
వేంపల్లి గంగాధర్‌కు రాష్ట్రపతి భవన్ ఆహ్వానం
కడప జిల్లాకు చెందిన యువరచయిత డాక్టర్ వేంపల్లి గంగాధర్ రాష్ట్రపతి భవన్ నుండి ‘ఇన్ రెసిడెన్స్’ కార్యక్రమం కింద ఆహ్వానం అందుకున్నారు. 2013 డిసెంబర్ లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద రెండవ విడతలో దరఖాస్తుదారుల నుంచి వేంపల్లి గంగాధర్ ఎంపికయ్యారు. రెండవ విడత ఈ కార్యక్రమానికి ఎంపికైన రచయితలు/కళాకారులకు సెప్టెంబరు 8 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్ ఆతిథ్యం ఉంటుంది. ఈ ఆతిధ్యానికి రాష్ట్రపతి భవన్ గంగాధర్ సహా నలుగురిని ఆహ్వానించింది. వీరిలో ఇద్దరు రచయితలు (మన గంగాధర్, యిషే దొమ్మ భుటియా – వీరు పాత్రికేయులు, 2013 సిక్కిం సాహిత్య సమ్మాన్ పురస్కార గ్రహీత) మరో ఇద్దరు కళాకారులు (రాహుల్ సక్సేనా – తమిళనాడు , ప్రతాప్ సుధీర్ మోరే – మహారాష్ట్ర ).
గంగాధర్ మొలకల పున్నమి, హిరణ్య రాజ్యం,.. మొదలైన పుస్తకాలు రాసారు. ‘నేల దిగిన వాన’ అనే నవల కూడా రాసినారు. గంగాధర్ ‘మొలకలపున్నమి’ కథా సంకలనానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమి నుండి ‘యువపురస్కారం’ అందుకున్నారు.
రాష్ట్రపతి భవన్ ‘ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం’ యువరచయితలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఆహ్వానితులకు రాష్ట్రపతి భవన లోని ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు అవకాశం కల్పిస్తారు. అలాగే వారికి అక్కడ బస కూడా ఏర్పాటు చేస్తారు. కార్యక్రమం చివరలో ఆహ్వానితులను సత్కరించి పంపుతారు.
మొదటి విడతలో కళాకారుడు జోగెన్ చౌదరి ‘ఇన్ రెసిడెన్స్’ కార్యక్రమం కింద రాష్ట్రపతి భవన్ ఆతిధ్యం స్వీకరించినారు.
1 Comment
Dear sir, congratulations