మత్తులో జోగిన రాయలసీమ ముఖ్యమంత్రులు

అధికారం  లేదా పదవి అనేది మత్తు మందులా పని చేస్తుంది. ఆ మత్తులో జోగే వాడు దాని నుంచి బయటకు రావటానికి సుతరామూ ఇష్టపడడు. అంతేకాదు ఆ మత్తు కోసం దేన్నైనా పణంగా పెడతారు వాళ్ళు.

ఈ మాటలు రాయలసీమ నాయకులకు అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే వారికి అధికారం కావాలి కానీ అక్కడి ప్రజల బతుకు వెతలు పట్టవు. సీమ నాయకులలో 70 శాతం మందికి అక్కడి సాగు, తాగు నీటి సమస్యలపైన అవగాహన లేదు. ఒకవేళ ఉన్నా సమస్యల పరిష్కారానికి చొరవ చూపరు. చొరవ చూపితే ఎక్కడ సీమేతరుల నుండి విమర్శలను ఎదుర్కోవాలో అని, లేదంటే తమ తమ స్వ’ప్రయోజనాలు’ దెబ్బతింటాయనేది వారి భయం. ఈ ప్రాంతానికి చెందిన ఆరుగురు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినా ఇక్కడి సమస్యలను  కొద్దిమేర కూడా పరిష్కరించే ప్రయత్నం చెయ్యకపోవడం వైచిత్రి.

సీమలోని నాలుగు జిల్లాల నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులుగా పని చేశారు – నీలం సంజీవ రెడ్డి (అనంతపురం), దామోదరం సంజీవయ్య (కర్నూలు), కోట్ల విజయభాస్కరరెడ్డి (కర్నూలు), చంద్రబాబు నాయుడు (చిత్తూరు), నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (చిత్తూరు), వైఎస్ రాజశేఖర్ రెడ్డి (కడప). ముఖ్యమత్రిగిరీ చేసిన వీరంతా సీమ సమస్యలపైన దృష్టి పెట్టిన పాపాన పోలేదు.

నీలం సంజీవరెడ్డి
నీలం సంజీవరెడ్డి

నీలం సంజీవరెడ్డి – కొంతకాలం దేశానికి రాష్ట్రపతిగా కూడా వ్యవహరించిన వీరు ఆంద్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పని చేశారు. అన్ని అనుమతులూ పొంది పక్కన పడిన కృష్ణా – పెన్నార్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం చూపడంలో లేదా  ప్రాజెక్టును చేపట్టడంలో విఫలమయ్యారు. కేవలం కోస్తాంధ్ర నాయకుల అభిప్రాయానికి అనుగుణంగానే పని చేశారని చెప్పక తప్పదు.

చదవండి :  జగన్ కే ఓటు వేసిన వివేకా భార్య ?

దామోదరం సంజీవయ్య

దామోదరం సంజీవయ్య – ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఈయన కుల, ముఠా రాజకీయాలను ఎదుర్కోవడంలోనే పదవీకాలాన్ని గడిపారు. సీమ గురించి కానీ, కనీసం సొంత జిల్లా అయిన కర్నూలు గురించి కాని ఆలోచించే సాహసం చేయలేకపోయారు.

కోట్ల విజయ భాస్కర్ రెడ్డి

కోట్ల విజయభాస్కరరెడ్డి – కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో హైకమాండ్ ఆడిన చదరంగంలో అనూహ్యంగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినారు. ఒకసారి కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ వర్గ రాజకీయాలతో సతమతమైన వీరు రాయలసీమ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. ఆఖరికి కర్నూలు జిల్లాకు ప్రాణాధారమైన అయిన కెసి కెనాల్ విస్తరణ గురించి ఆలోచించలేకపోయారంటే అతిశయోక్తి కాదు.

Chandrababu చంద్రబాబు నాయుడు సుమారు దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగిరీ వెలగబెట్టారు. వీరి హయాంలో సీమ లో ఉన్న ఒకటీ రెండు ప్రభుత్వ పరిశ్రమలు మూతపడేందుకు ఇతోధికంగా సాయపడ్డారు – కడప సహకార చెక్కర కర్మాగారం, ప్రొద్దటూరు పాల కర్మాగారం, చిత్తూరు సహకార డెయిరీకి చెందిన పలు యూనిట్లు మొదలైనవి కొన్ని. బాబు గారు సీమలోని ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ అవసరమైనన్ని నిధులు విదల్చలేదు. పై పెచ్చు ఆయా ప్రాజెక్టులకు పలుమార్లు శంకుస్థాపనలు చేసి ఘనత వహించారు. కనీసం సొంత జిల్లా చిత్తూరులో ఒక నగరాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయారు.

చదవండి :  జిల్లాలో బస్సు సర్వీసుల నిలిపివేత

రాయలసీమ తాగునీటికి కూడా నోచుకోలేక అల్లాడుతున్న సందర్భంలో డెల్టా ప్రాంతంలో మూడో పంటకు నీరివ్వడానికి శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టాన్ని 834 అడుగులకు కుదించిన (1996లో విడుదలైన జీవో నెంబర్ 69) ఘనత కూడా వారి సొంతం. నీరివ్వకుండా కోస్తా ప్రయోజనాలకు వంత పాడినా ప్రధాన సాగునీటి కాలువ కేసి కెనాల్ ను జపాన్ వారి ఆర్ధిక సాయంతో ఆధునీకరించారు. పూర్తిగా కోస్తా వారి ఆధిపత్యంలో బాబు గారు పని చేశారనడంలో సందేహం లేదు.

రాజశేఖరరెడ్డివైఎస్ విషయానికొస్తే సీమ విషయంలో ఆయన కొద్దిమేర శ్రద్ధ పెట్టినప్పటికీ, అంతా సీమకే దోచుకేలుతున్నాడంటూ ప్రతిపక్షాలు ఆయనను చికాకు పెట్టాయి. మిగులు జలాల ఆధారంగా ఏర్పడిన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, పోతిరెడ్డిపాడు విస్తరణ, తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ పూర్తయ్యేతట్లు కృషి చేయడం, విశ్వవిద్యాలయాల ఏర్పాటు, తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి హోదా సంపాదించడం, చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ, కడప చక్కర కర్మాగారం పునరుద్ధరణ, తిరుపతిలో ప్రభుత్వ రంగ సంస్థ భెల్ ఏర్పాటు లాంటి కొన్ని పనులు చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు సవరిస్తూ జీవో 107 తీసుకొచ్చారు. దీనిని నిరసిస్తూ ప్రతిపక్ష నేత బాబు నేతృత్వంలో తెదేపా ప్రకాశం బ్యారేజీపై ఆందోళన చేపట్టినా వెనక్కి తగ్గలేదు. కానీ అంతకు ముందు చంద్రబాబు విడుదల చేసిన జీవో నెంబర్ 69ని రద్దు చేయలేకపోయారు.  ముఖ్యంగా పోతిరెడ్డిపాడు విషయంలో నాటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు, మిత్రపక్షమైన తెరాస నుండి వైఎస్ కు చేయూత లభించలేదు. అయినప్పటికీ మొండి ధైర్యంతో ఆ ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైఎస్ కృషి అని అంగీరించక తప్పదు.

చదవండి :  కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి

బలవంతుడైన ముఖ్యమంత్రిగా పేరున్నప్పటికీ సీమకు నికర జలాలు సాధించే విషయంలో కానీ, మరిన్ని పరిశ్రమలు నెలకొల్పే విషయంలో కానీ పూర్తి స్థాయి నిబద్దత ప్రదర్శించడంలో కాస్త తడబడ్డారని చెప్పక తప్పదు.

కాకపొతే 2009 నాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో సీమకు నికరజలాల సాధనను ఒక హామీగా చేర్చిన వీరు అనూహ్యంగా మరణించడం సీమ వాసులకు తీరని లోటే.

kiranనల్లారి కిరణ్ కుమార్ రెడ్డి – వైఎస్ మరణాంతరం రోశయ్య విఫలమవ్వడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హైకమాండ్ అడుగులకు మడుగులొత్తడంలోనే ఎక్కువ సమయం గడపిన వీరు, సీమ అభివృద్ధి గురించి కానీ ఇక్కడ ఆగిపోయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో కానీ చొరవ చూపలేకపోయారు. వైఎస్ ను మరపించడం కోసమని సంక్షేమ పధకాలకు మార్పులు చేయడంలో ఎక్కువ సమయం గడిపారు.

వైఎస్ మరణానంతరం మందగించిన సీమ సాగు నీటి, అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయటంలో పెద్దగా చొరవ చూపలేదు. బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం రద్దు చెయ్యటంలో వేగంగా నిర్ణయం తీసుకున్న వీరు అందుకు ప్రత్యామ్నాయం చూపకుండా సీమ వాసుల ఆశలపై  నీళ్ళు చల్లారు. ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమించినా పట్టించుకోలేదని అపవాదు మోస్తున్నారు. వీరు సొంత జిల్లా చిత్తూరుకు కొన్ని  హామీలు గుప్పించినప్పటికీ వాటి అమలును వేగవంతం చెయ్యలేదు.

సొంత మంత్రులనూ, ఎమ్మెల్యేలను, సొంత పార్టీ నేతలను నిలువరించడంలో వీరు చూపిన శ్రద్ధ రాయలసీమ అభివృద్దిపైన చూపకపోవడం విషాదం.

ఇదీ చదవండి!

ఆరోగ్యశ్రీ

బినామీ కంపెనీ (బ్రాహ్మణి) ఆరోపణల గురించి (02 April 2008)

బ్రాహ్మణిని తన బినామీ కంపెనీగా పేర్కొంటూ తెలుగుదేశం తరపున ఆనాటి విపక్షనేత చంద్రబాబు శాసనసభలో చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చిన సమాధానం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: