిన మరో ఇద్దరూ ఖాళీ గిన్నెలు తీసుకుని వెళ్ళిపోయారు.

రెండు బెంచీల మీదా నాగేశ్వరరావు పడుకున్నాడు. రెండు నిమిషాలాగి, “నాకు వెలుతురుంటే నిద్ర రాదండి,” అన్నాడు పైకప్పు కేసి చూస్తూ.

ఆయన వైపున్న లాంతర్ని ఆర్పివేశాను. మరొక లాంతర్ని పంకజం వైపు మూల బాగా వత్తి తగ్గించి పెట్టాను. గుడ్డి వెలుగులో నేను మధ్య పడుకున్నాను. పంకజం అటు చివర పడుకుంది.

నాకు ఒకంతట నిద్ర రాలేదు. కిటికీల్లోంచి బయట ఏమీ కనిపించడం లేదు. ఎక్కడో దూరం నుంచి ఏకతార మీద గొంతెత్తి పాడుతున్న ఒక తత్వం వినబడుతోంది. “ఏమి తలచి నన్ను మోహిస్తివీ దేహ మేలాటిదని ఆలోచిస్తివి స్వామీ మోహమె కాని సారమేమియు లేదు. మోము కన్నులలోన మధురాపు మాంసములే గాని” అంటూ ఇలా- పాటగత్తె పల్లవిని సాగదీస్తూ మళ్ళీ మళ్ళీ పాడుతోంది. నా చిన్నతనంలో ఆ పాటను మా ఊళ్ళో సిద్ధమ్మ పాడుతుంటే చాలాసార్లు విన్నాను. పాటగత్తె కొన్ని నిమిషాలు ఆగింది.

“పుట్టి ఆ దారినే వస్తివి మరలా, ఆ దారి కాశిస్తివీ’ అనే చరణాలు ఎత్తుకుంది. అది దేహం మీద ద్వేషమా? ఏ మోక్షం మీదో వ్యామోహమా? బతుకులోని బాధల్ని తట్టుకునే కవచమా? మనసు కకావికల మవుతోంది. ఈ పాట వింటుంటే నాగేశ్వరరావుకు ఏమనిపిస్తోందో? పంకజం నవ్వుకునే ఏ వ్యాఖ్య చేస్తుందో? మా అమ్మాయిలు వింటే ఏమంటారు? ఏమైనా జీవితాన్ని చూసే పద్ధతి ఇది కాదేమో! పాట ఆగింది. మధ్య మధ్య తీతువు అరుపులు వినిపిస్తున్నాయి. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. ఏదో అలికిడైంది. మెలకువ వచ్చింది. చీకటి. ఏమీ కనిపించడం లేదు. మూలనున్న లాంతరు కూడా కునికి కునికి ఆరినట్లుంది.

ఆ చీకట్లో పంకజం గొంతు స్పష్టంగా వినిపించింది.

“ఏం పి.ఓ. సార్‌ ? నిద్ర రావడం లేదా? కొంపదీసి నన్ను మీ భార్య అనుకున్నారేమిటి?”

“ప్లీజ! పంకజం! నెమ్మది,” నాగేశ్వరరావు కంగారు గొంతు గుసగుసలు వినిపించాయి.

నేను లేచి కూర్చొని తల దగ్గరే పెట్టుకున్న టార్చిలైట్‌ వేశాను. పంకజం కాళ్ళ దగ్గర నాగేశ్వరరావు ఉన్నాడు.

“ఏం సార్‌ మీరు బయటకేమన్నా పోవాలా?” అని అడిగాను. “కొత్త చోటు నిద్ర రావడంలేదు. బయటకెళ్ళి సిగరెట్‌ తాగుదాం అనుకున్నా. చీకటి తలుపు కనపడటం లేదు,” నాగేశ్వరరావు అయోమయంగా జవాబిచ్చాడు.

అది అబద్ధమని తెలుస్తూనే ఉంది. ఆయన పడుకున్న వైపే ఒక తలుపు ఉంది. సిగరెట్టు అలవాటున్న మనిషి. అగ్గిపెట్టె దగ్గరుండకపోదు.

పంకజం వైపు చూశాను, నిశ్చింతగా అటువైపు తిరిగి పడుకుంది. టార్చిలైటు వెలుతుర్లో నాగేశ్వర రావు తడబడుతూ తన పడక దగ్గరకు చేరుకొని అక్కడున్న లాంతరు ముట్టించాడు. వత్తి పెద్దది చేసి, తలుపు తీసి బయటికి వెళ్ళి ఐదు పది నిమిషాలున్నాడు.

ఈ లోపు, “ఏమ్మా పంకజం” అని పిలిచాను. గాఢంగా నిద్రపోతూ ఉంది. నాగేశ్వరరావు లోపలికి వచ్చాడు. లాంతరు వత్తి తగ్గించి పడుకున్నాడు. నేను నిశ్చింతగా నిద్రలోకి ఒరిగాను.

బోరింగ్‌ కొడుతున్న శబ్దం వినిపించింది. నిద్ర చెడింది. మండుతున్న కళ్ళు తెరిస్తే చుట్టూ ఏమీ కనిపించలేదు. లాంతరు ఆరిపోయిందనుకున్నాను. టార్చి వెలుతుర్లో చూస్తే బెంచి మీద నాగేశ్వరరావు లేడు. నేల మీద పంకజం లేదు. అటూ ఇటూ తలుపులు రెండు తెరచి ఉన్నాయి. తలుపు దగ్గరికి వచ్చాను. పంకజం గొంతు వినిపించింది.

రెక్కలు కథ“సార్‌… పి.ఓ.. సార్‌ ! ఇట్లా రావద్దు స్నానం చేస్తున్నా. నా శీలమేది పోదనుకోండి… అయినా మర్యాద. అయిదు నిమిషాలాగండి. ఇట్లా రావద్దు. ఆ లాంతర్ని లోపల పెట్టండి.”

చదవండి :  సియ్యల పండగ (కథ) - తవ్వా ఓబుల్‌‌రెడ్డి

నేను, “సార్‌,” అని నాగేశ్వరరావుని పిలిచాను.

గబగబా లాంతరుతో తిరిగి వచ్చి, నాగేశ్వరరావు వదరుతూ సంజాయిషీ చెప్పాడు.

“మీరూ లేచారా! మంచిదైంది. కడుపులో బాగా లేదండి,” అంటూ కడుపు చేత్తో పట్టుకున్నాడు.

“ఇటువైపు పోదాం పదండి. నేను తర్వాత బక్కెట్‌తో నీళ్ళు తెస్తాను,” అన్నాను.

స్కూలు వెనుక ఉన్న మైదానంలోకి కొంతదూరం నాగేశ్వరరావుని తీసుకువెళ్ళాను. లాంతరు ఒకచోట పెట్టి నేను దూరంగా నిలుచున్నాను. పది పదిహేను నిమిషాలు అటూ ఇటూ తిరిగి నాగేశ్వరరావు వెనక్కి వచ్చాడు.

“ఇప్పుడు నెమ్మదించిందండీ,” అన్నాడు నాగేశ్వరరావు తన దొంగబుద్ధిని కప్పిపుచ్చుకుంటూ.

“అయితే నెమ్మదిగా రెడీ అవుదాం,” అన్నాను.

నాగేశ్వరరావు మౌనంగా నా వెంట నడిచాడు. మేము స్కూలు గదిలోకి వచ్చే వేళకు పంకజం హోంగార్డు యూనీఫాంలో ఉంది. బూట్ల లేసులు కట్టుకుంటోంది.

ఏమీ జరగనట్లే, “తొందరగా మీరు తయారుకారా సార్‌?” అంది పంకజం.

ఎన్నికల తేదీనాటి మా దినచర్య మొదలయింది. ఎనిమిది గంటలకు పోలింగ్‌ ప్రారంభించాం. స్కూల్‌ టీచర్‌ ఒక పోలింగ్‌ ఆఫీసర్‌. మరో పోలింగ్‌ ఆఫీసర్‌ పక్క గ్రామం నుంచి వచ్చింది. ఇద్దరు ఏజెంట్లున్నారు. సమస్యలేవీ రాలేదు. వోటింగ్‌ మందకొడిగా సాగింది. వోటర్లను క్రమబద్ధంగా పంపడంలో పంకజం బాగా శ్రమ పడింది. విసుగు లేదు. చాకచక్యంతో నవ్వుతూ, నవ్విస్తూ పని చేసింది. నాగేశ్వరరావు మొదట్లో బెట్టు చేశాడు. దర్పం ప్రదర్శించాడు. వ్యవహారాలన్నీ నేను, మరో ఇద్దరు పోలింగ్‌ ఆఫీసర్లే చూసుకున్నాం. సాయంకాలం నాలుగూ యాభై అయింది. డెబ్బె శాతం ఓట్లు పోలయ్యాయి.

“ఇక కట్టేద్దాం ఫారాలన్నీ పూర్తి చేసుకోవాలి. చాలా ప్రానీజరుంది,” అన్నాడు మా పి.ఒ నాగేశ్వర రావు.

“ఈ పదినిమిషాలు చూద్దాం సార్‌,” అన్నాను.

“ఇంకెవరు వస్తారండి చాదస్తం గానీ,” అని నాగేశ్వరరావు గొణిగాడు.

నాలుగైదు నిమిషాలుందనగా పంకజం లోనికి వచ్చి అంది. ‘సార్‌! ముప్పై మంది దాకా మిగిలి నట్లుంది. పదిహేనుమంది బయట ఉన్నారు. మిగతా వంద గజాల్లో దారిలో వస్తూ కనపడుతున్నారు.”

“కుదరదు,” అన్నాడు మా పి.ఓ. ఏజెంట్లు అప్పటికే వెళ్ళిపోవడం గమనించి.

“ఇంకా మూడు నిమిషాలుంది కదా సార్‌ . కూలికి వెళ్ళేవాళ్ళు. మనలాగా తీరిక ఉండద్దూ. చీట్లిచ్చి ఐదు దాటినా పోలింగ్‌ జరపండి సార్‌,” అంది పంకజం.

“బూత్‌ను దృష్టిలో పెట్టుకుంటే, అట్లాగే చేయడం మంచిదనిపిస్తుంది సార్‌,” అన్నాను.

మా పోలింగ్‌ ఆఫీసర్లు నన్ను సమర్ధించారు. మా పి.ఓ. సణుగుతూ అంగీకరించాడు.

రైతులుండే పోలింగ్‌ కేంద్రమైతే ఆ సణుగుడు ఉండేది కాదనుకున్నాను. ఆరు గంటలకు పోలింగ్‌ పూర్తి అయింది. ఏడుకల్లా బ్యాలెట్‌ పెట్టెలకు సీలు వేయడం, మిగతా ఫారాలు పూర్తి చేయడం, కట్టడం వగైరాలు ముగిశాయి. స్కూలు టీచరు మాతోనే ఉన్నారు. మహిళా పోలింగ్‌ ఆఫీసరు వెళ్ళిపోయింది. ఆలస్యం కావచ్చునని స్కూలు టీచరు భోజనాల ఏర్పాటు చేస్తానని వెళ్ళి అన్నం, చట్నీ, మజ్జిగ తెప్పిం చాడు. తనకు భోజనం అక్కరలేదని నాగేశ్వరరావు అన్నాడు.

మేము భోజనం ముందు కూర్చున్నాం. నాగేశ్వరరావు మెరుపుదాడి చేశాడు. “పోలీసుస్టేషన్‌లో మానభంగాలుంటాయని రాస్తుంటారు కదా? ఆడ పోలీసులు చాలకా?” ఈ ప్రశ్నకు నేను దిగ్భాంతుణ్ల య్యాను.

పంకజం భోజనం మధ్యలో లేస్తూ గంభీరంగా అడిగింది, “తెలుగు సినిమాల్లో అయితే మీ డైలాగు బాగుండేదేమో సార్‌. నాకు అన్నం సహించడం లేదు. ఆ మాట అనే నోటితో మీరెట్లా తినగలుగు తారో రోజూ?”

చావుదెబ్బ తిని కూడా నాగేశ్వరరావు రెచ్చిపోలేదు. దానికి సంతోషం! ఒక మహిళా హోంగార్డు ముందు ఆ మాట అనగలిగాడు గానీ, ఏ మగపోలీసు ముందో ఈ పెద్దమనిషి, ఈ అధికారి ఒక్కమాట అనగలడా అనుకున్నాను.

లారీ వచ్చింది, రాత్రి పదకొండు గంటల ప్రాంతాల్లో, అపరాత్రికి నియోజకవర్గ కేంద్రం చేరు కున్నాం. పని పూర్తయ్యాక మా పి.ఓ. వెళ్ళొస్తానని కూడా చెప్పకుండా మాయమయ్యాడు.

పంకజం వీడ్కోలు చెప్పడానికి నా దగ్గరకు వచ్చింది. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నేను కదిలి పోయాను. “ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావమ్మా?” అన్నాను.

“పదో క్లాసు తప్పిన దానికి మరేం ఉద్యోగం దొరుకుతుంది సార్‌? నా మీద ఆధారపడుతున్న వాళ్ళు నలుగురున్నారు. నాన్న లేడు. ఎక్కడైనా ఏదో ఒకటి ఉంటుంది కదా సార్‌- అందులోనూ అందరికీ అలుసుగా కనిపించే మా ఆడాళ్ళకు,” అంది పంకజం.

“ఆ పి.ఓ.. వెధవ…” మాట పూర్తిచేయలేకపోయాను.

“అదొక రకం ఊరకుక్క సార్‌. అదిలిస్తే పారిపోయే రకం,” పంకజం పగలబడి నవ్వింది. “పిచ్చి కుక్కలు వెంటబడితే ఏం చేస్తావని ఆలోచిస్తున్నారు కదా సార్‌?”

ఎబ్బెట్టుగా నవ్వాను.

“శరీరం ఒంపుసొంపులు తప్ప ఏదీ కనిపించని సంస్కారం మగాళ్ళలో ఉన్నంతకాలం నా బాధ లైనా, మీ బిడ్డల బాధలైనా, మరొకరివైనా ఇంతేనో, ఇంతకన్నా ఘోరమో కదా సార్‌? మీరైతే ఏం చేస్తారో చెప్పండి?”

వణికిపోయాను. పంకజం నవ్వుతూ శెలవు తీసుకుంది.

రామబాణం చెట్లు రాల్చిన పూలమధ్య చీకటిని చీల్చలేని కాంతిరేఖల మధ్య పంకజం టకటక సాగిపోతోంది.

మా అమ్మాయిలను ఇన్నాళ్ళు కాపాడుతున్నాయనుకుంటున్న మా రెక్కలు ఎంత బలహీనమైనవో ఆ క్షణంలో తెలిసి వచ్చింది.

(ఇండియా టుడే 6 జనవరి 1997)

రచయిత గురించి

డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సంచాలకునిగా పదవీ విరమణ పొందిన వీరు 1939 జులై 10న కడప జిల్లా కమలాపురం తాలూకాలోని రంగసాయిపురం గ్రామంలో జన్మించారు. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’,’ జప్తు’, ‘ఇఛ్చాగ్ని’ పేర్లతో వీరి కథలు సంకలనాలుగా వెలువడ్డాయి.

ఇదీ చదవండి!

రాజంపేట

రాజంపేట పట్టణం

రాజంపేట పట్టణ విశేషాలు, చరిత్ర, జనాభా వివరాలు మరియు ఫోటోలు. రాజంపేటకు వెళ్లే వారి కోసం అవసరమైన సమాచారం మరియు సూచనలు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: