‘నాది పనికిమాలిన ఆలోచన’

కేతు విశ్వనాథరెడ్డి గురించి సొదుం జయరాం

జ్ఞాపకశక్తికీ నాకూ చుక్కెదురు. విశ్వం, నేనూ ఎప్పుడు దగ్గరయ్యామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఇద్దరం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మా ఇద్దరికీ స్నేహం అయినట్టు లేదు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులలో రా.రా గారు కడపకొచ్చారు. ఆయన ఎక్కడెక్కడి వాళ్ళను ఒకచోట చేర్చారు. గజ్జల మల్లారెడ్డి, కేతు విశ్వనాధరెడ్డి, ఆర్వీఆర్, రామప్ప, బండి గోపాల్ రెడ్డి, వై.సి.వి.రెడ్డి, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, గోవిందరెడ్డి, రామ్మోహన్ .. అంతా రా.రా మూలంగానే కలుసుకున్నట్లు జ్ఞాపకం. కడప జిల్లా సాహిత్య చరిత్రలో అదొక స్వర్ణయుగం. అప్పుడు రా.రా గారు సవ్యసాచి పత్రిక సంపాదకుడుగా ఉన్నారు. సవ్యసాచి నాటికి విశ్వం ఇంకా కథకుడు కాలేదు. సవ్యసాచిలో విశ్వం నాటిక ఒకటి వచ్చింది. దాని పేరు ‘వలలో చేపలు’ అనుకుంటాను. మంచి depth ఉన్న నాటిక. అప్పటికి విశ్వంతో నాకు చెప్పుకోదగ్గ మైత్రి లేదు.

విశ్వం యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో రామప్పతో కలిసి రెండు సార్లు మా వూరికి వచ్చాడు. విశ్వం ఊరు రంగశాయిపురం. అది మా వూరికి పడమటి దిశన పది కిలోమీటర్ల దూరంలో ఉంది. తమ ఊరికి వెళ్తూ మా వూరు మజిలీ చేసుకున్నారు. ఆ ఊరికి సరైన దారీడొంకా లేదు. గుట్టలు దాటి వెళ్ళాలి. మా ఊర్లో సాయంత్రం వరకు గడిపి నడిచి వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత నేనూ ఒకటి రెండు సార్లు వాళ్ళ ఊరు వెళ్ళాను. దాదాపు ఊర్లో అన్నీ సంపన్న కుటుంబాలే. ఊరి చుట్టూ పచ్చటి చీనీ తోటలు. చీనీ తోటల మధ్య ఊరు. చూడముచ్చటగా ఉండేది. ఈ రాకపోకల వల్ల మా మైత్రి బలపడింది.

విశ్వం, నేను బాగా దగ్గరయింది హైదరాబాదులో. నేను బియ్యే పూర్తి చేసి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాను. విశ్వం కూడా హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడని ఎవరో చెప్పారు. విశ్వాన్ని వెతుక్కుంటూ “ఆంధ్ర రత్న” దినపత్రిక ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఆయన సహాయ సంపాదకుడుగా పనిచేస్తున్నారు. కలుసుకోగానే ఇద్దరికీ ప్రాణం లేచివచ్చింది. ఇద్దరం తిలక్ రోడ్ నుండి నడుచుకుంటూ వచ్చి పబ్లిక్ గార్డెన్స్ లో కూచున్నాం. చీకటి పడే వరకు కబుర్లు చెప్పుకున్నాం. ఏమేమి ముచ్చటించుకున్నామో గాని గంటలు నిముషాల్లా దొర్లిపోయాయి. ఆ తర్వాత ఇద్దరం దాదాపు రోజూ కలుసుకునేవాల్లం. ఉన్నట్టుండి విశ్వం ఒకరోజు “నా రూముకు వచ్చి నాతోనే ఉండకూడదూ” అన్నాడు. అప్పుడు నేను సరోజినీ హాస్పిటల్ దగ్గర ఒక మిత్రుని రూములో ఉంటున్నాను. ప్రశాంతమైన వాతావరణంలో మా రూము ఉండేది. అంతా బాగానే ఉంది. సరైన కంపెనీ లేదు. ఏదో ఒంటరితనం ఫీలయ్యేవాన్ని. విశ్వం అడగ్గానే పెట్టె బేడా సర్దుకొని విశ్వం రూములో చేరిపొయ్యాను.

చదవండి :  ముఖ్యమంత్రి గారూ, అభినందించండి సార్!

సుల్తాన్ బజార్లో ఉండేది ఆ రూము. కింద భోజన హోటల్. పైన అయిదారు రూములుండేవి. భోజనానికి రూముకు కలిసి డెబ్బై రూపాయలు. కారుచౌక. విశ్వానికి ఆంధ్రరత్నలో వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాదాపు నా జీతం కూడా అంతే. డెబ్బై రూపాయలు భోజనానికి, రూముకు పొతే ఇంకా చేరి ముప్పై రూపాయలు మిగిలేది. అది మా పై ఖర్చులకు సరిపోయేది.

ఆ రోజుల్లో విశ్వం చాలా నిరాడంబర జీవి. నేనూ అంతే. ఎక్కడికి వెళ్ళాలన్నా సిటీ బస్సు ఎక్కేవాళ్ళం కాదు. నడచి వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో మాకు ఏ దురలవాట్లూ ఉండేవి కావు.

విశ్వానికి క్రమశిక్షణారాహిత్యం పథ్యం. ప్రొద్దున్నే ఐదింటికి లేచేవాడు. మా గదులకు కామన్ బాత్రూం, కామన్ లెట్రిన్ ఉండేది. వాటి ముందు ఐదింటికే క్యూ సిస్టం మొదలయ్యేది. క్యూలో నిలబడి విశ్వం చకచకా కార్యక్రమాలు ముగించేవాడు. అప్పిటికి ఇంకా నేను నిద్రపోతూనే ఉంటాను. నన్ను లేపడానికి యమసతాయించేవాడు. నేను లేచేవాన్ని కాదు. విసుక్కుని ఆయన ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్ళేవాడు.

విశ్వం చాలా కలుపుగోలు మనిషి. ఆ గదుల్లో ఉన్న వాళ్ళందరితోనూ చాలా సన్నిహితంగా ఉండేవాడు. అందరూ ఆయన్ని అన్నా అన్నా అని పిలిచే వాళ్ళు. కృష్ణా పత్రిక నుంచి, ఆంధ్రరత్న నుంచి విశ్వాన్ని కలుసుకోవడానికి అడపా దడపా జర్నలిస్టులు వచ్చేవాళ్ళు. వాళ్ళతో వీళ్ళతో బాతాఖానీ కొట్టడం తప్పితే ఏదన్నా రాయడం కానీ, చదవడం కానీ చేసేవాడు కాదు. ఆయనలో నాకు అన్నీ exrovert లక్షణాలు కనిపించాయి తప్ప introvert లక్షణాలు కనిపించలేదు.

జంటకవుల్లా ఇద్దరం కలిసి కథలు రాద్దామని ఒక ప్రతిపాదన పెట్టాను ఒక రోజు. ఓ.కే. అన్నాడు. నిజానికి నాది పనికిమాలిన ఆలోచన.

ఏది ఏమైనా రెండు సిట్టింగ్స్ లో కథ పూర్తి చేశాను. విశ్వం కథ చదివి బాగుందన్నాడు. తను మళ్ళీ రీరైట్ చేస్తానన్నాడు. అన్నట్లుగానే రెండు మూడు రోజుల తర్వాత ఒక పేరా తిరగరాశాడు. నేను రాసిన దానికన్నా విశ్వంది మంచి ఎత్తుగడ. ఎలాంటి డొంకతిరుగుళ్ళు లేకుండా కథ హెలికాప్టర్ లా స్పీడందుకుంటుంది. నేరుగా కథలోకి దిగుతుంది. ఆ పేరా చదివాక ఈ మనిషి కథ బాగా రాయగలడు అనిపించింది. తర్వాత ఒక నెల గడచినా మిగతా కథ తిరగరాయలేదు. కథ రాయాలన్నా, కవిత రాయాలన్నా మూడ్ అవసరం. spontainity అవసరం. అది మొదట రాసిన వాడికే ఉంటుంది. కానీ రెండవ విడత రాసేవాడికి ఆ ఆస్కారం ఉండదు. అందుకే దాన్ని విశ్వం తిరగరాయలేకపోయాడనుకుంటాను. విశ్వం రాసిన మొదటి పేరాను అలాగే ఉంచి ఆ కథని ఆంధ్రప్రభకి పంపించాను. నా పేర అచ్చయింది.

చదవండి :  'తాళ్ళపొద్దుటూరు'లో ఏమి జరుగుతోంది?

ఏది ఏమైతేనేం జంటకథకులుగా కథలు రాయాలన్న మా అభిలాష విఫలమైంది.

కడప జిల్లాలోని ఆధునిక రచయితలు, రారా దగ్గర నుంచి అంతా దాదాపు ఫ్యూడల్ కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళే. విశ్వం అందుకు మినహాయింపు కాదు. విశ్వం తండ్రి కేతు భీమా రెడ్డి గారు చాలా సంపన్న కుటుంబీకులు. ఆయనకు రంగాశాయిపురంలో భూమీపుట్రాతో పాటు, ఎర్రగుంట్లలో ఒక వేరు శనక్కాయల జిన్ను, చిలమకూరులో ఒక జిన్ను ఉండేది.

అట్లాంటి సంపన్న కుటుంబంలోనుండి వచ్చినా ఆయనలో ఫ్యూడల్ వాసనలు మచ్చుకు కూడా కనిపించేవి కాదు. చాలా సాదాసీదాగా ఉండేవాడు. మంచి సంస్కారి.

నాకు తెలిసినంత మేరకు అతని పూర్వీకులెవరూ సాహిత్య వాసనలున్న వాళ్ళు కూడా కాదు. కేవలం అతడి జీవితమే అతడ్ని సాహితీకారుడ్ని చేసింది.

విశ్వం ఇతర రచయితలతో, కవులతో పరిచయాలకు ప్రాకులాడే రకం కాదు. ఆ రోజుల్లో మేముండే గది కింద ఇంట్లో దాశరధి కృష్ణమాచారి గారు ఉండేవారు. రేడియో స్టేషన్ లో ఉండే రచయితలు చాలా మంది దాశరధి గారింటికి వస్తూపోతూ ఉండేవాళ్ళు. మాకు దాశరధి క్రుష్ణమాచార్యులను కలుసుకోవాలన్న ఆలోచనే రాలేదు.

విశ్వం నేనూ ఒకే రూములో ఎన్నాల్లున్నామో సరిగ్గా నాకు గుర్తు లేదు. తర్వాత నేను కడపకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. నేను కడపకు వెళ్ళిన కొద్ది రోజులకే విశ్వం లెక్చరర్ గా కడపకు వచ్చినట్లు జ్ఞాపకం. విశ్వం కడపకు వచ్చిన తర్వాత కూడా అతనిలోని కథకుడు మేల్కొన్నట్లు లేదు. కడపకు వచ్చి గ్రామాలకు నామాలు పెడుతూ కూర్చున్నాడు. (కడప జిల్లా గ్రామ నామాలు) ఇది ఎందుకు చెబుతున్నానంటే కెరీర్ పట్ల విశ్వం ఏనాడూ నిర్లక్ష్యం వహించలేదు.

అడపాదడపా నేను రారా గారింటికి వెళ్ళేవాణ్ని. అక్కన్నుంచి ఇద్దరం కలిసి ఎర్రముక్కపల్లెకు వెళ్ళేవాళ్ళం. లెక్చరర్ లు అంతా అక్కడే ఉండేవాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి పేకాటలో తలమునకలుగా ఉండేవాళ్ళు. రారా వచ్చి కూచున్నాడన్న స్పృహ కూడా వాళ్లకు ఉండేది కాదు. నేనూ రారా ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతూ కూర్చుంటే ఆ తర్వాత ఏ గంటకో, రెండు గంటలకో వచ్చి కలిసేవాళ్ళు. ఆ తర్వాత పొద్దుపోయేదాకా సాహిత్య చర్చలు.

చదవండి :  రచయితకు "స్పిరిచ్యువల్ శాటిస్పాక్షన్' అవసరం

ఎందుకోగానీ విశ్వం పట్ల రారా గారికి ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆయన చదివిన పుస్తకాలన్నీ ఎర్రముక్కపల్లెలో ఉన్న లెక్చరర్స్ అందరితో చదివించేవాడు. కథకు సంబందించిన మెలకువలన్నీ విశ్వం రారా దగ్గరే నేర్చుకున్నాడు.

రీసెర్చి వరకు అయిపోగానే విశ్వం చాలా స్పీడుగా కథలు రాయడం మొదలుపెట్టాడు. “జప్తు” కథాసంకలనం అచ్చు వేస్తూ దానికి ముందుమాట నన్ను రాయమన్నాడు. ముందుమాట రాయడానికి కావలసిన అర్హత నాకు ఉందని కాదు. మా స్నేహానికి చిహ్నంగా రాయమని కోరాడు. రాయక తప్పింది కాదు. విశ్వం మంచి స్నేహశీలి అని చెప్పడానికి ఈ నిదర్శనం చాలనుకుంటాను.

1975 తర్వాత నేను సాహిత్యానికీ, సాహితీ మిత్రులకూ దూరమయ్యాను. విశ్వంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. విశ్వం ఏం చేస్తున్నాడో , ఏం రాస్తున్నాడో కూడా నేను పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే నేను పూర్తిగా పక్క గాడీలో పడిపోయాను.

ఒకసారి నేను డా॥ మైసూరారెడ్డి (మాజీ హోం మినిష్టరు) గారి ఆఫీసుకు వెళ్తే, ఆయన ఏదో వారపత్రిక చదువుకుంటున్నాడు. ఆయన నన్ను చూచి “ఇందులో విశ్వం కథ ఉంది. ఇందులోని జయరాం పాత్ర నీదే ఉన్నట్లుంది చూడు” అంటూ పత్రిక ఇచ్చాడు. కథ పేరు “కూలిన బురుజు” చదివాను. అందులో జయరాం పాత్ర నాదేననిపించింది. ఈ మనిషికి నేను ఇకా జ్ఞాపకం ఉన్నాను కదా అని సంతోషించాను.

25 సంవత్సరాల పాటు మా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేవు.

కానీ విశ్వం నా వాడు! నా మిత్రుడు!! నా ఆత్మబంధువు!! “

 

ప్రముఖ కథా రచయితా,కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అయిన కేతు విశ్వనాథరెడ్డి గారి పదవీ విరమణ సందర్భంగా వెలువడిన అభినందన సంచికలో స్వర్గీయ సొదుం జయరాం గారు తమ స్నేహాన్ని గురించి రాసిన వ్యాసమిది. ఈ వ్యాసాన్ని గురించి తెలియచేసిన త్రివిక్రమ్ గారికి కడప.ఇన్ఫో తరపున ధన్యవాదాలు.

రచయిత గురించి

స్వర్గీయ సొదుం జయరాం గారు కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించారు.కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. పాడె, వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి వీరి ప్రసిద్ధ కథలు.  వీరి కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. వీరు రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి.  2004లో వీరి కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది. (సొదుం జయరాం కథలు: ప్రచురణ బండ్ల పబ్లికేషన్స్).

ఇదీ చదవండి!

సాహిత్య ప్రయోజనం

ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్‌ఎడిటర్‌ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: