రచ్చబండ గురించి సెప్టెంబర్ 1న ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి భాస్కరశర్మలతో మాట్లాడుతున్న వైఎస్
రచ్చబండ గురించి సెప్టెంబర్ 1న ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి భాస్కరశర్మలతో మాట్లాడుతున్న వైఎస్

వైఎస్ అంతిమ క్షణాలు…

రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు ముందు పల్లెబాట, నగరబాట, రైతు చైతన్యయాత్ర, పొలం బడి, రైతు సదస్సులు వంటివి నిర్వహించారు. రెండోసారి పదవిని చేపట్టిన తరు వాత ప్రజలతో ముఖాముఖీ సమావేశమై ప్రభుత్వ పథకాల గురించీ, అవి ప్రజలకు చేరుతున్న తీరు గురించీ, వాటితో చేకూరిన లబ్ధిని గురించీ, మంచిచెడుల గురించీ మాట్లాడాలని అనుకున్నారు. అలాగే భూపంపిణీ, ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్, విద్యార్థి వేతనాలు, పింఛన్లు, రేషన్‌కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలు అమల వుతున్న తీరు గురించి కూడా ప్రజల నుంచే నేరుగా స్పందన తెలుసు కోవాలని ఆశించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ హఠాత్తుగా ఓ గ్రామానికి వెళ్లి, ఏ చెట్టు కిందనో, మరో కూడలిలోనో ‘రచ్చబండ’ పేరుతో కార్య క్రమం నిర్వహించాలని ఆకాంక్షించారు.

భద్రతాదళాల మోహరింపు, హెలీపాడ్ నిర్మాణం వంటి కనీస ఏర్పా ట్లు పూర్తి చేయడానికి ప్రతి జిల్లాలోను ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆయన సూచించారు. రోజుకు మూడు రచ్చబండ కార్యక్రమాలు నిర్వ హించాలని నిర్ణయించారు. మొదటి రోజు కోసం, అంటే సెప్టెంబర్ 2, 2009 నాటి కార్యక్రమానికి చిత్తూరు జిల్లా చిత్తూరు, నెల్లూరు జిల్లా ఉద యగిరి, ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గాలను వైఎస్ సూచించారు.

మండల, గ్రామ స్థాయిలలో ఉన్న కుటుంబాల వివరాలు, జనాభా, రహదారుల అనుసంధానత వంటి అంశాలతో పాటు; పాఠశాలలు, ఆస్ప త్రులు, బ్యాంకులు, బస్ సౌకర్యం, విద్యుత్ సరఫరా, సాగునీటి వసతి వంటి వివరాలు కూడా సేకరించి తన పరిశీలనకు సిద్ధంగా ఉంచవలసిం దని వైఎస్ నాకు సలహా ఇచ్చారు.

సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి స్వర్గీయ డాక్టర్ సుబ్రహ్మణ్యం (ఐయ్యేఎస్) గారికీ, నాకూ డాక్టర్ వైఎస్ నుంచి మళ్లీ సూచనలు అందాయి (ఫొటోలో చూడొచ్చు). పర్యటనకు సంబంధించిన సమాచారం తీసుకుని, మామూలుగా పంపే ఫైళ్లతోనే తన నివాసానికి పంపించవలసిందిగా వైఎస్ సూచించారు. ఆ మేరకు ఆ రోజు రాత్రి 8.30 గం.లకి అంతా సిద్ధం చేసి పంపాను.

చదవండి :  కడప లోక్‌సభ ఏడుసార్లు వైఎస్ కుటుంబ హస్తగతం

సెప్టెంబర్ 2.. వేకువ 4.35కే ముఖ్యమంత్రి నుంచి నాకు కాల్ వచ్చింది. అప్పటికే చేతిలో పెన్నూ కాగితంతో సిద్ధంగా ఉన్నాను. ‘శర్మా! చిత్తూరు రూరల్ మండలంలోని అనుపల్లి, (2) నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గం వరికుంటపాడు మండలం నర్రవాడ, (3) ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామా లకు వెళతాను’ అన్నారు. దీనినే సంబంధిత అధికారులకు నేను తెలియ చేశాను. మళ్లీ 4.50 లకి సూరీడు ఫోన్ చేసి, ‘సార్ మాట్లాడాలంటున్నారు’ అన్నాడు. ‘శర్మా! మనం ప్రత్యామ్నాయ గ్రామాన్ని కూడా సూచిద్దాం అంటూ ఆ జిల్లాలోనే, అవే మండలాలకు చెందిన మూడు గ్రామాలు 1. దిగువమాసపల్లి, 2.బోడువారిపల్లి, 3. బింగినపల్లి పేర్లు చెప్పారు. నేను రాసుకుని, వారికి సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాను.

5.40లకి మళ్లీ ఫోన్ చేసి మనం ఏ హెలికాప్టర్‌లో వెళుతున్నాం. కూడా వచ్చే మంత్రులు ఎవరు? రవిచంద్ (అప్పటి ప్రజాసంబంధాల అధికారి) వస్తున్నారా? సీఎస్‌ఓ ఎవరు? వంటి వాటి గురించి అడిగారు. హెలికాప్టర్ గురించి ఆగస్ట్1నే నేను కెప్టెన్ భాటియాతో మాట్లాడాను. అగస్టా 129 హెలి కాప్టర్ కచ్చితంగా సర్వీసుకు వెళ్లవలసి ఉన్నందున బెల్-430 హెలికాప్టర్‌లో వెళ్లాలని, రెండు గంటల పది నిముషాల ప్రయా ణం ఉంటుంది కాబట్టి ఆయిల్ ట్యాంక్‌ను నింపుకుని వెళ్లాల్సి ఉంటుం దని, ముగ్గురికి మించి లోపల చోటు ఉండదని ఆయన చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి, సీఎస్‌ఓ, ప్రిన్సిపల్ కార్యదర్శి మాత్రమే వెళ్లగలరు. అందుకే మంత్రులు గల్లా అరుణకుమారి, పీలేరు రామచంద్రారెడ్డి, స్పీకర్ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిగార్లను ఉదయం బయలుదేరే కమర్షియల్ విమానానికి వెళ్లవలసిందిగా కోరాను. వారు అలాగే వెళ్లారు. అనివార్య కారణాల వల్ల రవిచంద్ వెళ్లలేనని చెప్పారు.

చదవండి :  నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక

ఇక సీఎం కార్యాలయానికి 7 గంటలకి చేరుకోవాలని అనుకుంటూ ఉండగా 6.20లకి మళ్లీ సీఎంగారి ఫోన్. 7.20 బదులు, అరగంట ఆలస్యంగా 7.50లకి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరదలచినట్టు చెప్పారు. 7.45లకు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాను. సార్ సరిగ్గా 7.50లకి బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. కాన్వాయ్ బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరింది. అక్కడే వేచి ఉన్న సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి జన్నత్ హుసేస్, కార్యదర్శి ప్రభాకరరెడ్డి, అదనపు పోలీస్ డెరైక్టర్ జనరల్ (ఇంటెలి జెన్స్) అరవిందరావుగార్లు అనుసరించారు.

విమానాశ్రయ లాంజ్‌లో అరవిందరావు ముఖ్యమంత్రితో మాట్లా డారు. జన్నత్ హుసేన్, ప్రభాకరరెడ్డి కొన్ని ఫైళ్లకు ఆమోదం తీసుకు న్నారు. 8.20కి లాంజ్ నుంచి బయటకు వస్తూ కారిడార్‌లో అడిగారు, ‘శర్మా! సెప్టెంబర్ 12, 13 తేదీలలో కలుసుకోవడానికి సోనియా గాంధీ గారి అప్పాయింట్‌మెంట్ తీసుకోమని చెప్పాను. ఏమైంది?’ అన్నారు. పిళ్లైకి చెప్పి ఏర్పాటు చేయమని కోరానని తెలియచేశాను. ప్రధాని తిరుపతి పర్యటన గురించి అడిగారు. రచ్చబండ ఉద్దేశాలు అడగడానికి బయట వేచి ఉన్న ఓ టీవీ చానల్ బృందంతో మూడు నిముషాలు మాట్లా డారు. తరువాత కారులో వెళ్లి, 8.25లకి హెలికాప్టర్‌లో కూర్చున్నారు. రోటర్ కదిలింది. తలుపులు మూయడానికి సిబ్బంది వచ్చింది. అప్పుడే హఠాత్తుగా అడిగారాయన. ‘శర్మా, ప్రయాణం ఎంత సేపు?’ అని. రెండు గంటల ఐదు నిముషాలని చెప్పి, ‘బై, సార్’ అన్నాను. ఆయన ‘ఓకే’ అన్నారు. తలుపులు మూసుకున్నాయి. అలాంటి సమున్నత వ్యక్తితో తుది మాట మాట్లాడిన మనిషిని నేను కావడం నా అదృష్టమో దురదృష్టమో తెలియదు. అవే ఆయన చివరి మాటలవుతాయని మాత్రం ఏనాడూ ఊహించలేదు.

విమానాశ్రయం నుంచి 9.15కి సచివాలయానికి చేరుకున్నాను. ముఖ్యమంత్రి పర్యటనలు, యాత్రల గురించి ప్రతి నిముషం తెలుసుకో వడం నాకు అలవాటు. 10.35లకి చిత్తూరు ఎస్పీకి ఫోన్ చేసి హెలికాప్టర్ దిగిందా లేదా అని అడిగాను. ఆయన లేదని చెప్పారు. మళ్లీ 10.45కి చేశాను. అదే సమాధానం. 10.55కి మరోసారి ఫోన్ చేశాను. 11.10 అయింది, హెలికాప్టర్ దిగలేదు. నాలో ఆందోళన. ఓ ఐదు నిముషాలు అటు ఇటుగా దిగాలి. దిగలేదంటే ఎక్కడో అత్యవసరంగా దింపి ఉండాలి. ఒకసారి ఒంగోలు నుంచి వస్తుంటే, వాతావరణం సహకరించక, హెలికా ప్టర్‌ను జడ్చర్లలో దింపి అక్కడ నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరు కున్న ఘటన గుర్తుకు వచ్చింది. ఏమీ అర్థంకాక, దిగులుతో పరిస్థితి గురిం చి అరవిందరావు గారికి, జన్నత్ హుసేన్ గారికీ, చీఫ్ సెక్రటరీ రమా కాంత్‌రెడ్డి గారికి, వీరితో పాటు కేవీపీ రామచంద్రరావుగారికి చెప్పాను. సీఎస్‌ఓ వెస్లీ, డాక్టర్ సుబ్రహ్మణ్యంగార్లతో ఫోన్‌లో మాట్లాడాలని ప్రయ త్నించాను. కానీ స్పందన లేదు. ఎక్కడైనా హెలికాప్టర్ అత్యవసరంగా దిగిన సమాచారం కోసం ముందు జాగ్రత్త చర్యగా అన్ని పోలీసు స్టేష న్లను అప్రమత్తం చేయవలసిందని కర్నూలు, కడప కలెక్టర్లు, ఎస్పీలకు చెప్పాను.

చదవండి :  త్యాగానికి మరోపేరు ...

నిజానికి ఆరోజున వైఎస్‌తో కలసి ప్రయాణించడానికి లగేజీతోనే నేను వెళ్లాను. తనను అనుమతించవలసిందిగా సార్‌ను, పైలట్‌ను కోర దామని అనుకున్నాను. కానీ ధైర్యం చేయలేకపోయాను. సార్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, ‘పనికిమాలినోడా!’ అని. రవిచంద్ తన వెంట రావాలని సీఎం అనుకున్నారు. ఆ స్థానంలో నేను వెళ్లి ఉంటే ఆ మాటే నా చెవిన పడేది.

డాక్టర్ వైఎస్‌ఆర్‌తో నా అనుబంధం నవంబర్ 1, 1992న మొద లైంది. ఎంపీగా, విపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఆయనను నేను ఎలా మరచిపోగలను? నాకు ఈ గుర్తింపు వచ్చిందంటే, అదంతా ఆయన చలవే. ఆయన ముద్రతోనే. ఓ మాట ఇక్కడ చెప్పడం అసందర్భం కాదు. ఆయన జ్ఞాపకం రాని ఒక గంటైనా నా జీవితంలో లేదు.

టి. భాస్కరశర్మ

(వైఎస్ హయాంలో సీఎం అదనపు ప్రైవేట్ కార్యదర్శి)

(సాక్షి దినపత్రిక, 2.9.2015)

ఇదీ చదవండి!

ఆరోగ్యశ్రీ

హైదరాబాదు ఐఐటి ఏర్పాటు ప్రకటన

శాసనసభలో వైఎస్ ప్రసంగాలు Date: December 19, 2006 చదవండి :  నీటిమూటలేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: