జులై 8,9 తేదీల్లో.. ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ
ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇడుపులపాయలో జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు.
పార్టీ ముఖ్యనేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను గురువారం వైఎస్ కొండారెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్‌ఛైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పరిశీలించారు. ముందు వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. వైఎస్‌ఆర్ ఘాట్ ఎదురుగా ఖాళీ స్థలంలో 10వేల మంది ప్రతినిధులు కూర్చునేందుకు సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వారికి అక్కడే భోజన సదుపాయం, ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే నియోజకవర్గాల ప్రతినిధులు, మండల ప్రతినిధులకు మరోచోట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ప్లీనరీ సందర్భంగా సభా ప్రాంగణంలో జరిగే విషయాలన్నీ వైఎస్సార్ ఘాట్ వెలుపల ఉన్న అభిమానులు తిలకించేందుకు పెద్దపెద్ద ఎల్‌సీడీ మానిటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్లీనరీకి జగన్‌ను బలపరిచే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా కన్వీనర్లు, మాజీ ఎమ్మెల్యేలు తరలిరానున్నారు. 30వేల మంది వరకు ప్రతినిధులు, ముఖ్యవ్యక్తులు, అదనంగా లక్షకుపైగా అభిమానులు తరలిరావచ్చని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల పాటు ప్లీనరీని ఓ పండుగ తరహాలో జరపాలని, తరచూ ఇలాంటి కార్యక్రమాలు ఇడుపులపాయలో జరగనున్నందున ఇక్కడికి వచ్చే వారికి అవసరమైన ఏర్పాట్లను శాశ్వత తరహాలో నిర్మిస్తే బాగుంటుందని వారు తీర్మానించారు.
ప్లీనరీ సభ ఏర్పాట్లు, భోజనాలు, ఇతర వాటిని కెఎంకె మెస్ యాజమాన్యానికి అప్పగించారు. జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ సభ్యుడు మహ్మద్ దర్బార్, తదితరులు పాల్గొన్నారు