హిమధాముడు లేని రాత్రి హీనములు సుమతీ

పికము వనములోన విలసిల్ల పలికిన

భంగి ప్రాజ్ఞజనుల పలుకు గులుకు

కాకి కూత బోలు కర్మబద్ధుల కూత

విశ్వదాభిరామ వినురవేమ

బుద్ధిమంతుల మాటలు తోటలోని కోకిల స్వరంలాగ మనోహరంగా ఉంటాయి. కాని అల్ప బుద్ధుల మాటలు అట్లా కాదు. కాకి కూతల్లా కర్ణ కఠోరంగా ఉంటాయంటున్నాడు వేమన.

ప్రాజ్ఞుడు అంటే పండితుడు. అతడు కర్మదూరుడు. అంటే కర్మల్లో చిక్కుపడనివాడు. కోకిల లాగ మధురంగా మాట్లాడుతాడు. రెండోవాడు కర్మబద్ధుడు. కర్మలు కాయక, వాచక, మానసిక అని మూడు రకాలుగా ఉంటాయి. ‘విహిత కర్మలను’ అంటే విధించబడిన కర్మలను ఆచరించేవాడు బుద్ధిమంతుడు. ఇతడలా కాదు నిషేధ కర్మల్లో చిక్కుకుపోయినవాడు. కాబట్టి ఇతని వాక్యాలు శ్రుతి కఠినమే కాకుండా నిరాదరణకు కూడా గురి అవుతాయి.

రెండు రకాల వ్యక్తులను తీసుకొని వేమన కోకిల, కాకులతో పోలుస్తున్నాడు. కోకిల ఎక్కడో దూరంగా అడవిలో ఉన్నా, దాని పలుకు చెవులకు ఇంపుగా ఉండి ఆనందాన్ని కలిగిస్తుంది. కాకి మన ఇళ్లముందే తచ్చాడుతున్నా, దాని కూత శ్రుతి కర్కషంగా ఉండి ఇష్టమనిపించదు.

కోకిల, కాకి భిన్న స్వభావాలు కలిగిన పక్షులైనా వాటి మధ్య ఓ జీవన సంబంధముంది. కోకిలలు తాము పెట్టిన గుడ్లను కాకి గూటిలో వేస్తాయి. కాకులు వాటిని పొదిగి, వసంత కాలంలో తమ పిల్లకాకుల మధ్య కోకిలలుగా గుర్తించి వెళ్లగొడతాయి (వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః). ఇది లోక విశ్వాసం కాదు. శాస్ర్తీయమే. జంతుశాస్త్ర పరిభాషలో దీనిని గూడు పరాన్న జీవ పద్ధతి (Nest Parasitism) అంటారు. మరి కాకిని అశుభ పక్షిగా ఎందుకు భావిస్తారు? ఎందుకంటే ఇవి మానవ ఆవాసాలకు దగ్గరగా సంచరిస్తూ దేన్ని పడితేదాన్ని తింటాయి. పూతికాహార జీవులంటారు వీటిని.

చదవండి :  వేమన శృంగార పద్యాలు

విలసిల్లు అంటే ప్రకాశించడం, పలుకు అంటే మాటే అయినా కోకిల సందర్భంలో పాట. శ్రావ్యమైనది అని. కులుకు అంటే మనోహరమైన అని అన్నప్పటికీ ఇక్కడ క్రియగా వెదజల్లు, చిలుకు అని అర్థాలు. కోకిలది పలుకు, కాకిది కూత. ఈ మాటలను వేమన్న ఎంతో జాగ్రత్తగా వాడాడు. ‘‘పికము వనములోన ప్రీతి బలికిన భంగి (డి.1723-656); పికము పూవనమున వికసిల్లి పలికిన, చొప్పు జ్ఞాని పలుకు సొంపు గలును (డి.1723-760)’’ అనేవి పాఠాంతరాలు.

 

నోటి పుప్పికెల్ల నొప్పి లేకుండగా

ఆకు పోక సున్న మౌషధంబు

పెట్టకుండె నేని పెనురోత వేయురా

విశ్వదాభిరామ వినురవేమ

 

నోటిలోని పన్ను పురుగు పట్టి పుచ్చిపోయిందా? నొప్పి ఎక్కువయ్యిందా? మరేం పరవాలేదు. తాంబూలం వేసుకో. అదే సరైన మందు. అలా కానట్టయితే, అసహ్యంగా తయారై, మరింత ఇబ్బందికి దారితీస్తుంది అంటున్నాడు వేమన.

చదవండి :  వేమన వెలుగులు

అనవసరమైన జర్దాలాంటి పదార్థాలు కలిసి తాంబూలం ఇప్పుడు వ్యసనమయ్యింది గాని, ఒకప్పుడు ఆరోగ్యానికి పనికొచ్చేదే. అంతెందుకు? తమలపాకుతో కట్టిన విడెం నోటి అనారోగ్యాన్ని సరిచేస్తుందని, దాని ఔషధ గుణాన్ని చెప్తున్నాడు వేమన. తాంబూలంలో ఏయే పదార్థాలు వాడుతారు? ఒకటి ఆకు. అంటే తమలపాకు. నాగవల్లి అనే తీగకు ఇవి వేస్తాయి. పాశ్చాత్యుడైన బ్రౌన్‌కు ఇది ఎలా కనపడిందంటే, ‘The fragrant spicy leaf eaten by the Hindus’ అన్నాడు.

హిందువులే ఏమిటి ముసల్‌మానులు కూడా తింటారు. బ్రౌన్ దృష్టికి వచ్చినట్టు లేదు. పోక అంటే వక్క, గింజ విశేషం. పోకంత అన్నం అంటే కొంచెమని అర్థం. ఇక సున్నం. సున్నం సున్నమే. సుధ. ‘‘సౌధ సుధా ధవళిత’’ అన్నాడు అల్లసాని పెద్దన. మరి ఆ రోజుల్లో తాంబూలంలోకి ఏం సున్నం వాడేవారో? గవ్వ సున్నం అంటే గోడలకు వేసేది. ప్రవాళ భస్మం కూడా సున్నమే. పగడాన్ని భస్మం చేస్తే ఏర్పడేది. విడెంలో ఈ మూడు పదార్థాలకూ ఔషధ గుణముంది కాబట్టి పంటి వ్యాధులకు తాంబూలం బాగా పనిచేస్తుందంటున్నాడు వేమన.

పుప్పి అంటే పుప్పి పురుగు. నుసి పురుగు అని కూడా అంటారు. కట్టెను తొలిచి నుసి రాల్చే పురుగు అన్నమాట. ఈ పురుగు వల్ల పళ్లు పుచ్చిపోయి చెడిపోతాయి. నొప్పి-పంటినొప్పి ఎంత దుర్భరమో అందరికీ తెలిసిందే. ‘‘నోటి బాధకు ఏవో పిచ్చి మందులు వాడి ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు, మన సంప్రదాయంలో తాంబూలముంది కదా! అదే మంచి దేశీయ వైద్యం’’ అని వేమన్న సూచన.

చదవండి :  కాలచక్ర మెరుగగాలేక ఎప్పుడు సంధ్య జపము సేయు జాణలార!

తాంబూలాన్ని ఆరోగ్యానికే కాక రసికతకు కూడా చిహ్నంగా భావించేవారు. మంచి కవిత్వ రచనకు ‘‘కప్పుర విడెం’’ కూడా కావాలన్నాడు పెద్దన (విడెమే సంస్కృతంలో వీటీ వీటిక). సుమతి కారుడు తాంబూలానికి ఎంత పెద్ద స్థానాన్నిచ్చాడో చూడండి.

 

‘‘తమలము వేయని నోరును

రమణుల చను మొనల మీద రాయని మేనున్

కమలములు లేని కొలకును

హిమధాముడు లేని రాత్రి హీనములు సుమతీ’’.

 

ఏవో నీతి పద్యాలు చెప్పాడనుకున్నాం గానీ సుమతి కారుడు కూడా రసికుడే.

తాంబూలానికి శుభకార్యాల్లో ఉన్న ప్రమేయం కూడా ముఖ్యమైందే. తాంబూలాలిచ్చారు అంటే పెళ్లికి నిశ్చితార్థం చేసుకున్నారని. ‘తాంబూలాలిచ్చాను తన్నుకు చావండి’ అన్నాడు అగ్నిహోత్రావధాన్లు కన్యాశుల్కంలో.

‘పిదప లేకయున్న పెనురోత వేయురా (డి.1726-144)’ అనేది పాఠాంతరం.

డా॥ఎన్.గోపి

(సాక్షి తెలుగు దినపత్రిక)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: