వైకాపా అధినేత జగన్ ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో గురువారం నగరంలోని వైఎస్ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి కార్పొరేటర్‌ను పరిచయం చేసుకున్నారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలను పలకరిస్తూ వారికి ధైర్యం చెపుతూ కన్పించారు. వచ్చిన వారందరితో బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి, ఫొటోలు దిగారు.
ప్రతి కార్యకర్త చెప్పే మాటలను వింటూ ఎంపీ అవినాష్ ఉన్నాడు… ఎమ్మెల్యేలు అంజాద్‌బాష, రవిరెడ్డి, సురేష్‌బాబులు ఉన్నారంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
సురేష్‌బాబు మేయర్‌గా ఎన్నుకోవాలని జగన్ కార్పొరేటర్లకు సూచించారు. అబద్ధం చెప్పింటే అదికారంలోకి వచ్చేవారమన్నారు. ‘పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిద్దామనుకున్నాం. కాని దేవుడు అధికారం నాలుగు ఏళ్ల పాటు వాయిదా వేశారు. కనుక నాలుగేళ్ల పాటు మనమంతా పోరాటం చేయాలి.
నా అడుగులో అడుగేసి నాతో కలిసి రండి … ఈ పోరాటంలో ఇబ్బందులు ఉండవచ్చు.. కేసులు ఉండవచ్చు… కాని వచ్చే ఎన్నికల్లో మనదే అధికారమంటూ కార్పొరేటర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన 9 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు మీ కోసం పోరాడుతారు.. మనకు 67 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అసెంబ్లీలో పోరాటం చేస్తాం. అవసరమయితే మీ కోసం నేను రోడెక్కుతా’నని కార్పొరేటర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. డిప్యూటీ మేయర్ ను ఎవరికి ఇవ్వాలన్నదానిపై ఎంపీ అవినాష్, ఎమ్మెల్యేలు అంజాద్, రవిరెడ్డి, కాబోయే మేయర్ సురేష్‌బాబు నిర్ణయిస్తారని చెప్పారు.
అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించేలా డిప్యూటీ మేయర్ ఎంపిక ఉంటుందన్నారు. కడప డిప్యూటి మేయర్ ఎన్నిక రాష్ట్రానికి నాంది అవుతుందన్నారు.