కడపకు 70 కంపెనీల కేంద్ర బలగాలు
హైదరాబాద్: కడప పార్లమెంట్, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ భారీస్థాయిలో కేంద్ర బలగాలను రంగంలోకి దించుతోంది. సుమారు 70 కంపెనీల పారా మిలటరీ బలగాలను వినియోగించనున్నారు.
ఆయా నియోజకవర్గాల పరిధిలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. దానికి అనుగుణంగా మొత్తం 127 కంపెనీల బలగాలు కావాలంటూ పోలీసుశాఖ ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించింది.
అయితే 70 కంపెనీల వరకు కేంద్ర బలగాలను పంపేందుకు ఆమోదం లభించింది. ఈ బలగాలను పోలింగ్‌కు రెండు వారాల ముందుగానే ఎన్నికలు జరిగే ప్రాంతాలకు తరలించేందుకు పోలీసుశాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక పోలీసులను కేవలం సాధారణ విధులకు మాత్రమే పరిమితంచేసి… ఎన్నికల భద్రత కోసం పూర్తిగా కేంద్ర బలగాలను వినియోగించనున్నారు.
హింసాత్మక ఘటనలకు పాల్పడితే కాల్పులే: డీజీపీ
ఉప ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా జరిగే విధంగా పటిష్ట భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ కె.అరవిందరావు తెలిపారు. ఎన్నికలను హింసాత్మకం చేసేందుకు ఎవరైనా బాంబులను ప్రయోగిస్తే ఉపేక్షించవద్దని, అవసరమైతే కాల్పులు జరపాల్సిందిగా ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు, ఘటనల ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపుతామని ఆయన తెలిపారు.