తుమ్మలపల్లె యురేనియం శుద్ధి కర్మాగారం ప్రారంభం
కడప: వేముల మండలం తుమ్మలపల్లెలో నిర్మించిన యురేనియం శుద్ధి కర్మాగారాన్నిభారత అణుశక్తి సంఘం చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ శుక్రవారం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆల్కైన్ లీచింగ్ పద్ధతిలో దేశంలోనే మొదటిసారిగా వైఎస్సార్ జిల్లాలో యురేనియం శుద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా ఇక్కడ రేడియేషన్ ప్రభావం ఉండదని, పర్యావరణానికి ముప్పు వాటిల్లదని ఆయన పేర్కొన్నారు. మొదట్లో ఇక్కడ 15 వేల టన్నుల యురేనియం ఖనిజ నిల్వలు ఉన్నట్లు కనుగొన్నామని, ఆ తర్వాత చేపట్టిన పరిశోధనల్లో 60 వేల టన్నుల నిల్వలు ఉన్నట్లు బయటపడిందని తెలిపారు.
- డబ్ల్యుటీఓ నిబంధనల ప్రకారమే ఎన్విరాన్‌మెంట్ సర్వే ల్యాబ్
- 2032 నాటికి 60 వేల మెగావాట్లు అణు విద్యుత్
- భూగర్భ జలాలు కలుషితమయ్యే ఆస్కారమే లేదు
భవిష్యత్తులో దీనికంటే మూడు రెట్ల అధిక నిల్వలు లభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. తుమ్మలపల్లె మైన్స్ ప్రపంచంలో అత్యధిక యురేనియం నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఒకటని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలకు అవసరమైన యురేనియం ఉత్పత్తి లేదన్నారు. భవిష్యత్తులో స్వయంసమృద్ధి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఖనిజాన్ని మైన్స్ లోపలే క్రషింగ్ చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తీసుకొచ్చే పద్ధతి ఇక్కడే చేపట్టామన్నారు. ఇప్పటివరకు అన్ని ప్రాజెక్టుల్లో యాసిడ్ లీచింగ్ పద్ధతిలోనే యురేనియం శుద్ధి చేసేవాళ్లమని తెలిపారు. తుమ్మలపల్లె నేలలు క్షార స్వభావం కలిగి ఉండడం వల్ల ఆల్కైన్ పద్ధతిలో 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద శుద్ధి చేస్తామన్నారు.
60 వేల మెగా వాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి
‘అణు విద్యుత్ కేంద్రాల ద్వారా దేశంలో మూడు శాతం… అంటే ఐదువేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 2032 నాటికి 60 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాలనే యోచనలో ఉన్నాం. యురేనియం ప్రాజెక్టు కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యే ఆస్కారమే లేదు. డబ్ల్యుటీఓ నిబంధనల ప్రకారమే ఎన్విరాన్‌మెంట్ సర్వే ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని’ బెనర్జీ తెలిపారు. ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా దేశంలోని అణురియాక్టర్లకు ఇబ్బంది లేదన్నారు.
వైఎస్ సహకారం మరువలేం
యురేనియం ప్లాంటు ఏర్పాటులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహకారం మరువలేనిదని బెనర్జీ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల సహకారంతోనే ఇలాంటి ప్లాంటు ఏర్పాటు సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు స్థానికులకు 225 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఆర్‌ఆర్ ప్యాకేజీని తప్పక అమలు చేస్తామన్నారు.