వేమన వెలుగులు

    ఆశల తెగ గోసి అనలంబు చల్లార్చి

    గోచి బిగియ బెట్టి కోపమడచి

    గుట్టు మీరువాడు గురువుకు గురువురా

    విశ్వదాభిరామ వినురవేమ

    కోరికలను మొదలంటా నరికేసుకోవాలి. మనసులో చెలరేగే మోహమనే నిప్పును ఉపశమింపజేసుకోవాలి. కామ ప్రక్రియతో పనిలేకుండా అంటే గోచిని విప్పే పనిలేకుండా చేసుకోవాలి. అయినదానికీ కానిదానికీ వచ్చే కోపాన్ని నిర్మూలించుకోవాలి. అప్పుడే బ్రహ్మ రహస్యం తెలుస్తుంది. అలా తెలుసుకున్నవాడే గురువవుతాడు. గురువు కాదు పరమ గురువవుతాడు అని సెలవిస్తున్నాడు వేమన.

    ఇక్కడ గురువంటే యోగే. గురువులకు గురువంటే పరమాత్మ. తనకూ పరమాత్మకూ మధ్య ఉన్న అభేదాన్ని తెలుసుకొని, దానిలో లీనమైనవాడే పరమ గురువు అని సారాంశం.

    ఆశ అంటే కోరిక, ఆపేక్ష, ఇచ్ఛ. ఆశాపాశం అంటారు సంస్కృతంలో. ఆశ అనే తాడు. మనిషి ఆ తాడుతో కట్టబడి ఉంటాడు. ఆశకు దేశీయ రూపం ఆస. కన్నడంలో ఆసె, ఆశె అంటారు. తమిళంలో ఆచై. తెగ గోసి అంటే తెగేటట్టుగా నరికి అని అర్థం. పైపైన నరకటం కాదు, వేరు దగ్గరి నుంచి నరుక్కుంటూ రావాలి. లేకుంటే మళ్లీ మొలకలు వేస్తుంది. అందుకే విడాకులను తెగతెంపులు చేసుకోవడం అంటారు. తరువాత ఏమాత్రం సంబంధం లేకుండా చేసుకోవడమన్నమాట!

    అనలం అంటే అగ్ని. జఠరాగ్ని కూడా అనలమే కాని, ఇక్కడది కాదు. ఇక్కడ కామ సంబంధమైన వేడి. చల్లార్చి (చల్ల+ఆర్చి) అంటే శాంతింపజేయటం, ఆర్పటం. బహుశా చల్లటం అంటే నీళ్లు చల్లటం వల్ల ఈ మాట వచ్చిందేమో.

    చదవండి :  హిమధాముడు లేని రాత్రి హీనములు సుమతీ

    ‘గోచి బిగియగట్టి’ అనేది గుహ్యేంద్రియాలకు పనిలేకుండా ఉండటానికి ప్రతీక. గుహ్యం అంటే రహస్య ప్రదేశం. ‘గోచి’కి అర్థం చెప్పాలా? ఏమో! నగరాల్లోని పిల్లల కోసం కాస్త వివరిద్దాం.

    వెనకకు దోపుకునే ధోవతి కొంగును గోచి అంటారు. సంస్కృతంలో కౌపీనం అంటారు. కచ్చడం అంటే కూడా గోచే. గోచి మనిషికుండే కనీస వస్త్రం. గోచిగాడు అంటే గోచి మాత్రం మిగిలిన దరిద్రుడన్నమాట. పాశ్చాత్యుడైన సి.పి.బ్రౌన్ గోచిని గురించి ఆంగ్లేయులకు వివరించటానికి ఇలా ప్రయత్నించాడు వినండి సరదాకి. To draw the skirt of the Pethicoat between the thighs; tuck it into the waist behind. బిగియబెట్టి అంటే మళ్లీ విప్పే పనిలేకుండా అని.

    ‘గుట్టు మీరువాడు’అంటే గుట్టును అతిక్రమించినవాడు అంటే తెలుసుకున్నవాడు అని.

    యోగి అనేవాడు కర్మలకు అతీతుడై ఉండాలి. కామ క్రోధాదులను జయించాలి. పంచేంద్రియాలకు బద్ధుడై ఉండకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిరీహుడై ఉండాలి. నిరీహ అంటే కోరికలు లేకపోవడం.
    ‘ఆశ కోసి వేసి, ఆశ విడుచువాడె అతడెపో యోగిరా!’ (డి.1769-232); ‘గోచి తీసివేసి గుణము తెలిసి, జోగులెల్ల పరమయోగులు అందురో’ (డి.1769-233) అనేవి పాఠాంతరాలు.

    చదవండి :  వేమన శతకం (వేమన పద్యాలు)

    పచ్చవిల్తుచేత గ్రచ్చర జనులెల్ల

    తచ్చనాడబడిరి ధరణిలోన

    కులజుడెవ్వడిందు కులహీనుడెవ్వడు?

    విశ్వదాభిరామ వినురవేమ

    జనులు మన్మథుని పూల బాణాలకు గురౌతూ కామ మోహితులై లోకంలో పరిహాసాలపాలవుతున్నారు. ఇట్లాంటి వారిలో పెద్దకులం వాడు, చిన్నకులం వాడు అనే తేడా ఉండదు. ఇద్దరూ గుణహీనులే అంటున్నాడు వేమన.
    పచ్చ విల్తుడు అంటే పచ్చని విల్లు గల వాడు. అంటే చెరకుగడను విల్లుగా ధరించినవాడు. అంటే మన్మథుడు. మన్మథుడు ప్రేమ దేవుడు. రోమనులకు, గ్రీకులకు కూడా ప్రణయ దేవతలున్నారు.

    క్యూపిడ్, ఈరోస్ అని. రెక్కలున్న బాలుని రూపంలో కామార్తులపైన బాణాలు వేస్తుంటారు. మన మన్మథునిది చెరకు విల్లు. దానికి తుమ్మెదల బారు అల్లెతాడుగా ఉంటుంది. అతడు చిలుక రథం మీద బయల్దేరి, పూల బాణాలు వేస్తూ కాముకులను రాచిరంపాన పెడుతుంటాడు. వసంతుడు అతని మిత్రుడు. రతీదేవి భార్య. అతని ఐదు బాణాలు సువాసన కలిగిన పువ్వులే. అవి-

    1. అరవిందం అంటే తామరపువ్వు
    2. అశోకం అంటే పొగడ పువ్వు. ఇప్ప పూల ఆకృతిలో ఉండే తెల్లని పువ్వు. భలే పరిమళం!
    3. చూతం అంటే మామిడి పూత
    4. నవమల్లిక అంటే విరజాజి
    5. నీలోత్పలం అంటే నల్లకలువ.

    చదవండి :  చీకటి తెరలను తొలగించిన వేగుచుక్కలు ..వేమన, వీరబ్రహ్మం

    మన్మథుడు బహు ప్రమాదకారి. ఇంత అందమైన సంచారమున్నవాడు ప్రేమభావం కలిగించక మానుతాడా? అతని ధనుస్సు చెరకుగడ, తియ్యనిది. బాణాలు పువ్వులు, పరిమళభరితాలు. ఇలాంటి మన్మథుని కన్ను పడితే రక్తమాంసాలతో కూడిన పంచభూతాత్మకుడైన ఈ మానవ ప్రాణి కామ భావానికి లోనుగాక చస్తాడా!

    గ్రచ్చర అంటే వెంటనే, శీఘ్రముగా అని. ఆలస్యమనే ముచ్చటే లేదు. అట్లా కామ విమోహితులై సమాజంలో చిన్నచూపునకూ, వేళాకోళానికీ గురవుతున్నారు అంటున్నాడు వేమన. తచ్చనాడబడిరి అంటే గేలి చేయబడుతున్నారని. అదేమిటి? ప్రేమ, కామం మంచివి కావా? సహజమైనవి కదా! తేలిగ్గా చూడటమెందుకు? నిజమే కాని, అవి విచ్చలవిడిగా ధర్మ బాహ్యంగా ఉండరాదనేది ఇక్కడి సందేశం. అంతేకాదు ఇట్లాంటి నిరంతర కాముకుడికి కులీనుడు, కులహీనుడు అనే భేదం ఉండదు. ధర్మ మార్గంలో వెళ్లేవాడే కులజుడు. దాన్ని తప్పిన వాడెవడైనా కులహీనుడు అని సారాంశం.

    మూడున్నర శతాబ్దాల కిందట చెప్పిన ఈ వేమన పద్యం ఇప్పటికీ ప్రాసంగికమే. సందర్భోచితమే. వావి వరుసలు మరిచి, పసిపిల్లలూ పెద్దవారనీ చూడక, నేర ప్రవృత్తితో పశు వాంఛలకు పాల్పడే వారిని, మనం వర్తమాన సమాజంలో చూస్తున్నాం. కామం సహజమైందే. ప్రేమ పవిత్రమైందే కాని, అవి సవ్య మార్గంలో వెళ్లినప్పుడే మంచి ఫలితాలుంటాయనీ, కానప్పుడు లోకంలో నవ్వులపాలు కావలసి వస్తుందని వేమన్న సారాంశం.

    డా॥ఎన్.గోపి

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      2 Comments

      • మనస్సును మరియు ఇంద్రియములను నియమించి పరమాత్మునిపై (హృదయస్థమై యుండు ధ్యానము మనస్సునిలుపును.పూర్ణజ్ఞానమును) కలుగజేయును. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు. కాని అట్లు చేయలేనివానికి మనస్సే గొప్ప శత్రువగును. ప్రతియొక్కడు తన మనోసహాయముచే తననుతాను ఉద్ధరించుకొనవలెనే గాని అధోగతిపాలు చేసికొనరాదుమనస్సు మిత్రుడును, అలాగునే శత్రువులై యున్నది. మనస్సును జయించినవాడు శాంతిని పొంది యుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజుడు సుఖదుఃఖములు, శీతోష్ణములు, మానవామానము లన్నియును సమానములే అయి యున్నవి. తాను పొందినటువంటి జ్ఞాన, విజ్ఞానములచే సంపూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి యనబడును.
        ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగిగులకరాయైనను, రాయైనను లేదా బంగారమైనను సర్వమును సమముగా గాంచును. యోగియైనవాడు తన దేహము, మనస్సు, ఆత్మలను భగవానుని సేవ యందు నిలిపి, ఒంటరిగా ఏకాంతస్థలమునందు నివసించుచు ఎల్లప్పుడు మనస్సును నియమింపవలెను. అతడు కోరికల నుండియు మరియు సమస్తమును కలిగియుండవలెనను భావనల నుండియు ముక్తుడు కావలెను.మనస్సును నిలచినప్పుడుఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి సమాధి యనబడు పూర్ణత్వ స్థితిలో శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందము, సుఖమును అనుభవించుగలుగుటను విషయమున మనుజుని సమర్ధతను బట్టి అట్టి పూర్ణత్వస్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన అనుభవమునకు వచ్చు దివ్యానందములో మనుజుడు స్థితిని పొందియుండును. ఈ విధముగా స్థితుడైన అతడు సత్యము నుండి వైదొలగక, దానిని మించిన వేరొక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలచినవాడు గొప్ప కష్టమునందైనను చలింపక యుండును. మనస్సు ఆత్మ యందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు.

      • Very good our telugu value whill be moveing like a sun: I like vemana storyes

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *