ఆదివారం , 22 డిసెంబర్ 2024

ప్రొద్దుటూరు కోడెద్దులు రంకేసి బండ లాగితే…

ఇవి ప్రొద్దుటూరు బండెద్దులు…

కడప జిల్లా కోడెద్దులు….

రంకేసి కాలు దువ్వితే ఎంతటి బండయినా పరుగులు తీయాల్సిందే!

గాడి వదలి పోటీకి వెళితే బహుమతులు వాటి సొంతమే. విజేతలుగా ఇల్లు చేరి యజమానుల మోజు తీర్చే ఈ ఎద్దులు వారికి కన్నకొడుకులతో సమానం. ఈ బండలాగుడు ఎద్దులపై దోమ వాలినా వారిని కుట్టినట్లే బాధపడతారు. భీముడనే ఓ ఎద్దు ఇటీవల ఆకస్మిక మృతి చెందగా, దాని సంస్మరణ జరుపుతున్నారంటే వీటిపై యజమానులకుండే మమకారం వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

మన రాష్ట్రంలోనే కాదు కర్నాటక రాష్ట్రంలో బండలాగుడు పోటీలు జరిగినా ప్రొద్దుటూరు బండెద్దులు ఆ పోటీలో పాల్గొని బహుమతులు సొంతం చేసుకోవాల్సిందే. రాముడు, భీముడు అనే కోడెద్దులు మూడేళ్ళలో 52 పందెల్లో పాల్గొంటే 45 చోట్ల మొదటి బహుమతి, ఏడు చోట్ల రెండవ బహుమతులు పొందాయి. దీన్ని బట్టి వాటికి గల సత్తాని మనం అంచనా వేయవచ్చు.

కడప జిల్లాలో ప్రతి వ్యవసాయ కుటుంబానికి కాడెద్దులు ఉంటాయి. వ్యవసాయంలో రైతుకు వెన్నంటి ఉండే ఈ ఎద్దులతో పనులు చేయించుకున్నా బసవరాజులుగా పూజిస్తారు. ఏరువాక సాగాలంటే ఎద్దులకు పైగడిగి పూజించి పొలాలకు తీసుకెళ్లి రెండు కోండ్రలు (రెండు చుట్లు) దుక్కిదున్ని ఉగాది తరువాత కొత్త సంవత్సరంలో వ్యవసాయానికి అడుగులు వేస్తారు. ఎద్దులపై ఎంతో ఆసక్తిని కనబరచే ఇక్కడి రైతాంగం తాను తిన్నా తినకున్నా వాటి కడుపు నింపడానికే ప్రాధాన్యతనిస్తారు.
ఒంగోలు, గుంటూరు నుంచి లేగ దూడలతో పాటు పోట్లగిత్తలను తెచ్చి పెంచుకున్నా, ముఖ్యంగా బండెద్దులు పెంచడానికే ప్రాధాన్యం ఇస్తారు. ప్రొద్దుటూరు ప్రాంతంలోని రామేశ్వరం, పెన్నానగర్, చిన్నశెట్టిపల్లె, వరికుంట్ల ప్రాంతాల్లో చాలా కాలంగా బండెద్దులను పోషిస్తూ వస్తున్నారు.

పసిబిడ్డలకంటే మక్కువగా…

బండ లాగేటప్పుడు యజమానులు ఎద్దులను చాల్‌కోడి(చెర్నాకోలు)తో కొడుతూ ముళ్ళుగర్రతో పొడుస్తుంటే ఏమిటీ కర్కశం అనే వాళ్లూ ఉంటారు. అయితే అది ఆ కొద్ది సేపు మాత్రమే. ఆ తరువాత వారు ఇంటికెళ్లి ఎద్దులపై చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. ప్రతి గాయానికి మందు రాస్తారు. వేడి నీళ్ళతో కడిగి ఆ బెదురు పోయే వరకు దగ్గరవుతారు. వాటిపై ఈగ వాలకుండా గాటిలో ఫ్యాన్‌లు బిగిస్తారు. కింద తేమ లేకుండా శుభ్ర పరుస్తారు. వాటికి పెట్టే ఆహారం నమ్మకస్తులైన ఒకరిద్దరు మాత్రమే పెడతారు. ఎల్లవేళలా దృష్టంతా వాటిపైనే ఉంచుతారు. ప్రతి రోజూ ఒళ్ళు కడిగి అవసరమైన ఆహారాన్ని అందిస్తారు. వీటి కోసం ఓ డాక్టర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. ఎద్దు ఏమాత్రం నీరసంగా కనిపించినా అప్పటికప్పుడు డాక్టర్ అక్కడ వాలిపోవాల్సిందే. ఇలా పసి బిడ్డలకంటే ఎక్కువగా వీటిని చూసుకుంటారు.

చదవండి :  మాచుపల్లె శ్రీ రేణుకా యల్లమాంబ వార్షిక తిరుణాల మహోత్సవాలు

ఉలవతొక్కు, బాదంపప్పు

బండెద్దులకు పెట్టే ఆహారం కూడా ఖరీదైందే. ఉలవతొక్కు, బాదంపప్పు, జాజికాయ పొడి, కొర్రపిండి బెల్లం, పచ్చిటెంకాయలు, కోడిగుడ్లు లాంటి ఆహారాన్ని అందిస్తారు. రోజు ఉదయం ఒళ్ళు కడిగిన వెంటనే బెల్లంతో కలిపిన ఉలవతొక్కు, మధ్యాహ్నం 12గంటలకు బెల్లంతో కలిపిన కొర్రపిండి పెట్టి 3గంటలకు పచ్చి టెంకాయలు, ద్రాక్ష, కలకండా కలిపి తయారుచేసిన జ్యూస్‌ని తాగిస్తారు. సాయంత్రం మళ్లీ ఉలవతొక్కు పెడతారు. 6గంటలకు ఆరు కోడిగుడ్లు పగలగొట్టి గొట్టంతో తాగిస్తారు. రాత్రి 9గంటలకు బలం చేకూరే టానిక్ క్రమం తప్పకుండా తాగిస్తారు. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం వయస్సున్న ఎద్దులకైతే బాదంపప్పు పెడతారు. వీటితో పాటు సపోటాలు తినిపిస్తారు. బండెద్దులకు పెట్టే ఆహారాన్ని బట్టి యజమానులు వాటిని ఎంత బాగా చూసుకుంటారో ఊహించవచ్చు.

పందేలు ఎక్కడెక్కడ

ప్రొద్దుటూరు నుండి బండలాగుడు పోటీలకు లక్ష్మిరెడ్డి, అక్బర్‌బాషాలు మన రాష్ట్రంలోని కడప, ప్రకాశం, కృష్ణ, అనంతపురం, కర్నూలు, తెలంగాణ జిల్లాలతో పాటు కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు కూడా పలుమార్లు పందేనికి వెళ్తుంటారు. గెలిచినచోట 40 నుంచి 75 వేల రూపాయల వరకు నగదు బహుమతి అందుకుంటారు. ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన పోటీలో రాముడు, భీముడు జంట లక్ష రూపాయలు గెలుపొందాయి.

భీముడు బయటకు వెళ్ళిందంటే పందెం గెలిచినట్లే అని యజమాని లక్ష్మిరెడ్డి చెబుతారు. ఇంతటి కోడెద్దులకు ఏమైందో ఏమో కాని జనవరి మొదటి వారంలో ఎర్రగుంట్లలో జరిగిన పోటీల్లో రాముడుకి సుస్తి చేస్తే ఈ మధ్య కొర్రపాడులో జరిగిన పోటీల్లో భీముడు మెత్తపడ్డాడు. జబ్బు పడ్డ భీముడు కొద్ది రోజులకే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో దాన్ని పెంచిన కుటుంబం తల్లడిల్లింది. ఆ ప్రాంత వాసుల, రైతుల కళ్ళు చెమర్చాయి. ఎక్కడికి వెళ్లినా విజేతగా నిలబడే ఈ బండెద్దు మృతి చెందడాన్ని తట్టుకోలేని యజమాని పొట్టు లక్ష్మిరెడ్డి ఇప్పుడు దానికి సంస్మరణ సభ నిర్వహిస్తున్నాడు.

చదవండి :  సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

మృతి చెందిన భీముడుతో పాటు మరో నాలుగు కోడెద్దులను పెంచుతున్న లక్ష్మిరెడ్డి చిన్నశెట్టిపల్లెకు చెందిన వాడు. నాలుగేళ్ళుగా బండలాగుడు పోటీల్లో పాల్గొంటున్నాడు. ఇరవై ఏళ్లపాటు రెండు సేద్యపు ఎద్దులతో వ్యవసాయం చేశారు. ఆ రెండు ఎద్దులు మృతి చెందితే పూడ్చి పెట్టారు. ఆ తరువాత లారీల యజమానిగా మారారు. నాలుగేళ్ళ క్రితం లారీలను కొన్నింటిని తగ్గించి బండెద్దులను పెంచడం మొదలుపెట్టారు
ఆయనతో పాటు ప్రొద్దుటూరు, కట్టుబడికి చెందిన అక్బర్ ఆరు బండెద్దులను పెంచుతున్నారు. ఈయన కూడా ఆరు సంవత్సరాలుగా బండలాగుడు పోటీల్లో ఉంటున్నారు. అంతకు ముందు వాళ్ళ మామ రజాక్ ఇరవై రెండేళ్ళుగా బండెద్దులను పెంచడం, పోటీల్లో పాల్గొనడమే వృత్తిగా పెట్టుకున్నారు. ఆ సంప్రదాయాన్ని అక్బర్ కొనసాగిస్తున్నాడు. లక్ష్మిరెడ్డి, అక్బర్ కుటుంబాల బండెద్దులు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అక్బర్ కూడా తన ఎద్దులతో 200 వరకు బహుమతులు పొందాడు.

నెలకు లక్ష ఖర్చు

నాలుగు బండెద్దులను పెంచేందుకు నెలకు యజమానికి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. రోజుకు 3వేల రూపాయల మేరకు వాటి ఆహారానికి, పని మనుషులకు ఖర్చు అవుతుంది. 25 లక్షలు పందెంలో గెలిస్తే 25 లక్షలు వాటికే ఖర్చు పెట్టానని లక్షి ్మరెడ్డి చెప్పారు. ఆదాయం కోసం కాకుండా ఎద్దులపై ఉన్న మోజుతోనే ఎంత కష్టమైనా ఆనందంగా భరిస్తానన్నారు. ‘అవి మమ్మల్ని విజేతలుగా నిలబెట్టే సంతోషం ముందు వాటికి పెట్టన ఖర్చు కనిపించదని లక్ష్మిరెడ్డి, అక్బర్‌లు అంటారు. ఆరేళ్ళలో 30 లక్షల నగదు బహుమతులొస్తే అంతా ఎద్దులకే ఖర్చు చేశానని అక్బర్ చెప్పాడు.

చదవండి :  భాషల అభివృద్ధి మండలి సభ్యునిగా కేతు విశ్వనాథరెడ్డి

వారంలో రెండు రోజులు ప్రాక్టీస్

ఎద్దులు పందేనికి పోకుండా ఇంటి వద్ద ఉంటే వారంలో రెండు సార్లు వాటితో ప్రాక్టీస్ చేయిస్తారు. గ్రామాల సమీపంలో ఉండే బండలను కట్టి లాగిస్తుంటారు. కనీసం ఆరు మంది ప్రాక్టీస్ చేయించే వారుంటే అదనంగా మరో ఆరుగురు ఉండాల్సి ఉంటుంది. వీరికి కూడా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. అదే పందెలకు వెళ్తే ఇరవై మందిని వెంట తీసుకెళ్తారు. లారీలోనే ఎద్దులను తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్లినా ఆహారం మాత్రం ఇంటి నుండే ప్రత్యేకంగా మరో వాహనంలో తీసుకెళ్తారు. పందెం జరిగే చోట ఎద్దుల వద్ద నిరంతరం గమనిస్తూ ఉంటారు.

యజమానుల బాధ + సంతోషం

‘ఎంతో ప్రాణంగా, మురిపెంగా సాక్కున్న భీముడు మృతి చెందడంతో ఎక్కడా తిరగలేక పోతున్నా. ఎక్కడికి వెళ్లినా ఎద్దు ఎలా చనిపోయిందని అడుగుతుంటే బాధ ఇంకా ఎక్కువవుతోంది. ఆ ఎద్దంటే నాకెంతో ఇష్టం. దానిపై నా మనవడు పడుకొని ఆడుకుంటున్నా ఏమి అనేది కాదు. ఎద్దుల పక్కనే పెరిగిన మా పెంపుడు కుక్క కూడా ఎద్దు చనిపోయినప్పుడు దాని చుట్టూ తిరుగుతూ బాధ పడింది’ అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు లక్ష్మిరెడ్డి.

‘నేను ఆరేళ్ళుగా బండెద్దులను పోషిస్తున్నాను. వీటిలో రెండెద్దులు చనిపోయాయి. అప్పుడు ఎంతో బాధపడ్డాను. ఈ రెండు కలసి 25 లక్షలు విలువ చేసేవి’ అని అక్బర్ చెప్పాడు.

‘ఎద్దులు పోటీలో గెలిచి వస్తే తమలో కలిగే ఆనందానికి అవధులుండవని, ఆ ఆనందమే ఎద్దులను పెంచడంలో నిరంతరం మాకు బలాన్నిస్తోంద’ని వాటిపై ఎంతో మమకారం వ్యక్తపరిచారు వారిద్దరూ.

– మన్నెం శివరామరాజు

(ఆంధ్రజ్యోతి దినపత్రిక, చవితి, శుక్లపక్షం, జ్యేష్ఠ మాసం , శ్రీఖరనామ సంవత్సరం)

ఇదీ చదవండి!

ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు పట్టణం

ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు (ఆంగ్లం: Proddatur లేదా Proddutur), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది …

ఒక వ్యాఖ్య

  1. nenu kuda kadapa nunche (Rajampet) vachanu. Prastutam Bengaluru lo Job chestunnanu. Ee article chala bagundi.

    Vijay

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: