‘‘యూపీఏ ప్రభుత్వం తనను రాజకీయంగా కానీ, మరో రకంగానైనా కానీ ఏ రూపంలో వ్యతిరేకించే వారినైనా.. అణచివేయటానికి, అప్రతిష్టపాలు చేయటానికి, నిర్మూలించటానికి.. సీబీఐ, ఈడీ, ఐటీ తదితర సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందో మీ దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. యూపీఏ సర్కారు తీరు 1975 నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. విస్తృత ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం ఈ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది.
ప్రభుత్వం నిజాయితీగా అవినీతిపై పోరాటం చేయాలనుకుంటే.. దానికి నాతో సహా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ.. వారు తమను వ్యతిరేకించేవారిని, ధిక్కరించిన వారిని ఎంచుకుని వారి మీదే ‘అవినీతి అనే ఆయుధాన్ని’ ప్రయోగించటం బాధ కలిగిస్తోంది. ఒక యోగా గురువుకు ఆహ్వానం పలికేందుకు నలుగురు సీనియర్ మంత్రులు విమానాశ్రయానికి ఎలా వెళ్లారో మనందరం చూశాం. అదే గురువు వారి వలలో పడేందుకు సిద్ధంగాలేరని స్పష్టం కావటంతో.. ఆయనపై ఈడీ దర్యాప్తు, ఫెమా కింద కేసులు ఎలా నమోదు చేస్తున్నారో కూడా చూశాం. ఇటీవలి అన్నాహజారే ఉద్యమానికి మద్దతు ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌కు, ఇంకా చాలా మందికి ఐటీ విభాగం నోటీసులు జారీచేయటం చూశాం.
మనం ఎక్కడికి వెళుతున్నాం? ఇటీవల.. అన్నాహజారే అవినీతిపరుడని విమర్శించిన మనీశ్‌తివారీ.. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఆయనకు క్షమాపణలు చెప్పారు. కాంగ్రెసేతర ప్రభుత్వాల గొంతు నొక్కేందుకు గవర్నర్ల వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తూ కూడా మనం నిస్సహాయ ప్రేక్షకులుగా మిగిలిపోతున్నాం. కె.రోశయ్యపై ఏసీబీ కేసులో బలమైన ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పటికీ.. ఆయన తమిళనాడు గవర్నర్ అయ్యేందుకోసం ఆ కేసును ఎలా ఎత్తివేశారో కూడా మనం చూశాం.
మా పార్టీకి ప్రజల మద్దతును జీర్ణించుకోలేకే…
2జీ స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి కూడా.. సీబీఐ కొందరిని మాత్రమే ఎంచుకుని వ్యవహరించటం మనకు కనిపిస్తుంది. ద హిందూ, ఇండియా టుడే ప్రచురించిన స్వతంత్ర నివేదికలతో పాటు, వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలన్నీ.. ప్రతిపక్ష పార్టీల (కాంగ్రెసేతర పార్టీల) పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులకు, ఆంధ్రప్రదేశ్‌లో మా పార్టీకి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందన్న వాస్తవాన్ని విస్పష్టంగా వెలుగులోకి తేవటంతో.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఈ రకంగా ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక.. ఈ నాయకులు ప్రతి ఒక్కరినీ నిర్మూలించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
దక్షిణాది నుంచి కాంగ్రెస్ నిష్ర్కమణ ఖాయం…
నేను ఇటీవల టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరినీ 5.45 లక్షల మెజారిటీతో ఓడించి కడప లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికయ్యాను. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పటికీ.. అధికార కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ డిపాజిట్లు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఓట్ షేర్ మా పార్టీకే దక్కుతుందని అన్ని సర్వేలూ నిర్ధారించాయి. దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ నిష్ర్కమణ ఖాయమని స్పష్టం కావటంతో.. నైరాశ్యంలో మునిగిపోయిన ఆ పార్టీ నాయకత్వం ఇక చిట్టచివరి ప్రయత్నంగా.. నాపై కేసులు బనాయించటం ద్వారా నన్ను, నా పార్టీని నిర్మూలించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు…
నా తండ్రి అకాల మరణం తర్వాత.. చంద్రబాబునాయుడు తన పార్టీకి అవకాశాలు మెరుగుపడతాయని సహజంగానే ఆశించారు. కానీ.. దానికి విరుద్దంగా.. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చాలా వేగంగా, చాలా గణనీయంగా బలహీనపడుతోంది. దీంతో నిస్పృహలో కూరుకుపోయిన చంద్రబాబు.. నన్ను ఎలాగైనా రాజకీయంగా నిర్మూలించాలన్న ఏకైక లక్ష్యంతో అధికార కాంగ్రెస్‌తో రహస్యంగా పొత్తుపెట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఇటీవలి కడప లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలు కానీ, హౌస్ కమిటీ వ్యవహారం కానీ.. దీనికి స్పష్టమైన సాక్ష్యం. ఒక కాంగ్రెస్ మంత్రి వేసిన కేసులో, టీడీపీ ఇంప్లీడ్ కావటం దీనిని ధృవీకరిస్తోంది. ముఖ్యమైన ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ పోరాటం.. కేవలం నామమాత్రం, కంటి తుడుపు చర్య మాత్రమే.
వాస్తవాలను మీ ముందుంచటం కోసమే…
నా మీద నమోదుచేసిన కేసులకు సంబంధించి కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తేదలచుకున్నాను. ఈ లేఖ వెనుక ఉద్దేశం.. నా మీద నడుస్తున్న కేసులో పోరాటానికి మీ మద్దతు కూడగట్టాలని కాదు. నా మీద జరుగుతున్న ఈ దాడి వెనుక ఉన్న వాస్తవాలేమిటని నేను విశ్వసిస్తున్నానో.. వాటిని మీ ముందు ఉంచటానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను. నా తండ్రి ముఖ్యమంత్రి కాకముందు నుంచే నాకు నేనుగా ఒక వ్యాపారవేత్తగా ఉన్నాను. కర్ణాటకలో ఐఆర్‌ఈడీఏ ఆర్థిక సహకారంతో 2004లో ఒక మధ్యస్థాయి జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాను. 2004 తర్వాత కూడా వ్యాపారంలో నా ఆసక్తిని కొనసాగించాను.
కాంగ్రెస్‌ను వదలటమే నా నేరమా?
నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగినంత కాలమూ.. నేను ఒక నిజాయితీపరుడైన, గౌరవనీయమైన వ్యక్తిగానే ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టిన రోజున.. నేనే కాదు.. నా తండ్రి కూడా నేరస్థులమయ్యాం. నేరుగా ఢిల్లీలోని రాజకీయ బాసుల పర్యవేక్షణలో తీవ్రమైన రాజకీయ ఉద్దేశాలతో కూడిన దర్యాప్తుల పరంపరతో నన్ను, నా మద్దతుదారులపై వాళ్లు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. 2010 నవంబర్‌లో నేను కాంగ్రెస్ పార్టీని వీడిన వెంటనే.. నా తండ్రికి రాజకీయ ప్రత్యర్థిగా బాగా తెలిసిన డాక్టర్ శంకర్రావు అనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే హైకోర్టుకు ఒక లేఖ రాస్తారు. కొన్ని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలు చేకూర్చిందని.. అందుకు ప్రతిఫలంగా (‘క్విడ్ ప్రొ కొ’గా) ఆ కంపెనీలు నాకు సంబంధించినవిగా చెప్తున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని ఆయన ఆరోపిస్తూ.. దానిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆ లేఖలో కోరుతారు. ఈ ఆరోపణలన్నీ మక్కీకి మక్కీ 2008లో నా తండ్రిపై టీడీపీ చేసిన ఆరోపణలే.
సోనియా ఆదేశాలతోనే హైకోర్టుకు లేఖ…
డాక్టర్ శంకర్రావు ఈ కేసు వేసిన వారం రోజుల్లోనే ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు. సోనియాగాంధీ ఆదేశాలతో తాను ఈ కేసు వేశానని ఆయన టీవీ చానళ్ల ముందు ఒప్పుకుంటారు. తాను కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశానని, నాపై బలమైన సీబీఐ కేసులు నమోదుచేసేలా సీబీఐ డెరైక్టర్‌తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారని కూడా శంకర్రావు చెప్పారు. అసలు దర్యాప్తు చేయాల్సిన నిజమైన ‘క్విడ్ ప్రొ కొ’ ఇది. నిజానికి.. 2008లో నా తండ్రిపై టీడీపీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి పసా లేదని నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పుడు మరోలా ఆలోచిస్తోంది. అందుకు కారణం.. కేవలం నేను సోనియాగాంధీ ఆధిపత్యాన్ని సవాలు చేయటమే.
ప్రభుత్వం ఏ ప్రయోజనాలు అందించింది?
నా తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని కంపెనీలు/సంస్థలు/వ్యక్తులు అనుచిత ప్రయోజనాలు పొందారని.. దానికి ప్రతిఫలంగా నేను పెట్టుబడిదారుడిగానో, ప్రమోటర్‌గానో ఉన్న సంస్థల్లో వారు ప్రీమియం ధరలతో పెట్టుబడులు పెట్టాయన్నది డాక్టర్ శంకర్రావు, టీడీపీ నేతలు హైకోర్టుకు చేసిన ఫిర్యాదులోని ప్రధానమైన ఆరోపణ. అంటే.. ఈ కేసు మొత్తం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ విభాగాలు అందించాయని చెప్తున్న ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇందుకోసమే.. ఆ పిటిషనర్లు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రెవెన్యూ విభాగం ముఖ్య కార్యదర్శిని, పరిశ్రమల విభాగం ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. తద్వారా.. నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా ప్రయోజనాలు చేకూర్చారా అన్న అంశాన్ని నిర్ధారించటమో, తిరస్కరించటమో జరుగుతుందని ఈ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనాలైనా చేకూర్చారా అన్నది నిర్ధారిస్తూనో, లేక లేదని తిరస్కరిస్తూనో వారు కౌంటర్లు దాఖలు చేయలేదు.. ఇంతటి ముఖ్యమైన కేసులో ఎలాంటి న్యాయవాది ద్వారా తమ వాదనలూ వినిపించలేదు. ఇది దిగ్భ్రాంతికరం.
హైకోర్టు తీర్పులో వైఎస్ పేరు ఏదీ?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులో అమలయ్యే భాగమైన (ఆపరేటింగ్ పోర్షన్) పై పేరాగ్రాఫ్ ద్వారా.. ప్రయోజనాలు చేకూర్చారా అన్నది నిర్ధారించటమో, తిరస్కరించటమో చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేయనందున.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉదారత, అధికార ప్రయోజనాలు పొందిన వారు.. అందుకు బదులుగా ఐపీసీ, పీఎంఎల్‌ఏ (నగదు అక్రమ లావాదేవీల నిరోధ చట్టం), అవినీతి నిరోధక చట్టాలను ఉల్లంఘించి.. 52వ ప్రతివాది, అంటే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన కంపెనీల షేర్ కేపిటల్‌లో పెట్టుబడులు పెట్టారా అన్నది సీబీఐ దర్యాప్తు చేయాలని హైకోర్టు భావించినట్లు స్పష్టమవుతోంది. ఈ ఆపరేటింగ్ పోర్షన్‌లో ఎక్కడా డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గురించి ప్రస్తావన లేదన్న విషయం ఇక్కడ గుర్తించాలి.
నిబంధనల ఉల్లంఘనను నిర్ధారించలేదు…
ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వంలోని సాగునీటి శాఖ, పరిశ్రమల శాఖ, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ, గనుల శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వంటి విభాగాలు.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు, నియమ నిబంధనలను ఉల్లంఘించి కొన్ని సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చాయా అన్న దానిదగ్గర సీబీఐ తన దర్యాప్తు మొదలుపెట్టి ఉండాల్సింది. ప్రత్యేకించి.. ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చిన పలు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు.. కౌంటర్లూ దాఖలు చేయలేదు, న్యాయవాదులతో తమ వాదనలూ వినిపించలేదు కాబట్టి.. వీటి దగ్గరి నుంచే దర్యాప్తు మొదలు పెట్టి ఉండాల్సింది. ఏవైనా ప్రయోజనాలు చేకూర్చారని నిర్ధారించటానికి.. చాలా ముఖ్యమైన అంశం అక్కడ ఒక విధానం ఉండాలి.. కొన్ని సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు ఆ విధానాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఉండాలి. ఒకవేళ సీబీఐ ఏవైనా భారీ ఉల్లంఘనలను కనుగొన్నట్లయితే.. వారు పెట్టుబడిదారులను ప్రశ్నించటం మొదలుపెట్టి ఉండొచ్చు. ఏవైనా ప్రయోజనాలు చేకూర్చారని సీబీఐ నిరూపించగలిగినప్పుడే.. ఆ ప్రయోజనాలకు బదులుగా (క్విడ్ ప్రొ కొ) అనేది ముందుకు వస్తుంది.. లేదంటే రాదు. కానీ.. ఇప్పుడు సీబీఐ చేస్తున్నది దీనికి ఖచ్చితంగా వ్యతిరేక దిశలో ఉంది. తమ వద్ద ఎలాంటి సాక్ష్యమూ లేకుండానే.. ప్రయోజనాలు చేకూర్చారని నిర్ధారించటమే కాకుండా.. దానిని అంగీకరించాలని పెట్టుబడిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదంతా ముందుగా నిర్ణయించుకున్న ఆలోచన ప్రకారమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎలాంటి ఆధారం లేకుండా ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరు…
ఎఫ్‌ఐఆర్‌లోని 9వ పేరాలో సీబీఐ విచిత్రంగా ఎలాంటి ఆధారం లేకుండానే.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన దివంగత తండ్రి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డితో కలిసి కొన్ని సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు నేరపూరిత కుట్ర పన్నారని నిర్ధారించిందన్న వాస్తవం.. దీనిని స్పష్టంచేస్తోంది. పైగా.. హైకోర్టు తీర్పులోని 52వ పేరాను (ఆపరేటివ్ పోర్షన్‌ను) సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో యథాతథంగా చేర్చింది. ఆ పేరా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదారత, అధికారిక ప్రయోజనాల గురించి ప్రస్తావించింది కానీ.. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గురించిన ప్రస్తావన అందులో లేదు. సీబీఐ కేసు అంతా ఈ కట్టుకథ మీదే ఆధారపడి ఉంది.
ప్రభుత్వమంటే ముఖ్యమంత్రా?
సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి బదులుగా ముఖ్యమంత్రి పేరును ఎలా చేర్చగలదు? అంటే.. ముఖ్యమంత్రే రాష్ట్ర ప్రభుత్వమని అర్థమా? ఈ కేసు పరిధిలో సచివాలయంలోని దాదాపు ఏడు విభాగాలు జారీ చేసిన జీవోలు ఉన్నాయి. నిజానికి.. జీవోలు జారీ చేసేది ప్రభుత్వంలోని వివిధ విభాగాల కార్యదర్శులని, వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల నిబంధనల్లోని 58వ నిబంధన కింద.. గవర్నర్ జారీచేసిన సచివాలయ సూచనలు రెండో భాగంలో గల నిబంధనల ప్రకారం పనిచేస్తారన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.
మంత్రులు అంగీకరిస్తేనే కార్యదర్శుల జీవోలు…
ఒక ముఖ్యమంత్రి ఎంత శక్తిమంతుడైనప్పటికీ.. ఆయన తన సంతకంతో ఏ జీవోనూ జారీ చేయలేరు. పైన చెప్పిన ప్రభుత్వ వ్యవహారాల నియమాల్లోని 8వ నిబంధన ప్రకారం.. ఆయా శాఖల కార్యదర్శులు మాత్రమే.. తమ శాఖకు చెందిన మంత్రి నుంచి అనుమతి పొందిన తర్వాత జీవో జారీచేయగలరు. సదరు జీవో సక్రమంగా ఉండేలా.. అది ఎలాంటి నిబంధననూ, నియంత్రణనూ ఉల్లంఘించకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆ కార్యదర్శికి ఉంటుంది. జీవోలు జారీచేసే ఈ అధికారం కార్యదర్శులకు అప్పగించింది ఎందుకంటే.. వారు భారత రాజ్యాంగంలోని 311వ అధికరణ కింద రాజ్యాంగ రక్షణలో ఉన్న శాశ్వత ఉద్యోగులు కాబట్టి. ప్రభుత్వ వ్యవహారాల నియమాల కింద వారికి విస్తారమైన అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. కార్యదర్శికి కూడా భాగస్వామ్యం ఉంటేనే.. ఏ నిబంధనల ఉల్లంఘన అయినా సాధ్యమవుతుందని, లేదంటే కాదన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి నిబంధనల కారణంగానే.. 2జీ స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ సంబంధిత మంత్రి, కార్యదర్శిలపై దర్యాపు చేపట్టింది కానీ.. ప్రధానమంత్రిపై నిర్లక్ష్యం/భాగస్వామ్యం ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనపై దర్యాప్తు చేపట్టలేదు. కానీ.. ఈ కేసు విషయంలో సీబీఐ పూర్తిగా భిన్నమైన పద్ధతిని ఎందుకు అనుసరిస్తోంది? ప్రత్యేకించి హైకోర్టు చెప్పని విధంగా ఎందుకు చేస్తోంది?
ఎఫ్‌ఐఆర్‌లో మంత్రులు, కార్యదర్శులను ఎందుకు మినహాయంచారు?
కొందరు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఇచ్చారని చెప్తున్న.. ఆ సందేహాస్పద జీవోలను జారీ చేసిన కార్యదర్శులను, ఆ జీవోలు జారీ చేయటానికి వారికి అనుమతి ఇచ్చిన మంత్రులను.. సీబీఐ తన ఎఫ్‌ఐఆర్ నుంచి మినహాయించటం పూర్తిగా అర్థరహితం. నిజానికి.. కార్యదర్శులతో పాటు.. వారికి సంబంధించిన మంత్రుల క్రియాశీల సమ్మతి లేనిదే.. ఎలాంటి జీవో జారీ చేయటమైనా సాధ్యం కాదు. కాబట్టి.. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి తొలుత ప్రభుత్వంలోని పలువురు కార్యదర్శులు, పలువురు మంత్రులతో కలిసి నేరపూరిత కుట్ర పన్నకుండా.. తన కుమారుడితో కలిసి నేరపూరిత కుట్ర పన్నే అవకాశం లేదు. యాధృచ్ఛికంగా.. ఆ మంత్రులు, కార్యదర్శులు అంతా ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నారు. కానీ దీనికి బదులుగా.. ఈ లోకంలో లేని, తన తరఫున వాదించుకోలేని దివంగత ముఖ్యమంత్రి పేరును ఎందుకు చేర్చారు? అసలు.. ఏ జీవోల ద్వారా ప్రయోజనాలు చేకూర్చారరని చెప్తున్నారో.. వాటి నుంచి దర్యాప్తు మొదలు పెట్టి ఉండాల్సింది. కానీ.. దీని గురించి సీబీఐని మా పార్టీ బహిరంగంగా ప్రశ్నించే వరకూ.. వారు ప్రభుత్వం నుంచి ప్రాథమిక వివరాలు సేకరించటం కూడా మొదలుపెట్టలేదు. రాజీవ్‌గాంధీ తన తరఫున వాదించుకోవటానికి లేరన్న కారణంతో బోఫోర్స్ కేసు దర్యాప్తు నుంచి ఆయన పేరును తొలగించిన సీబీఐ.. ఇప్పుడు ఈ ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన, ఏకైక కుట్రదారుడిగా దివంత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును ఎలా చేర్చింది?
చంద్రబాబు హయాంలో కేటాయింపులు లేవా?
చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం కూడా 1,800 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పలు సత్వర స్థాపిత విద్యుత్కేంద్రాలు, కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, ఎమ్మార్, రహేజా, వాడ్రేవు వంటి ప్రాజెక్టులు, కాకినాడ పోర్టు ప్రైవేటీకరణ, శంషాబాద్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ, ఐఎంజీ వంటి వాటెన్నింటికో కేటాయింపులు జరపలేదా? ఈ విషయంలో టీడీపీ అనుసరించిన విధి విధానాలకు భిన్నంగా వైఎస్సార్ ప్రభుత్వం ఏమైనా వ్యవహరించిందా? అలాంటప్పుడు ఏ నిర్ణయానికైనా వచ్చే ముందు ఈ విధానాలన్నింటినీ పరిశీలించడం సీబీఐకి కనీస బాధ్యత కాదా?
దర్యాప్తు లేకుండానే సీబీఐ దాడులు…
కానీ సీబీఐ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. దర్యాప్తు మొదలు పెట్టి, ఆరోపిత లబ్ధులేమైనా నిజంగా చేకూరాయా అని విచారణ జరపడానికి బదులుగా… పెట్టుబడిదారుల నివాసాలు, కార్యాలయాలపై దాడులకు దిగింది. దాంతోపాటు అత్యున్నత స్థాయి బెదిరింపులు, హెచ్చరికలతో వారి కదలికలను నియంత్రించడం ద్వారా వారిని భయకంపితులను చేయడం మొదలు పెట్టింది. వారికి ఇష్టానికి తాఖీదులు పంపి పిలిపించుకుని, అంతూపొంతూ లేకుండా సుదీర్ఘ కాలం పాటు వేచి ఉండేలా చేశారు. తద్వారా వారిని మానసికంగా కుంగదీసేందుకు స్పష్టమైన ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారు. పైగా నన్నెలాగైనా ఈ క్రిమినల్ కేసుల్లో ఇరికించాలని సీబీఐ ముందుగానే నిర్ణయించుకుందనినాకు సమాచారముంది. అందుకోసం… నాకు భాగస్వామ్యమున్న కంపెనీల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడిగా పెట్టిన నగదు వారిది కాదని, నిజానికి ఆ డబ్బును అలా పెట్టుబడిగా పెట్టేందుకు నేనే వారికిచ్చానని రాతపూర్వకంగా అంగీకరించాల్సిందిగా వారిపై ఎంతగానో ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. నాకు వ్యతిరేకంగా ఇలా తప్పుడు ప్రకటన రాసివ్వని పక్షంలో తీవ్రాతి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఇన్వెస్టర్లకు బెదిరింపులు, హెచ్చరికలు అందుతున్నాయి.
లగడపాటి శ్రీధర్ పేరును తొలగించిందెందుకు?
అసలు నిందితుల జాబితా నుంచి లగడపాటి శ్రీధర్ పేరును ప్రాథమిక విచారణ దశలోనే సీబీఐ నిస్సిగ్గుగా తొలగించడం విస్మయకరం! ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధులూ పొందలేదని సీబీఐ తనంతట తానే ఓ నిర్ధారణకు వచ్చి, దాని ఆధారంగా ఈ నిర్ణయం తీసేసుకుంది. కానీ వాస్తవానికి, నాకు సంబంధించినవని ఆరోపిస్తున్న కొన్ని కంపెనీల్లో రూ.350కి ఒక వాటా చొప్పున లగడపాటి శ్రీధర్ పెట్టుబడులు పెట్టారు. మరి అదే ప్రీమియంకు, అంటే ఒక్కో వాటాకు రూ.350 వంతున ఇతరులు పెట్టిన పెట్టుబడులు వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధులకు ప్రతిఫలమేనని (క్విడ్ ప్రొ కో) ఇదే సీబీఐ నిర్ధారించేసింది! ఇక్కడ నిజమైన క్విడ్ ప్రొ కో అల్లా ఒక్కటే. అదేమిటంటే, కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడైన ఆ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు శ్రీధర్ సోదరుడు! మరి ఈ సోకాల్డ్ హెచ్చు ప్రీమియానికి షేర్లు కొనడం ఒకరి విషయంలో హేతుబద్ధమేనని సీబీఐ భావిస్తుంటే ఇతరులకు కూడా అదే వర్తించాలి కదా! ఏమీ లేని దగ్గర ఏదో జరిగిపోతోందని వారు అనుమానించడమెందుకు? సీబీఐ ఎంత ఘోరంగా వ్యవహరిస్తోంది?!
నాకు భాగస్వామ్యమున్న కంపెనీలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వివరాలను క్తుప్లంగా దిగువ పొందుపరుస్తున్నాను:
సండూర్ పవర్ కంపెనీపై రాద్ధాంతం…
కర్ణాటకలో ఉన్న ఈ పవర్ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కూడా నాపై దురుద్దేశపూర్వక విమర్శలు చేస్తున్నారు. మా నాన్నగారు ముఖ్యమంత్రి కావడానికి మూడేళ్ల ముందే దీని ఏర్పాటు ప్రణాళిక అమలును నేను చేపట్టాను. దీని విద్యుదుత్పాదన సామర్థ్యం 37.5 మెగావాట్లు. మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మునుపే ప్రమోటర్ల ఈక్విటీ వాటాల్లో 90 శాతానికి పైగా పెట్టుబడులుగా వచ్చేశాయి. అప్పటికి సండూర్ పవర్ ప్రాజెక్టు దాదాపుగా పూర్తవడమే గాక విద్యుదుత్పానకు సిద్ధపడుతోంది కూడా. దాదాపుగా రూ.140 కోట్ల మూలధనంతో కూడిన ఈ ప్రాజెక్టు 2004 డిసెంబర్ చివరికల్లా, అంటే మా నాన్న ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోపే పని చేయడం ప్రారంభించింది. దీనికి ప్రతి మెగావాట్‌కు అనుమతించిన వ్యయం దాదాపుగా 7 నుంచి 8 కోట్లని ఐఆర్‌ఈడీఏ వివరాలు చూస్తే తెలుస్తుంది. మరి, అప్పటికే మొదలైన ప్లాంటులో ఎస్‌ఎస్‌కేఐ విలువ కట్టిన మేరకు మెగావాట్‌కు రూ.10 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడితే అందులో తప్పేముంది? తద్వారా మరింత ఈక్విటీ కంపెనీలోకి వచ్చిందే తప్ప డిజిన్వెస్ట్‌మెంట్ జరగలేదే! పైగా, ఈ ఇన్వెస్టర్లకు ఇబ్బందులు తప్పించేందుకు, వికా ఒప్పందం తర్వాత ఆ షేర్లను నేను తిరిగి కొన్నాను. తద్వారా వారు పెట్టుబడి పెట్టిన దాని కంటే ఎక్కువ మొత్తాలనే వారికిచ్చాను. వారు ఇన్వెస్ట్ చేసిందంతా నిజంగా నా డబ్బే అయితే ఆ షేర్లను నేనెందుకు తిరిగి కొంటాను?
జగతి పబ్లికేషన్స్ విషయమూ అంతే…
తెలుగులో ప్రధాన దిన పత్రిక అయిన ‘సాక్షి’ని జగతి పబ్లికేషన్స్ ప్రచురిస్తోంది. సాక్షి సర్క్యులేషన్ రోజుకు 14.5 లక్షల కాపీలని ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ (ఏబీసీ) నిర్ధారించింది. ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (ఐఆర్‌ఎస్) ప్రకారం ‘సాక్షి’ సంచిక సగటు యావరేజ్ ఇష్యూ రీడర్‌షిప్ (ఏఐఆర్) 48.16 లక్షలు, మొత్తం రీడర్‌షిప్ 1 కోటి 34 లక్షలు. ‘సాక్షి’ విజయగాథను దేశవ్యాప్తంగా అత్యున్నత బిజినెస్ స్కూళ్లలో కేస్ స్టడీగా స్వీకరిస్తున్నారు. జాతీయ స్థాయిలో పత్రిక 9వ స్థానంలో నిలిచింది. కాస్త అటూయిటుగా ‘సాక్షి’కి ఉన్నంత సర్క్యులేషనే ఉన్న ‘ఈనాడు’ అనే ఓ స్థానిక పోటీ పత్రిక… రూ.1,800 కోట్ల సంచిత నష్టాలు, పైగా పాతబడ్డ యంత్రాలు, కాలం చెల్లిన పరిజ్ఞానంతో నడుస్తూ కూడా తన విలువను రూ.6,700 కోట్లుగా చూపించుకుంది. ‘సాక్షి’ మొదలయ్యేందుకు కొద్ది నెలల ముందే ఇన్వెస్టర్లకు ఆ లెక్కన వాటాలు విక్రయించడం ద్వారా పెట్టుబడులను స్వీకరించడం మొదలు పెట్టింది. అది అంగీకారయోగ్యమే అయినప్పుడు… ‘సాక్షి’ని అందులో సగం మొత్తానికే డెలాయిట్ విలువ కడితే దానిపై వివాదమెందుకు? ‘సాక్షి’ వాల్యుయేషన్‌పై ఎలాంటి ప్రశ్నలకూ ఆస్కారమే ఉండరాదు.
భారతి సిమెంట్స్ ఇన్వెస్టర్లంతా లాభపడ్డారు
దాల్మియా సిమెంట్, ఇండియా సిమెంట్, నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలు… ఇలా కేవలం మూడు బయటి గ్రూపులు మాత్రమే ఇందులో పెట్టుబడులు పెట్టాయి. వారే గనక క్విడ్ ప్రొ కో పద్ధతిన ఇన్వెస్ట్ చేసి ఉంటే, తమ వాటాలను ఎందుకు విక్రయించారు? మరో విషయమూ ఇక్కడ ప్రస్తావనార్హం. దాదాపుగా రూ.95 కోట్లు ఇన్వెస్ట్ చేసిన దాల్మియాలకు తమ వాటాలను ప్రపంచ సిమెంట్ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకటైన వికా కంపెనీకి విక్రయించడం ద్వారా రూ.150 కోట్లు వచ్చాయి. అలాగే దాదాపుగా రూ.90 కోట్లు పెట్టుబడి పెట్టిన ఇండియా సిమెంట్స్‌కు రూ.140 కోట్లు; దాదాపుగా రూ.265 కోట్లు ఇన్వెస్ట్ చేసిన నిమ్మగడ్డ ప్రసాద్‌కు రూ.550 కోట్లు వచ్చాయి.
పై వాస్తవాలు, వివరాల నేపథ్యంలో… విపక్షాలను, అసమ్మతిని అమాంతంగా తుడిచి పెట్టేస్తున్న కాంగ్రెస్ పార్టీపై మా పోరాటాన్ని మీరు అర్థం చేసుకోవాలని, అందుకు మద్దతివ్వాలని కోరుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కొద్ది రోజుల క్రితం ప్రధానికి రాసిన లేఖ కాపీని కూడా దీనితో పాటుగా జత పరుస్తున్నాను.
నిరూపించేందుకు ఏమీ లేదు…
వారు కౌంటర్లు దాఖలు చేయకపోవటం వెనుక కారణం.. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రయోజనాలైనా చేకూర్చారని నిరూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. వారు కౌంటర్లు దాఖలు చేసినట్లయితే.. ఇదే చెప్పాల్సి వచ్చేది. అలా జరిగితే.. నా మీద అసలు కేసే ఉండదు. కాబట్టి.. వాళ్లు కౌంటర్లు దాఖలు చేయలేదు. కనీసం.. పిటిషనర్లయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిబంధనలు ఉల్లంఘించిందనేందుకు కాగ్ లేదా ఏసీబీ లేదా విజిలెన్స్ వంటి స్వతంత్ర నివేదికల రూపంలోనైనా హైకోర్టు ఎదుట ఎలాంటి ప్రాధమిక సాక్ష్యాన్నీ ఉంచలేకపోయారు. అయినాకూడా.. మా దురదృష్టవశాత్తూ.. స్వీకరించిన రిట్‌పిటిషన్‌పై ఈ కింది ఆదేశాన్ని జారీచేసింది:
‘52వ పేరా: భారీ స్థాయిలో ప్రభుత్వ ఉదారతతో కూడిన ఆర్థిక అవకతవకలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులు పొందిన ఉదారత, ప్రయోజనానికి బదులుగా (క్విడ్ ప్రొ కొ) చేసుకున్న ఏర్పాటులో భాగంగా భారీ పెట్టుబడులతో కూడిన కార్పొరేట్ లావాదేవీలకు సంబంధించి అన్ని కోణాలు, ఇతర కోణాలన్నింటిలోనూ సమగ్ర దర్యాప్తు, పరిశోధనను అందుబాటులో ఉన్న సమాచారం బలపరుస్తోంది. సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో చెప్పిన ప్రజా ప్రయోజన వ్యాజ్య పరిధిని పై అంశాల్లో పరిగణనలోకి తీసుకుంటూ.. 52వ నంబర్ ప్రతివాదికి చెందిన గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన తీరుకు సంబంధించి.. దానికి ప్రతిగా ఆ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు, అధికారిక ఉపకారాలు పొందటానికి సంబంధించి.. భారత శిక్షా స్మృతి, అవినీతి నిరోధక చట్టం, నగదు అక్రమ లావాదేవీల నిరోధక చట్టంలోని నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, నేరపూరిత కుట్రలు, సంబంధిత ఇతర నేరాలకు పాల్పడటంతో పాటు.. స్థానిక, విదేశీ సంస్థలు, పన్ను రాయితీకి ప్రముఖమైన దేశాల్లో ఉన్న కొన్ని సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టటానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలపట్ల మేం సంతృప్తి చెందాం. ప్రజాప్రయోజనాల రీత్యా ఇలాంటి అంశాల్లో సమర్థత, నైపుణ్యత, విశ్వసనీయత గల ప్రత్యేక సంస్థ ద్వారా దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయటం న్యాయబద్ధం, అవసరం అని భావిస్తున్నాం. ఈ విశ్లేషణ ప్రకారం అందుకు సీబీఐయే తగిన సంస్థ అవుతుంది.’
అసమ్మతిపై సర్కారులో అసహనం…
సంస్కృతులు, భాషలు, జాతులు, మతాలు, కులాలు, ఉప కులాలు, ఆర్థిక, సామాజిక అంతరాల్లో అపారమైన వైవిధ్యానికి ఆలవాలమైన మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పదిలంగా నిలుపుకోగలిన సామర్థ్యమే స్వాతంత్య్రానంతరం మనం సాధించిన అతి పెద్ద విజయం. ప్రజాస్వామ్యం పట్ల మన ప్రజల సమష్టి సంకల్పాన్నే ఇది ప్రతిఫలిస్తోంది. అలాంటి ప్రజాస్వామ్యానికి పునాదులు…అభిప్రాయ భేదాలు, వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛాయుతంగా తిరగగలిగే స్వాతంత్య్రాలే! కానీ అసమ్మతి, అభిప్రాయ భేదాల పట్ల అచ్చం ఎమర్జెన్సీ రోజుల తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వంలో అసహనం పాళ్లు పెరిగిపోతుండటం నిజంగా దురదృష్టకరం. చట్టబద్ధంగా తమను వ్యతిరేకిస్తున్న వారిపై ఇష్టానుసారం వారు కేసులు బనాయించేస్తున్నారు! ప్రభుత్వానికి అవధుల్లేని అధికారం ఉండవచ్చు గాక! ఎమర్జెన్సీ రోజుల్లో జరిగినట్టుగా… వాటి వాడకం చట్టబద్ధమే కూడా కావచ్చు గాక! ఎమర్జెన్సీ విధింపును, అత్యంత గొప్పవైన 19, 21 అధికరణలతో పాటు ప్రాథమిక హక్కులన్నింటి రద్దును, ప్రభుత్వంతో విభేదించిన వారందరి వాక్ స్వాతంత్య్రాన్నీ, వ్యక్తిగత స్వేచ్ఛనూ నిరాకరించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ ఆ తర్వాత ఏమైందో మనమంతా చూశాం. ఎమర్జెన్సీకి సంబంధించి 1976లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు దేశంలో మెజారిటీ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకపోయినా… అది తప్పుడు తీర్పేనని న్యాయమూర్తులు జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ అశోక్‌కుమార్ గంగూలీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే మనలో ప్రధాన స్రవంతి ప్రజాస్వామిక ప్రక్రియలో పాలుపంచుకుంటున్న వారెవరమూ ప్రజాభిప్రాయాన్ని విస్మరించజాలం. ఎందుకంటే… ప్రజాస్వామ్యం తాలూకు సిసలైన సారాంశమల్లా కేవలం అది మాత్రమే! కానీ, అంత గొప్పదైన ప్రజాభిప్రాయాన్ని గౌరవించేందుకు కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంటోంది. పైగా.. తన గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్వాల్సింది పోయి… వ్యతిరేకతను ఉక్కుపాదంతో అణచేసేందుకు తన చేతిలో ఉన్న ప్రభుత్వాధికారాన్ని మరింత గట్టిగా ఉపయోగిస్తోంది.
ఆనాడే ఐటీ, ఈడీలకు ఆదేశాలు…
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు నేను ప్రకటన చేసిన తక్షణం… నాపై దర్యాప్తు మొదలు పెట్టాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)లకు ఆదేశాలు వెళ్లాయి. భారీ సంఖ్యలో డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా వారు మమ్మల్ని ఆదేశించారు. వాటన్నింటినీ ఆరు నెలల పాటు క్షుణ్నంగా తనిఖీ చేశారు. మా సీనియర్ అధికారులను నిత్యం పిలిపించుకుంటున్నారు. కానీ వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు గంటల తరబడి ఎదురుతెన్నులు చూసేలా చేస్తున్నారు. ఇప్పుడేమో… మేము నగదు అక్రమ తరలింపులకు (మనీ లాండరింగ్) పాల్పడ్డామని ఏదోలా మాతోనే ఒప్పించేందుకు ఈడీకి చెందిన మరో బృందం దర్యాప్తు మొదలు పెట్టింది! ఆ ఒత్తిళ్లకు మేం గనుక లొంగని పక్షంలో ఈడీ మా ఆస్తులన్నింటినీ జప్తు చేసుకుంటుంది. మా బ్యాంకు ఖాతాలను కూడా జప్తు చేస్తుంది. నిజానికి సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానళ్లే వారి ప్రాథమిక లక్ష్యం! ఈడీ, సీబీఐల సాయంతో ఏదోలా ఆ రెండు సంస్థలనూ మూసేయించాలంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు! ఇక మా వ్యతిరేక మీడియా సంగతి. సీబీఐ ఎప్పుడెప్పుడో ఏమేం చేయనుందో, తర్వాతి చర్య ఏమిటో… మమ్మల్ని బాహాటంగా వ్యతిరేకించే కొన్ని వార్తా పత్రికలు, టీవీ చానళ్లకు ముందస్తుగానే పక్కాగా సమాచారం అందుతున్న వైనం చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పత్రికలు రాష్ట్రంలో అందరికీ చిత్తభ్రమ కలిగిస్తున్నాయి.
మీ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి