వైసివి రెడ్డి (ఎమ్మనూరు చినవెంకటరెడ్డి)

అప్పుదెచ్చి కవులకిచ్చును,
తప్పక ఋణదాతకిచ్చు తానేమగునో

– ఉప్పలపాటి వెంకట నరసయ్య

భావకవితోద్యమ స్రవంతి వొరిగి పొరిలేవేళ రాయలసీమలో ”తొలకరి చినుకులు” కురిపించి, సెలయేరై విజృంభించి సంగమింప చేసిన అభ్యుదయ కవితావేశ మూర్తి వైసివిరెడ్డి.

వైసివి రెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి – కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు. తండ్రి కొండారెడ్డి పెద్దరైతు. పిల్లలను వేకువనేలేపి అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం వల్లెవేయించి భారత, భాగవతాల్లోని పద్యాలు వినిపించేవారు. గ్రామంలో బడిలేదు. ఆ కాలంలో భట్రాజకవులు, గ్రామాల్లో పిల్లలకు చదువునేర్పేవారు.

YCV Reddy

కొండారెడ్డి, కొడవలూరు రామచంద్రరాజు అన్న పండిత కవికి, తన ఇంట్లోనే వసతి కల్పించి, తన బిడ్డలకే కాక, పల్లెలోని రైతు పిల్లలకు కూడా చదువు చెప్పించే ఏర్పాటు చేశారు. రామచంద్రరాజు గొప్ప పండితుడే కాక, ‘మహాసేనోదయము’ అన్న కావ్యకర్తగా పండితుల మన్ననలందుకున్నవారు. ఆ కావ్యం ఆ కవికి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టింది.

మూడునాలుగు దశాబ్దాల క్రితం వరకు రాయలసీమలో, గ్రామప్రజలు సాయంకాలం దేవాలయంలో సమావేశమై భారత, భాగవతము లను చదివించుకొనేవారు. వారి సాహిత్య పిపాస ఆశ్చర్యం కలిగించేది.

వైసివికి ఇంగ్లీష్‌ చదువుకోవాలన్న ఆశ వుండటంతో, బోనాల గ్రామస్తుడైన చిప్పల పెద్ద రామన్న సహాయంతో గుత్తిచేరారు. వీరయ్య చక్రాల నరసింహయ్య, జయదేవశర్మ వంటి పండితుల నాశ్రయించి తెలుగు కావ్యాలు చదువుకున్నారు. ప్రైవేటుగా మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాసి, ఒకసారి పరీక్ష తప్పారు. మద్రాసులోని ఒక ట్యుటోరియల్‌ కాలేజీలో చేరి మెట్రిక్‌ పరీక్ష పాసైనారు.

పై చదువులకు ఆర్థిక ఇబ్బందులుండేవి. 1947 జూన్‌ 15న ఎరమలపల్లె ఆదినారాయణరెడ్డి కూతురు చెన్నమ్మతో వివాహం జరిగింది. ఆస్తి పంపకాలు జరిగాయి. గత్యంతరం లేక 1949 అక్టోబరులో కడప జిల్లా బోర్డులో గమస్తాగా చేరారు.

చదవండి :  ఎంజె సుబ్బరామిరెడ్డి - మహా మొండిమనిషి

గుత్తిలో వున్నపుడే చక్రాల నరసింహశాస్త్రి ప్రోత్సాహంతో పద్యాలు రాసేవారు. అవధానాల్లో పృచ్ఛకుడుగా వుండేవారు. ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.
కడపలో ఉద్యోగం చేస్తూ మహాకవులు, గడియారం, పుట్టపర్తి, రాజశేఖర శతావధానిగార్ల పరిచయం పెంచుకున్నారు.

ఉద్యోగ రీత్యా కోడూరు (కడపజిల్లా) బదిలీ అయ్యారు. అక్కడ వేదం వేంకటకృష్ణశర్మ, నాగనార్యగార్ల సాహచర్యంతో ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం రాశారు. ఆ ఖండకావ్యంలోని వలపు జవ్వనికి ముద్దు చెల్లింప సాంధ్యరాగ మవిరళంబుగ బంగారు రవికెయయ్యె” అన్న పంక్తులు చదివి, ఆ సంపుటికి తొలి పలుకులు రాస్తూ ”ఈ కవిలో తీవ్రమగు భావనాబలమున్నది. ఆ భావమును వెల్లడింపగల సునిశితమైన వణకాడని వాక్కున్నదని” అభినందించారు, సరస్వతీ పుత్ర పుట్టపర్తి.

పల్లెల్లోని ‘బడిపంతులను’ చూపిన తీరు చూడండి:

”మట్టిగోడల కొట్టము నట్టనడుమ
కరకు కంకర నేలపై కలము బట్టి
వ్రాత బల్లలపై నీదు బ్రతుకు
సేయెదె రక్తదానము రేయిబవలు”

వైసివి ప్రబంధనాయిక, ”మేనక ” గురించిన చిన్న కావ్యాన్ని రచించి, డా||కట్టమంచి రామలింగారెడ్డికి అంకితమిచ్చారు.

‘రంభ’ అన్న కృతిని, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవకు అంకితం కావించారు.

వైసివి అభ్యుదయవాది. తనలో పెల్లుబికిన భావాలను గేయరూపంలో ప్రకటిస్తూ..

అమరవీరుల త్యాగమాశలకు నెగబ్రాక
ప్రగతిశీలురభావబంభరమునదియింపు
నరజాతిలో క్రాంతి నవనవోన్మేషమై
అలసముగ దక్షిణానిలము మాగడ్డపై
వీచెనమ్మాయిపుడె||

కొన్నియేండ్లు రైతు జీవితంలోని కష్టనష్టాలను, గమనించిన వైసివి రైతుల దీనగాథను రాసి ”అన్నార్తుడై, ఆపదలలోవున్న” గాసగానికి అంకితం కావించారు. ఇది కొత్త సంప్రదాయమేకాక, ప్రకృతి యొడిలో పుట్టిపెరుగు, పల్లీయుల బ్రతుకు తీవ్రతను, కవితావస్తువుగా ఎన్నుకున్నారు వైసివి. ఆ రీతిగా పాతకొత్తల స్వర్ణవారధి అయినారు. కర్షక వాజ్ఞయానికి రాయలసీమలెలా బాటలు వేసినవారు మన వైసివి.

చదవండి :  పోతన మనుమలు స్తుతించిన 'వరకవి సార్వభౌముడు'

శ్రమశక్తిని దోచుకుని గాదెల నింపుకొను భూస్వాములు, కాలగమనానికనుగుణంగా మారకపోవటాన్ని ఎత్తిచూపారు.

వైసివి రచించిన ”రాయబారము” కృతికి ముందు మాట రాస్తూ ”గంజుకుండా చెట్లడ్డా, గోసనగా, పై వరంబడా, అంపసన్న, కుంటెనా, గుద్దలి, ఉగ్గపట్టె, మున్నగు పదాలకు శబ్దగౌరవం కల్పించారు. వాని బాధ, ఎంత హృదయ విదారకమో చూడండి అని ప్రశంసించారు సొదుం గోవిందరెడ్డి.

తమము మ్రింగి తరిపి వెన్నె
లంతా – తానై యుమిసెను
వాడే యీనాడు చివిక
వాసాలకు దాసుడుగా
వాలినాడు, వణకినాడు
వాని శీర్ణదేహాంతర
వాటిలోన కాటిలోన
అంతా బూడిద గాదా
ఐనా మీ బోటివారి
కన్నార్తులపైన కరుణ
ఆవంతయు లేక పోగా
అభిమానము కూడా లేదు
వానికోసమేమైనా
పాటుపడెదవేమోనని
ఆ మాటే చెబుదామని
నీకెందుకు చెప్పాలని
చెప్పలేక చెబుతున్నా

”గాసగాడు చీకటిని మ్రింగి వెన్నెలను ఉమిసెనట!” అద్భుతమీ చిత్రణ.

వైసివి కర్మయోగి. 1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు.

వైసివి కడపజిల్లా కమ్యూనిస్టు నాయకులు ఈశ్వరరెడ్డి, శివరామరెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డిగార్ల కత్యంత సన్నిహితులు.

వైసివి కథలన్నీ – (ౖ21) 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడింది.

సాహిత్య గోష్టులంటె రెక్కలు కట్టుకొని వాలేవాడు. వినయశీలి. అప్పుచేసి కవులను సత్కరించే సాహిత్య పిపాసి వైసివి. ఇవన్నీ చెప్పటం అవసరం. ఎందుకంటే వైసివి నాకు సన్నిహితుడు. వారానికి రెండు మూడు మార్లైనా ఇంటికి వచ్చి తన రచనలను వినిపించేవారు.’ మా సీమ కవులు’ స్వీయరచనలో ఇతని గురించి రాశాను.

చదవండి :  మా వూరి చెట్లు మతికొస్తానాయి

ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన స్వేచ్ఛాజీవి. నిరాడంబరుడు. నిగర్వి.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి పలు సత్కారాలందుకున్నారు. 1964లో సంగమేశ్వర దేవాలయంలో శ్రీమాన్‌ పుట్టపర్తి వారి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో నర్రెడ్డి శంభురెడ్డి వైసివి రెడ్డిని స్వర్ణకంకణంతో సత్కరించారు.

వైసివి పట్ల ఎంతో ఆదరణ గల పుట్టపర్తి వైసివికి నివాళులర్పిస్తూ..

”అనగా ! చల్లని కైతవాడ! ఒక నాడైనన్‌
మదీయోపకారనిరీక్షామతినుంటివో, సతమునా వ్రాతల్‌
ప్రశంసించుట
పని మాధ్వీక రసాను మేయమతి,
ఓ వైసివీ రెడ్డి భవ
జ్జని నా మేలుకయ్యె, నిన్ను మరువన్‌.
జాలన్‌ దివారాత్రముల్‌”

అన్నారు.

రచయిత గురించి

జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత. కడపలోని సిపి బ్రౌన్ గ్రందాలయ అభివృద్దికి వీరు విశేష కృషి చేశారు. వీరు వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాశారు. 16 గ్రంథాలు వెలువరించారు. వీరు గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు, అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు, ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు, కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు, మదనపల్లి భరతముని కళారత్న అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం, బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు.

ఒక వ్యాఖ్య

  1. రెడ్డి గారి సాఃహిత్య జీవితం మీద జానమద్దివారు వీలయినంత విపులముగా ఆసక్తి రేకెత్తించే విధంగా రాశారు. వ్యాసం నాకు బాగా నచ్చింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: