కడప : నగర శివార్లలోని రాజీవ్ గాంధీ వైద్య కళాశాల(రిమ్స్)ను శనివారం భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం తనిఖీ చేసింది. ఎంసీఐ ఇదివరకే రిమ్స్‌లో చివరి తనిఖీలు (మార్చి నెలలో) నిర్వహించింది.
అప్పట్లో 562 జీవో అమలు, ఫార్మాకో విభాగం, లైబ్రరీ విభాగంలో పుస్తకాల కొరత, ఎక్స్‌రే ప్లాంట్‌లలో ఒకే యూనిట్, చెన్నూరు పీహెచ్‌సీలో కొన్ని కొరతలపై నివేదికను పంపించారు. ఆ నివేదికలతో పాటు ఎంసీఐ బృందం రిమ్స్ ఫైనలియర్ అనుమతికి కూడా ఎసరు పెట్టింది. దీంతో రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్యశాఖ , ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మరోసారి తనిఖీకి విచ్చేశారు.
తనిఖీ బృందంలో బెంగుళూరుకు చెందిన డాక్టర్ శివప్రసాద్, చెన్నైకి చెందిన ప్రొఫెసర్ ఏకే ఖన్నా, కలకత్తాకు చెందిన బిష్వంత్ కహాలి ఉన్నారు. శనివారం ఉదయం ఇన్‌ఛార్జ్‌డైరక్టర్ డాక్టర్ ఎల్ సీ ఓబులేసు ఛాంబరులో కూర్చొని రికార్డులను పరిశీలించారు. ఎక్స్‌రే యూనిట్లు, ఫార్మకో విభాగం, లైబ్రరీ, చెన్నూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం వేర్వేరుగా ఓపీ, ఐపీ ఇతరత్రా విభాగాలను తనిఖీ చేశారు.
ఎంసీఐ బృందాన్ని కలిసిన వివేకా, కలెక్టర్:
రిమ్స్‌కు తనిఖీకి వ చ్చిన ఎంసీఐ బృందాన్ని జిల్లా కలెక్టర్ శశిభూషణ్‌కుమార్, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికలిశారు. కళాశాల అభివృద్ధి చెందిందని కావాల్సిన సౌకర్యాలన్నీరిమ్స్‌లో సమకూర్చామని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎంసీఐ బృందం గత మార్చిలో తనిఖీలకు వచ్చిన సమయంలో కొన్ని విషయాలపై అసంతృప్తి చెందారన్నారు.
వీటిలో ప్రధానంగా ఫార్మకో విజిలెన్స్, లైబ్రరీ, ఎక్స్‌రే యూనిట్, చెన్నూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రలలో సౌకర్యాల కొరత ఉన్నాయన్నారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎంసీఐ బృందం మళ్లీ తనిఖీకి వచ్చిందన్నారు. ప్రస్తుతం అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డి, రిమ్స్ ఆర్‌ఎంఓ డాక్టర్ ఎం.సురేశ్వర్‌రెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నూరు వెద్యశాలను పరిశీలించిన ఎంసీఐ ప్రతినిధి:
రిమ్స్ అనుబంధ వైద్యశాలగా ఎంపికైన చెన్నూరు వైద్యశాలను శుక్రవారం ఎంసీఐ ప్రతినిధి డాక్టర్ ఖాన్ పరిశీలించారు. ఓపీ, పడక గదులు, కాన్పుల వార్డు, డాక్టర్ల గదులు, ఆపరేషన్ ధియేటర్, ల్యాబ్, స్టోర్, కూలింగ్ పరికరాలను నిశితంగా పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రిమ్స్ అనుబంధ వైద్యశాలగా ఎంపిక చేసుకునేందుకు అన్ని వసతులు చెన్నూరు వైద్యశాల ఉన్నట్లు గతంలో తనిఖీ చేసిన అధికారులు నిర్ధారించారు. అయితే రిమ్స్ నుంచి వచ్చే హౌస్ సర్జన్ విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడంతో పూర్తి స్థాయిలో అనుమతులు లభించలేదు. దీంతో చెన్నూరులోని రెడ్డివారివీధిలో లేడీస్, బాయ్స్ హాస్టళ్లను ఏర్పాటు చేశారు. ఆ హాస్టళ్లను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపుతామని ఎంసీఐ ప్రతినిధి డాక్టర్ ఖాన్ చెప్పారు. ఆయన వెంట కడప రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ బాలకృష్ణ, ప్రొఫెసర్ ఖాదర్‌వలి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.