
వజ్రాల గని ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ
కడప : ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో శుక్రవారం అధికారులు వజ్రాల గని ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
ఊరికి సమీపంలోని కొండ ప్రాంతంలో 45.649 హెక్టార్లలో వజ్రాల ముడి ఖనిజం (క్వార్ట్జ్) గనుల ఏర్పాటుకు షేక్ అల్లాహ్ మహమ్మద్ భక్షి అనే మైనింగ్ వ్యాపారి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. గనులలో స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. మైనింగ్ కాస్ట్‌లో 2 శాతం ఊరి అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో పలువురు గ్రామస్థులు మాట్లాడారు.
ఊరికి సమీపంలో ఉన్న ఆదిమానవుడి కాలం నాటి రేఖా చిత్రాలున్న గుహలను కాపాడాలని కోరారు. అభిప్రాయ సేకరణలో కొందరు గనుల ఏర్పాటుకు వ్యతితేకత తెలుపగా, మరికొందరు సానుకూలత వ్యక్తం చేశారు.
అభిప్రాయ సేకరణ నివేదికను ప్రభుత్వానికి తెలియజేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న కడప సంయుక్త పాలనాధికారి గౌతమి, కాలుష్య ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు జావిద్‌బాషా, మైనింగ్ అసిస్టెంట్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాయుడు, కాలుష్య నియంత్రణ అధికారులు, తహసీల్దారు ఖాసీం, సీఐ నరేంద్రరెడ్డి, పలు శాఖాధికారులు తెలిపారు.