సోమవారం , 23 డిసెంబర్ 2024

వైకాపా చతికిలపడిందా?

నిన్ననే రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నిన్న రాత్రి పొద్దు పోయే వరకు పాత్రికేయ మిత్రులు ఎన్నికల ఫలితాలను సేకరించి పార్టీల వారి మద్దతుదారులను లెక్కించే పనిలో ఉండగా, సంపాదకులు, బ్యూరో చీఫ్ లు క్షేత్ర స్థాయి నుండి అందిన సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి బ్యానర్ కథనాన్ని తయారు చేశారు. ఇవాళ ఉదయం ఆయా పత్రికలలో వెలువడిన కథనాలు చెప్పింది ఒక్కటే .. ‘వైకాపా హవా తగ్గిందీ’ అని. నేరుగా కాకపోయినా సాక్షి దినపత్రిక సైతం ఇదే విషయాన్ని చెప్పినట్లుగా ఉంది వారి కథనం.

ఇదే విషయాన్ని పలువురు మిత్రులు సైతం నాతో చెప్పారు ఇవాళ. ఈ ఎన్నికల ఫలితాలు నిజంగానే వైకాపా తగ్గుముఖాన్ని సూచిస్తున్నాయా? అని నన్ను అడిగితే… కానే కాదు అని చెప్పటానికి నేనేమాత్రం సంకోచించను. నిజం చెప్పాలంటే తెదేపా, కాంగ్రెస్ ల కన్నా వైకాపా మెరుగైన ఫలితాలను సాధించింది, రాష్ట్రవ్యాప్తంగా … అని నేనంటాను. కానీ చాలా మందికి ఇది పసలేని వాదనగా లేదా అర్థ రహితమైనదిగా అనిపించవచ్చు. అలా అనిపించడం వింతేమీ కాదు. అది అలాగే అనిపిస్తుంది కూడా!

కాంగ్రెస్ ది వందేళ్ళ చరిత్ర. తెదేపాది ముప్పయ్యేల్ల చరిత్ర. మరి వైకాపాది? కేవలం రెండేళ్ళ చరిత్ర.

చదవండి :  తెదేపా వ్యూహాలకు బ్రేకులు పడ్డట్లే!

ఇప్పుడు ఆయా పార్టీల అధినేతల గురించి చూద్దాం. కాంగ్రెస్ హైకమాండ్ లోని మహామహులుగా చెప్పబడుతున్న వారంతా 60 పైబడిన వారే. ఇక రాష్ట్రం విషయానికొస్తే ఇక్కడ ముఖ్యమంత్రిగా వ్యవహరింపబడుతున్న నల్లారి కిరణ్కుమార్ రెడ్డి లేదా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న వారంతా సుమారు 25  లేదా 30 సంవత్సరాల రాజకీయానుభవం కలిగిన వారే.

తెదేపా గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి సారధ్యం వహిస్తున్న చంద్రబాబు ఘనత ఇప్పటికే ఆయా ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ తెలుసుంటుంది. తెలియని వారి కోసం… చంద్రబాబు రాజకీయానుభవం తెదేపా పార్టీ వయసు కంటే ఎక్కువే. ఎందుకంటే తెదేపా ఆవిర్భవించక మునుపే ఆయన ఈ రాష్ట్రానికి మంత్రిగిరీ చేశారు – కాంగ్రెస్ లో ఉంటూ. 1984 తరువాతి పరిణామాలలో తెదేపాలో చేరి 1994 నాటికి మామనే తలదన్నే వ్యూహాలతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి దేశ రాజకీయాలలో సైతం చక్రం తిప్పారు. సుమారు పదేళ్ళ పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగిరీ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే …  చంద్రబాబు అనుచరగణం అన్నట్లు ఆయన ‘రాజకీయాలలో అపర చాణక్యుడు’. తన వ్యూహ నిపుణతతో ఎంతటి వారినైనా దారిలోకి తెచ్చుకోగలిగిన నేర్పరి.

చదవండి :  సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి

ఇక వైకాపా సంగతి చూద్దాం. ఆ పార్టీకి సారధ్యం వహిస్తున్నది జగన్ అనే యువకుడు. జగన్ కి ఉన్న రాజకీయానుభవం మహా అయితే నాలుగేళ్ళు. ఆయన 2009 లో కడప పార్లమెంటు నియోజకవర్గం నుండి మొదటి సారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఒక పార్టీ అధినేతగా ఆయన అనుభవం మహా అయితే ఆర్నెల్లు. ఎందుకంటే ఆయన గత 14 నెలలుగా జైలు గోడలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పార్టీకి అధ్యక్షురాలిగా సేవలందిస్తున్న విజయమ్మరాజకీయానుభవం మహా అంటే రెండేళ్లు.

ఏ రకంగా చూసినా వైకాపా కానీ, ఆ పార్టీకి సారధ్యం వహిస్తున్న వారు కానీ కాకలు తీరిన అధికార కాంగ్రెస్ కు లేదా రాష్ట్రంలో తిరుగులేని ప్రతిపక్షంగా వెలుగొందుతున్న తెదేపాకు కానీ సరితూగకూడదు. కానీ రెండు విడతల పంచాయితీ ఎన్నికలు ముగిసే సరికి మొత్తం మూడు వేల పంచాయతీలలో ఆ పార్టీ మద్దతుదారులు గెలుపొందడం ఆషామాషీ ఏమీ కాదు – అదీ ఆ పార్టీ అధినేత 14 నెలలుగా ప్రజలను పలుకరించే పరిస్థితికి కూడా నోచుకోలేకపోయిన సందర్భంలో. నిజం చెప్పాలంటే రెండేళ్లలో గ్రామస్థాయిలో క్యాడర్ ను తీర్చిదిద్దాలనుకుంటే ఏ పార్టీకైనా కష్టమే. అది అధికారంలో లేని వాళ్లకు మరీ కష్టం. ఒకవేళ జగన్ బయటే ఉండుండి ఎన్నికల కోసం వ్యూహ రచన చేసి పార్టీ శ్రేణులను సమాయత్త పరచుకొని ప్రచారం చేసుంటే?

చదవండి :  పువ్వు పార్టీలో చేరిన ఆదినారాయణ

ఒకవేళ ప్రతిపక్ష తెదేపా లేక అధికార కాంగ్రెస్ లు కొన్ని.. మహా అయితే వందల తేడాతో వైకాపా కన్నా ఎక్కువ మంది మద్దతుదారులను గెలిపించుకొని ఉండవచ్చు. అంతమాత్రాన ఇదే రకమైన పరిస్థితి రాబోయే మునిసిపల్ లేదా అసెంబ్లీ ఎన్నికలలో వచ్చి అధికార పీఠాన్ని చేజిక్కిన్చుకోగలమనుకుంటే పొరపాటే.

గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నో సమీకరణలు స్థానికంగా పని చేస్తాయి – అది కూడా పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు. బంధుత్వాలు, గ్రామంలోని వర్గ వైషమ్యాలు, కులాలు, స్థానిక సమస్యలు మొదలైనవి. ఇన్ని సమీకరణాల మధ్య అధికార కాంగ్రెస్ ఆటలో చిక్కుకుని జైలు నుండి బయటకు రాలేక అధినేత సతమతమవుతున్న సందర్భంలో .. వైకాపా మద్దతుదారులు ఇన్ని పంచాయితీలను గెల్చుకోవడం ఒక గొప్ప విజయమే!

చంద్రబాబు లేదా బొత్స వంటి నాయకులు వైకాపాను కొన్ని జిల్లాలకే పరిమితమైన పార్టీ – మేమే ముందున్నాం అంటూ  మీడియా ముందు డాబులు పోయినా వాస్తవాన్ని మరుగు పరచడం సాధ్యం కాకపోవచ్చు!!

ఇదీ చదవండి!

go34

సూక్ష్మ సేద్య రాయితీలలోనూ కడప, కర్నూలులపై ప్రభుత్వ వివక్ష

సూక్ష్మ సేద్య పరికరాల (స్ప్రింక్లర్లు, బిందు సేద్య పరికరాలు మొదలైనవి) కొనుగోలు సబ్సిడీ విషయంలోనూ కడప, కర్నూలు జిల్లాలపై తెదేపా ప్రభుత్వం …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: