
కొంపకే సావమను – మా డవుటుగాన్ని : జానపదగీతం
పల్లె పట్టుల్లో ఆలుమగలు పేర్లు పెట్టుకొని పిలుచుకోవడం అరుదుగా కనిపిస్తుంది. భార్యను పిలువవలసి వచ్చినప్పుడు ‘ఏయ్’ – ‘ఓ’ ‘ఇదుగో’ ‘ఆడదానా’ ‘అమ్మీ’ అని భర్త అంటాడు. భర్తను భార్య పిలువవలసి వస్తే ‘ఇదుగో’, ‘ఏమండీ’ ‘బావా’ ‘మామా’ అని అంటుంది. వరుస విరుద్ధంగా మారినప్పుడు ఇద్దరి మధ్య మాటమాట పెరిగినప్పుడు మోటుగా, మాటుగా మారు పేర్లతో గాని, బారుపేర్లతో గాని ఒకరినొకరు పిలుచుకుంటారు. ఒక్కో సమయంలో ప్రేమ ముదిరినప్పుడు భార్య భర్తను ‘రా’ కొట్టడం కూడా మామూలైన విషయం.
వాడు కోతలరాయుడు. వాడు చేసిన కష్టం ఇంటిల్లిపాది ఒక పూట తినే ‘సంగటి’కి అందులోని ‘సాదకాని’కి మాత్రమే సరిపోతుంది. తననే నమ్ముకొని ఇంకా బయటా ఎంతో కష్టపడి పనిచేసే తన భార్యలో అణగారి ఉన్న ఆకల్ని గూర్చి ఏనాడూ వాడు పట్టించుకోలేదు. లేని వస్తువులు ఇంట్లోనే ఉన్నాయని ‘ఎచ్చలగా’ గాలితో రాయబారం పంపి ఆమెను ఉడికించడం దినచర్యలో వాడికి ఒక భాగమైంది. అయినా ఆ ఇల్లాలు వాడి మాటలకు బాధపడటం లేదు. మనసులోనే వాడి పరిస్థితికి జాలిపడింది. అందుకే వాడి బడాయి మాటలకు విసుగు పడకుండానే సరైన సమాధానం చెప్పింది. ‘ఎచ్చలోడని’ ముద్దుగా పిలుచుకుంది. ‘డవుటుగాడని’ మేటైన బిరుదునిచ్చి ప్రేమ కలబోసిన మోటు పదంతోనే ఇంట్లోకి ఆహ్వానించింది. ఆలు మగల సంభాషణలో వ్యంగ్యాత్మకమైన సరస స్ఫోరకమై అలరారే ఈ పాటను జానపదులు ఇలా పాడుకుంటారు.
కొంపకే సావమను – మా డవుటుగాన్ని
భర్త : బెల్లము తెచ్చినా – పంచగూట్లో¹ పెట్టినా
పాశమన్న చేయమను – మా ఆడదాన్ని
భార్య : ఇండ్లంత వెతికినా – బెల్లపు ముక్కే² లేదు
ఇంటికే రమ్మను – మా యెచ్చలోన్ని³
ఇంటికే రమ్మను – మా డవుటుగాన్ని⁴
భర్త : సీరెలు తెచ్చినా – పెట్టెలో పెట్టినా
కట్టుకోనుండమను – మా యాడదాన్ని⁵
భార్య : ఇండ్లంత వెతికినా – మసిపాత⁶కే లేదు
కొంపకే సావమను – మా యెచ్చలోన్ని
కొంపకే సావమను – మా డవుటుగాన్ని
భర్త : కమ్ములు⁷ తెచ్చినా – పెట్టెలో పెట్టినా
పెట్టుకోనుండమను – మా యాడదాన్ని
భార్య : ఇండ్లంత వెతికినా – ఇనుప మెట్టె⁸కే లేదు
ఇంటికే సావమను – మా యెచ్చలోన్ని
ఇంటికే సావమను – మా డవుటుగాన్ని
భర్త : వడ్ల మూటల్ దింపినా – ఇంట్లో నెట్లు⁹ యేసినా
దంచి బువ్వ¹⁰ చేయమను – మా ఆడదాన్ని
ఊరికంత పెట్టమను మా ముద్దరాలను
భార్య : ఇండ్లంత వెతికినా – బీపగ్గింజ¹¹ గతిలేదు
కొంపకే సావమను – మా యెచ్చలోన్ని
కొంపకే సావమను – మా డవుటుగాన్ని
వివరణలు (Footnotes):
- బయటి వాకిలి ప్రక్క మధ్య గూడు
- బెల్లపు ముక్క
- అధిక ప్రసంగం చేయువాడిని, పైన పటారం లోన లోటారం గలవానిని కూడా ఎచ్చలోడని పిలుస్తారు)
- బడాయిగాన్ని
- భార్యను
- పొయ్యి మీద నుండి వంట వండిన కుండలు దించేప్పుడు చేయికాలకుండా వాడే పాత గుడ్డ
- ఆభరణ విశేషాలు
- ఆభరణ విశేషాలు
- ఒకదానిపై ఒకటి వేసిన వరుసలు;
- అన్నం;
- బియ్యపు గింజ.