
రీపోలింగ్ జరగనున్న దేవగుడిలోని బూత్ ఇదే!
దేవగుడిలో 35 మందిపై రౌడీషీట్
డీజీపీ ఆదేశించడంతో శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి సహా దేవగుడి గ్రామంలో ఏకంగా 35 మందిపై జమ్మలమడుగు పోలీసులు రౌడీషీట్ తెరిచారు. వీరంతా వైకాపాకు చెందినవారు కావడం విశేషం.
ఇదేవిధంగా మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డితోపాటు మరో అయిదుగురిపై రౌడీషీట్ తెరవాలని ఓ తెదేపా నేత నుంచి పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నట్లు ఇవాళ ఒక దినపత్రిక పేర్కొంది.
ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను ఆధారంగా చేసి వీరిపై రౌడీషీట్ తెరిచినట్లు సమాచారం.
ఓ వ్యక్తిపై ఏడాదిలో రెండు కేసులు నమోదై ఉంటే రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసు మాన్యువల్ సూచిస్తోంది. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించిన నేరాలు, భౌతిక దాడులు, బెదిరింపులు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి కేసుల్లో కనీసం ఏడాదిలోపు రెండు వాటిల్లో ఉండాలి.
ఎన్నికల వేళ ఘర్షణలకు దిగిన వారిలో కేవలం ఒక పార్టీకి చెందిన వారిపై రౌడీషీట్ తెరవటం ద్వారా పోలీసులు, ప్రభుత్వం విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. విపక్షాలు దీన్ని కక్ష సాధింపులుగా ప్రచారం చేసుకొనే వెసులుబాటూ ఉంటుంది.