mangampet Barytes

మంగంపేట ముగ్గురాయి గనుల ప్రయివేటీకరణ?

కడప జిల్లా మంగంపేట బైరైటీస్‌(ముగ్గురాయి) గనులను ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత్యంత విలువైన, అరుదైన బైరైటీస్‌ గనులను ప్రయి’వేటు’కు అప్పగించడమంటే అక్షరాలా లక్ష కోట్ల రూపాయల సంపదను వారి చేతిలో అప్పనంగా పెట్టడమే. ప్రయివేటీకరణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ మంగంపేట గనుల చుట్టూ ఏదో తతంగం నడుస్తోందన్నది మాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది.

బైరైటీస్‌ మార్కెట్‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఆరు నెలల క్రితం అధికారంలోకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బైరైటీస్‌ ఖనిజ కేటాయింపులను నిలిపేసింది. ఎక్కువ మంది మిల్లర్లు వైసిపి మద్దతుదారులైనందున వారిని దెబ్బతీయడానికే ఖనిజం కేటాయింపులు ఆపేశారన్న విమర్శలున్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకే నిలుపుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇంతలోనే గనుల ప్రయివేటీకరణపై ఊహాగానాలు గుప్పుమన్నాయి.

దశాబ్దాలుగా తవ్వుతున్నా ఇంకా మంగంపేట గనుల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజం విలువ లక్ష కోట్ల రూపాయలు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ గనులు 81.95 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 7.3 కోట్ల టన్నుల ఖనిజం ఉన్నట్లు అంచనా. ఇప్పటిదాకా ఒక కోటి టన్నులు మాత్రమే వెలికి తీశారు. ఇంకా 6.3 కోట్ల టన్నుల ఖనిజ నిల్వలను వెలికి తీయాల్సి ఉంది.

చదవండి :  ‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

ప్రపంచంలో ఒక్క మంగంపేటలోనే ఇంత భారీ పరిమాణంలో బైరైటీస్‌ నిల్వలున్నాయి. ఇక్కడ 4.44 మీటర్ల నుంచి 39.80 మీటర్ల మందం మేర ఖనిజం లభ్యమవుతుంది. ఈ గనుల్లో ఇంకా మిగిలున్న ఖనిజాన్ని విక్రయిస్తే ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం లభించే అవకాశముంది. మొన్నటిదాకా ‘ఏ’ గ్రేడ్‌ బైరైటీస్‌ రాయిని టన్ను రూ.5,052, ‘బి’ గ్రేడ్‌ రూ. 3,827, ‘సి’ గ్రేడ్‌ రూ.2,176 విక్రయిస్తున్నారు. వాస్తవంగా ఈ రాయిని పిండిచేసి విక్రయిస్తే ధర రెట్టింపవుతుంది. ఉదాహరణకు ‘ఏ’ గ్రేడు రాయిని పిండిగా మార్చి విక్రయిస్తే అదే టన్ను ధర రూ.15 వేల దాకా ఉంటుంది. అందుబాటులో ఉన్న ఆరు కోట్ల టన్నుల రాయిని వెలికితీసి పిండిగా మార్చి విక్రయిస్తే లక్ష కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇంత భారీమొత్తంలో ఖనిజాన్ని ఒక్కసారిగా వెలికి తీయలేము. ఇందుకు రెండు మూడు దశాబ్దాలైనా పడుతుంది. అప్పటి లెక్కల్లో చూస్తే మంగంపేట గనుల విలువ లక్షల కోట్ల రూపాయలు అవుతుంది.

చదవండి :  కడపపై మరోసారి ఈనాడు అక్కసు

         పెట్రోలు, గ్యాస్‌ తవ్వకాల్లో వినియోగించే బైరైటీస్‌ పొడికి గల్ఫ్‌ దేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. అందులోనూ మన మంగంపేట పిండికి డిమాండ్‌ ఎక్కువ. దీనికి కారణం ఇక్కడ అత్యంత నాణ్యమైన ఖనిజం లభించడమే. ప్రపంచ బైరైటీస్‌ నిల్వల్లో 28 శాతం భారత్‌లోనే ఉన్నాయి. ఇందులో సింహభాగం మంగంపేటదే. అందుకే ప్రపంచ మార్కెట్‌లో ఎంత పోటీ ఉన్నా మన బైరైటీస్‌కు డిమాండ్‌ పెరగడమే తప్ప తగ్గేది ఉండదనేది నిపుణులు చెబుతున్న మాట. ఇంత డిమాండ్‌ ఉన్న బైరైటీస్‌ను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాల్సిన అవసరమేమిటన్నది ప్రశ్న. అలా అప్పగించడమంటే బంగారుబాతును వదులుకోవడమేనని మంగంపేట ఎపిఎండిసి ఉద్యోగులు, కార్మికులు చెబుతున్నారు.

మంగంపేటలో తవ్వకాలు సక్రమంగా సాగకపోవడంతో డిమాండ్‌ మేరకు ఖనిజాన్ని సరఫరా చేయలేకపోతున్నారు. ఖనిజాన్ని రాయిగా మార్చే మిల్లర్లు గతేడాది జనవరిలో చెల్లించిన డబ్బులకూ ఇప్పటిదాకా రాయి సరఫరా చేయలేదంటే తవ్వకాలకూ, డిమాండుకూ మధ్య ఎంత వ్యత్యాసముందో అర్థం చేసుకోవచ్చు. మంగంపేట గనుల్లో ఖనిజం తవ్వకం మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎపిఎండిసి) ఆధ్వర్యంలో జరుగుతుంది. రాయిని ప్రయివేటు వ్యక్తులు(మిల్లర్లు) కొనుగోలు చేసి పిండిగా మార్చి విక్రయించి అమ్ముకుంటున్నారు. రాయిని పిండిగా మార్చే మిల్లులు లేకపోవడంతో ప్రభుత్వం సగానికి సగం ఆదాయాన్ని కోల్పోతోంది. అదే పల్వరైజింగ్‌(పిండి) మిల్లులనూ ఎపిఎండిసినే ఏర్పాటు చేసుకోగలిగితే ఒక్కసారిగా దాని ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.

చదవండి :  రాయలసీమ ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?

అంటే తవ్వకాల తరువాత జరిగే ప్రక్రియనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఈ దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వం గనులను పూర్తిగా ప్రయివేటుపరం చేసే దిశగా అడుగులేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

1980కి పూర్వం ఈ గనులు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి. నామమాత్రపు రాయల్టీ చెల్లించి ఖనిజం తవ్వుకునేవారు. అలా కొందరు వ్యక్తులు కోట్లకు పడగలెత్తారు. ఆ తరువాత గనులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎపిఎండిసికి అప్పగించింది. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం చరిత్రను వెనక్కి నడిపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి.

ఇప్పుడున్న పద్ధతి వల్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులు లబ్ధి పొందుతున్నారని, ప్రభుత్వం నష్టపోతోందని భావిస్తుంటే దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చు. అంతేగానీ మొత్తంగా బడా పెట్టుబడిదారీ సంస్థలకు గనులను అప్పగించాలనుకుంటే అది రాష్ట్రానికి తీరని నష్టమే చేస్తుందని పలువురు భావిస్తున్నారు.

– ఆదిమూలం శేఖర్

(ప్రజాశక్తి దినపత్రిక, 17 నవంబర్ 2014)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: