కడప: జైసమైక్యాంధ్ర పార్టీలో చేరుతారని భావించిన కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెదేపాలో చేరుతున్నట్లు ఈ రోజు ప్రొద్దుటూరులో ప్రకటించారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుడు జగన్‌మోహన్‌రెడ్డి అయితే…సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు అని వీరశివారెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ చీల్చి నాశనం చేసిందని ఆరోపించారు. అందుకే తాను కాంగ్రెస్‌ను వీడి తెదేపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఇక నుంచి తెదేపా అభివృద్ధికి…. పార్టీ విజయానికి కృషిచేస్తానని ప్రకటించారు.
కమలాపురం నుంచి ఇప్పటికే పుత్తా నరసింహారెడ్డి తెదేపా బాధ్యుడుగా ఉన్నారు. పుత్తాకే తెదేపా టికెట్ ఖారారు చేశారని, వీరశివా అక్కడ తెదేపా తరపున పనిచేస్తారని పుత్తా అనుచరులు చెబుతుండటం గమనార్హం. పార్టీ మారే దానికి సంబంధించి వీరశివా అనుచరులు, బంధువులతో పలుమార్లు సంప్రదింపులు నిర్వహించారట.
వీరశివారెడ్డి తెదేపా తరపున ఎమ్మెల్యేగా పోటీకి నిలువని పక్షంలో ఆయన సోదరుడు కోగటం ప్రతాప్‌రెడ్డి వైకాపాకే అనుకూలంగా నిలవనున్నట్లు ఆ పార్టీ నాయకుల సమాచారం.
తెదేపా తరపున 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక కేసులో ఇరుక్కొన్న వీరశివారెడ్డి తరువాతి పరిణామాలలో తెదేపాతో విభేదించి ఆ పార్టీ అధినేత చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. అనంతరం 2009లో వైఎస్సార్ సాయంతో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాతి పరిణామాలలో ముఖ్యమంత్రి కిరణ్ కు మద్దతుగా నిలిచి జిల్లాకే చెందిన కాంగ్రెస్ మంత్రి డి.ఎల్ పై విరుచుకు పడేవారు. అదే సమయంలో వైఎస్ జగన్ కు వ్యతిరేఖంగా తీవ్ర విమర్శలు సైతం చేశారు.