సీమ సాగునీటి పథకాలపై కొనసాగిన వివక్ష

బడ్జెట్లో అరకొర కేటాయింపులు

జలయజ్ఞానికి సంబంధించి ఇప్పటికే సాగునీరు పుష్కలంగా అందుతున్న కృష్ణా డెల్టా మీద అలవికాని ప్రేమ ప్రదర్శించిన ప్రభుత్వం ఆరుతడి పంటలకూ నోచుకోక కరువు బారిన పడ్డ సీమపైన వివక్షను కొనసాగించింది.

నిరుడు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు జరపడంలో వివక్ష చూపిన ఆం.ప్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఆ విధానాన్ని కొనసాగించి తన ప్రాధమ్యాన్ని చెప్పకనే చెప్పింది.

రాయలసీమలోని భారీ సాగునీటి పథకాలు అన్నిటికీ కలిపి ఎప్పుడో పూర్తయి నిర్వహణలో ఉన్న ఒక్క నాగార్జున సాగర్ ఆధునీకరణకు (814.5 కోట్లు) కేటాయించినంత సొమ్ము కూడా ఇవ్వకపోవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.

అలాగే కృష్ణా డెల్టా కాలువల ఆధునీకరణకు 111 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రాయలసీమలోని అన్ని కాలువల నిర్వహణకు కలిపీ కూడా అంత మొత్తాన్ని కేటాయించకపోవడం ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోంది. గోదారి పుష్కరాల కోసం కేటాయించిన పాటి నిధులు కూడా గాలేరు నగరి ప్రాజెక్టుకు బడ్జెట్లో దక్కకపోవటం విచారకరం. ఇప్పటికైనా మన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని అడుగుతారా?

చదవండి :  'గండికోట'కు నీల్లేయి సోమీ?

వివిధ సాగునీటి పథకాలకు ప్రభుత్వం జరిపిన కేటాయింపులివీ….

గాలేరు నగరి: ఈ పథకానికి రూ.170 కోట్లు కేటాయింపులు చేశారు. మొన్న గండికోటకు  వచ్చి ప్రాజెక్టును పూర్తి చేసి గండికోట జలాశయంలో జూలైనాటికి 35 టి.ఎం.సి లు నిల్వ చేస్తానన్న ముఖ్యమంత్రి గారు యధాలాపంగా అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. ఇప్పుడు కేటాయించిన డబ్బులతో గాలేరు నగరి మొదటి దశ పూర్తయ్యేదీ కష్టమే.

హంద్రి-నీవా సుజల స్రవంతి: ఈ పథకానికి ప్రభుత్వం రూ.212 కోట్ల మేర నిధులు కేటాయించింది. అయితే హంద్రీనీవాకు కేటాయించిన రూ.212 కోట్ల మొత్తం పథకం విద్యుత్తు ఛార్జీలు, సిబ్బంది జీతాలకే సరిపోతుందని అధికారులు పేర్కొనటం గమనార్హం. జనవరి 2016 కల్లా కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొస్తానని ముఖ్యమంత్రి చెబితే కేటాయింపులు పూర్తిస్థాయిలో వస్తాయని ఆశించారు. దానికి విరుద్ధంగా కేటాయింపులు చేశారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.4,109 కోట్లు కాగా ఇది పూర్తి చేయడానికి రూ.1194.78 కోట్లు అవసరం. ఇలా కేటాయింపులు చేస్తూ పోతే 2020 కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవచ్చు.

చదవండి :  విశ్వవ్యాప్తంగా కడప నారాయణదాసు సంకీర్తనలు

తెలుగుగంగ:  ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, బలోపేతం చేయడానికి 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.42.62 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. తెలుగుగంగ ప్రాజెక్టును బలోపేతం చేయడం, నిర్వహణ, కాలువ గట్లపై రహదారుల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి ఈ ఏడాది దాదాపు రూ.65.62 కోట్లు కావాల్సి ఉంటుందని తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో దాదాపు రూ.23 కోట్ల కోత పడింది. దీంతో రానున్న రూ.42.62 కోట్లలో దాదాపు రూ.32 కోట్ల మేరకు పునరావాస చెల్లింపులు చేయాల్సి ఉంది. దీంతో నిర్వహణ, కొత్త పనులు, బలోపేతం చేసే చర్యలకు నిధులు ఎటూ చాలని పరిస్థితి నెలకొంది.

చదవండి :  ఈపొద్దు రైల్వేకోడూరుకు ముఖ్యమంత్రి

పులివెందుల బ్రాంచి కెనాల్‌కు రూ.5.7 కోట్లు, మైలవరం కాల్వల ఆధునీకరణకు రూ.5.97 కోట్లు, కేసీ కాల్వకు రూ.4.9 కోట్ల మేర నిధులు ఇచ్చారు.

హెచ్ఎల్‌సీకి రూ.58 కోట్ల మొత్తాన్ని కేటాయించారు. ఇవి కాకుండా తుంగభద్ర బోర్డు పరిధిలో కాలువల నిర్వహణకు మరో రూ. 20 కోట్లను కేటాయించారు.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ కోసం బడ్జెట్‌లో రూ.5.88 కోట్లు కేటాయింపులు జరిపారు.ఎస్సార్బీసీ కోసం అధికారులు రూ.100కోట్లు కావాలాని  ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం రూ.5.88కోట్లు కేటాయించింది.

చిన్ననీటి వనరులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.340 కోట్లు కేటాయించారు. చిన్ననీటి పారుదలశాఖ పరిధిలోకి వచ్చే బుగ్గవంకకు రూ.50 లక్షలు, చెయ్యేరు (అన్నమయ్య)కు రూ.1.35 కోట్లు కేటాయించారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: