
చింతకొమ్మదిన్నెలో ‘కత్తి’ సినిమా షూటింగ్
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటిస్తున్న ‘కత్తి’ సినిమా చిత్రీకరణ గురువారం చింతకొమ్మదిన్నెలో జరిగింది. స్థానిక అంగడివీధి సమీపంలోని తెలుగుగంగ కార్యాలయ ఆవరణలో షూటింగ్ నిర్వహించారు.
తెలుగుగంగ కార్యాలయం ముందు తమిళంలో కలెక్టరేట్ బోర్డుతో చిత్రీకరణ జరిపారు. పేదలు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు రావడం.. పోలీసులు వారితో చర్చించడం తదితర సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో హీరో విజయ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది.
రెండు రోజుల పాటు జరిగే ఈ షూటింగ్‌లో రెండో రోజున సమంత కూడా పాల్గొంటారని చిత్ర యూనిట్ ప్రతినిధులు తెలిపారు. మరికొన్ని సన్నివేశాలు కూడా ఇక్కడే చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మురుగదాసు దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రజలు, తెలుగుగంగ కార్యాలయం అధికారులు, సిబ్బంది కూడా షూటింగ్ చూసేందుకు ఆసక్తి ప్రదర్శించారు.
గతవారం జమ్మలమడుగు పరిసరాలలో షూటింగ్ చేసుకున్న కత్తి ఈ వారం కడప పరిసరాలలో షూటింగ్ జరుపుకుంటుండడం విశేషం. మొత్తానికి కడప జిల్లాలో సినిమా షూటింగ్ స్పాట్ లు ఉన్నాయనే విషయాన్ని తమిళ, కన్నడ సినిమా వాళ్ళు గుర్తించారు. మరి తెలుగు సినిమా వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తారో?