
గడికోట శ్రీకాంత్ రెడ్డి – రాయచోటి
ఔను..వీళ్ళు కూడా అంతే!
కడప జిల్లా అంటే అదేదో వినకూడని పేరైనట్లు ప్రభుత్వ పెద్దలు చిన్నచూపు చూస్తుంటే తాజాగా రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తానేమీ తక్కువ తినలేదని నిరూపించింది.రాయలసీమలోని మూడు జిల్లాలను పరిశీలించిన సదరు కమిటీ సభ్యులు ఒక్క కడప జిల్లాను మాత్రం విస్మరించారు. ఎంచేత?
ప్రభుత్వ పెద్దలూ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులూ అంతా కమిటీతో సంబంధం లేకుండా తమ సామాజికవర్గం, ధనికుల ప్రాబల్యం అధికంగా ఉండే గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ కమిటీ ఇప్పటికే వీరిని కలిసింది. ఆ తర్వాత రాయలసీమలో పర్యటించాల్సి ఉన్నా తాత్సారం చేసింది. ఇంతలో సీమలో రాజధాని కోసం నిరసనలు గట్రా మొదలవడంతో కమిటీ హడావుడిగా మూడు జిల్లాలు తిరిగి పర్యటన ముగించింది. అయినా రాయలసీమకు అనుకూలంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుందా? ఒకవేళ కమిటీ అటువంటి ప్రతిపాదన చేసినా అది శ్రీకృష్ణ కమిటీ నివేదికలాగా మారే అవకాశం లేకపోలేదు.
ఈపొద్దు కడపలో విలేఖర్లతో మాట్లాడిన వైకాపా శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ కడప జిల్లాను పరిగణలోకి తీసుకోకుండా చిన్నచూపు చూసిందని ఆరోపించారు. రాయసీమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోద్యయోగ్యమైన ప్రాంతాన్నే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంతా జరుగుతున్నా మన జిల్లాకు చెందిన మిగతా రాజకీయ నాయకులు మూతులు బిగదీసుకొని కూర్చునే ఉన్నారు – విద్యార్థులు, మేధావులు రోడ్దేక్కినా కూడా! ఇది మన దురదృష్టం కాక మరేమిటి?