రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ పొద్దు (మంగళవారం) కడప నగరంలో బడిపిల్లోల్లు రోడ్డు మీదకొచ్చారు. నగరంలో ప్రదర్శన నిర్వహించిన పిల్లోళ్ళు… ర్యాలీగా కోటిరెడ్డి కూడలి వద్దకు చేరుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేఖిస్తూ నినాదాలు చేశారు.
రాయలసీమ విద్యార్థి సమాఖ్య (ఆర్ ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాజధాని విషయంలో సీమ వాసుల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోతోందని విమర్శించారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని కాలరాస్తూ విజయవాడలో రాజధాని ఏర్పాటు చేయడం కుట్రలో భాగమన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటు కూడా కుట్రలో భాగమన్నారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి కోస్తా వారి ప్రయోజనాలకు వంత పాడడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీభాగ్ ఒప్పందం అమలు జరిగే విధంగా రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో ప్రత్యేక ఉద్యమం తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.