
‘సీమకు అన్యాయం చేస్తున్నారు’ – వైద్యులు
దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న రాయసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. సీమను అభివృద్ధి చేసుకునే సమయం వచ్చిందనీ ఇప్పటికైనా సీమ ప్రజల గళమెత్తితేనే న్యాయం జరుగుతుందని రాయలసీమ సంఘర్షణ సమితి నిర్వహకులు డాక్టరు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రొద్దుటూరులోని ఐఎంఏ హాలులో గురువారం సాయంత్రం రాయలసీమ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో భవిషత్తు కార్యాచరణపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత నాయకులు తొలుత రాజధాని, పరిపాలన విభాగాలను ఒకచోట ఏర్పాటు చేసి రాష్ట్రం అంతటా అభివృద్ధి చేస్తామన్నారు. తర్వాత రాజధానిని మౌలికవనరులు, ఉపాధి కేంద్రంగా మారుస్తామని చెప్పారు. ఇప్పుడేమో విజయవాడను రాజధానిగా మారుస్తామని చెప్పి దాన్ని సకల హంగులతో అభివృద్ధి చేస్తామని ప్రణాళికలు రచిస్తున్నారు.
సీమ అభివృద్ధి పట్టించుకోకుండా అన్యాయానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సీమ ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమని చెప్పారు. అభివృద్ధి అంటూ జరిగితే ఈ పదేళ్లలోనే జరగాలన్నారు. లేకుంటే సీమ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఈనెల 22న అనంతపురంలోని ఎస్‌కే యూనివర్శిటీ ప్రాంగణంలో జరిగే సమావేశంలో భవిషత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. డాక్టరు నాగదస్తగిరిరెడ్డి మాట్లాడుతూ సీమకు కావాల్సిన నీటి కేటాయింపుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో వైద్యులు పద్మలత, శివరాం, ప్రభాకర్‌రెడ్డి, నాగిరెడ్డి, నాగార్జున, న్యాయవాదులు సత్యనారాయణ, సుధాకర్‌రెడ్డి, ముడిమెల కొండారెడ్డి, లక్ష్మీప్రసన్న, కోనేటి సునంద, ఎన్‌జీవో నాయకుడు వెంకటేశ్వరరెడ్డి, విద్యార్థి సంఘ నాయకుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.