
మంత్రి దిష్టిబొమ్మను కాలుస్తున్న విద్యార్థులు
ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
కడప: పేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతిగృహాల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్ అన్నారు. మూసివేత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని.. లేదంటే మంత్రి రావెల కిశోర్‌బాబు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
మంగళవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ విగ్రహం నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ మంత్రి రావెల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా గంగాసురేష్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా, విద్య, ఉద్యోగ రంగాలలో వెనుకబడిన వారిని ముందుకుతీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సంక్షేమ హాస్టళ్లను మూసివేయడం దారుణమన్నారు.
తెదేపా ప్రభుత్వం పేద, దళిత విద్యార్థులను గాలికొదిలేసి ఉన్నత వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోందని విమర్శించారు. 600 మంది విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాలల్లో వసతిగృహ విద్యార్థులను ఎలా చేర్పిస్తారని ప్రశ్నించారు.