
Image courtesy : The Hindu
వానొచ్చాంది (కవిత)
ఆకు అల్లాడ్డంల్యా
గాలి బిగిచ్చింది
ఉబ్బరంగా ఉంది
ఊపిరాడ్డంల్యా
ఉక్క పోచ్చాంది
వంతు తప్పేట్లు లేదు
వంక పారేట్లే ఉంది.
పొద్దు వాల్తాంది
మిద్దెక్కి సూచ్చనా
వానొచ్చాదా రాదా?
పదునైతాదా కాదా?
అదును దాట్తే ఎట్లా?
ఏడు పదుల కరువు
పందికొక్కుల దరువు
పంకియ్యని ప్రభువు
ముదనష్టపు అప్పు
ఉరితాళ్ళ బతుకు.
అద్దద్దో…ఆపక్క
మోడం ఎక్కొచ్చాంది
ఆ మూల నుంచి
కుమిల్లు కుమిల్లు
నల్లగ కలయబారతాంది
కొత్తమిట్ట కాడికొచ్చె
దున్నంగి పంపుల్లో దిగబడే
అబ్బీ……వచ్చరా….వానొచ్చరా….
మాంచి మోదుబ్బీ…
గావాజీ…లై….
గాజకు పట్టగప్పు
పొట్టుజొల్ల అట్టంపై పెట్టు
ఎద్దల్ని ఇంట్లేకి ఇర్సు
పా…పా…..బెరీగ్గిన…పా….పరిగెత్తు…అబ్బీ…
సిట…పట…సిట…పట…
సిటపట…సిటపట…
సినుకు రాగం
తడి తానం
పదును పల్లవి
రాలె…రాలె…రాలె
సక్కిలిగింత పెట్నెట్లు
ఒక్కపారిగా దూకె…
సినుకు సినుకే….సిక్కెనాయ
ఉక్కబోయి వణుకు ఆయ
మెరుపు మెరిసె…
ఉరుము ఉరిమె….
దిగబడే, దిక్కుతెల్లె…
అబ్బబ్బ… ఏంమోదు, ఏం మోదు!
ఎయ్ ఇర్సు..కుర్సు…ఇర్సాకు…
బెయ్…..సల్లుకోవాకు.
ఏం వాన… ఏం వాన…!
ఎన్నాల్లయ…ఎదురుసూడబట్టి
ఇన్నాళ్ళూ యాడున్న్యావ్…
ఎయ్ ఇర్సాకు…
తూములు దుంక బట్టె
బజార్ల నీళ్ళు అడ్డం పార బట్టె
‘ఔ…గాటిపాట గుమ్మడి’
“పడ్తే పన్నీ…”
‘తడుచ్చావ్ బైటికి పొవ్వాకు!’
“తడిచ్చే…తర్సనీ…వానే..వాన!’
దప్పిక…దప్పిక…దప్పిక
కసి…కసి…కసి
తనువు తీరా.. అణువణువూ
తడ్సాల…తంపుగా
మోల్సాల… మొక్కలా.
వాన వాన వాన
గడ్డ పద్దును సెయ్యాల
నిద్దర మత్తు ఇర్సాల
గద్దెలు కూలి కుప్ప కావాల
సుద్దులు రద్డయి ముద్దవ్వాల
నిందలు బద్దలై పొవ్వాల
ఈ నేల మళ్ళా తర్సాల….
ఈ నేల మళ్ళా మొల్సాల…
ఈ నేలలో ‘పందిర్ల మీద వరి పండాల’
ఈ నేల మళ్ళా గళమెత్తాల
ఈ నేల మళ్ళా కలమెత్తాల
ఈ నేల నేలంతా ఒక్కటై
రాయలసీమ’కలై’ రగులుకుని
కదం తొక్కి కదలాల.
జై రాయలసీమ, జై జై రాయలసీమ.
– వేమన సీమ