రాయలసీమ కథలకు ఆద్యులు (వ్యాసం) – వేంపల్లి గంగాధర్

నాలుగు జిల్లాల రాయలసీమ. రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం. వర్షాల్లేక బీడు పడిన భూములు, సాగునీరు, తాగునీరు లేక అల్లాడే గ్రామాలు, రాజకీయ నాయకులతో పాటూ పెరుగుతున్న ఫ్యాక్షన్ కక్షలు వీటన్నిటి వలయాల మధ్యనుంచి సీమ కథా సాహిత్యం నిర్మితమవుతూ వచ్చింది. కరువు, కక్షలు, దళిత, స్ర్తి, రాజకీయ, ప్రేమ కథలు ఎన్నో యిక్కడినుంచి విస్తృతంగా వెలువడ్డాయి. సీమ సంస్కృతి మిశ్రమ సంస్కృతి. ఈ నేపథ్యంలో సీమలోని నాలుగు (అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప) జిల్లాల్లోని తొలి కథకుల గురించి తెలుసుకుందాం.

సీమ మొదటి కథకుడు- జి.రామకృష్ణ
———————————–

రాయలసీమనుంచి మొదటి కథను అనంతపురం జిల్లాకు చెందిన జి.రామకృష్ణ 16 మార్చి 1941 నాటి విజయవాణి పత్రికలో ప్రచురించబడిన ‘చిరంజీవి’ కథను నిర్ధారించవచ్చు. ‘విశాలాంధ్ర’లో వీరు పాత్రికేయులుగా పనిచేసారు. 1948-52 సం.ల మధ్య రాయలసీమలో సంభవించిన కరువు నేపథ్యంలో వీరు 1953 సెప్టెంబర్ 9 నాటి ఆంధ్రప్రభలో ‘గంజికోసరం’ అనే కథ రాశారు. రాసింది తక్కువ కథలే అయినా సామాజిక సమస్యలను విశే్లషిస్తూ కథాంశాలను ఎంపిక చేసుకొని ఆ దిశగా రాయలసీమ కథకు వీరు ఊపిరి పోశారు.

చిత్తూరు మొదటి కథకుడు- కె.సభా
———————————

కనక సభాపతి పిళ్లై చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో 1923 జూలై 1న జన్మించారు. వీరు 300దాకా కథలు రాశారు. వీరి కథలు బంగారు, పాతాళగంగ, నీటి దీపాలు అనే కథా సంకలనాలుగా విడుదలయ్యాయి. పిల్లల కథలు కూడా వీరు చాలా రాశారు. వీరి కథల్లో స్థానికత, ప్రాంతీయత చాలా బలంగా కనిపిస్తుంది. సభా రాసిన మొదటి కథ ‘కడగండ్లు’ 1944 ఏప్రిల్ నెలలో ‘చిత్రగుప్త’ పక్ష పత్రికలో ప్రచురితమైంది. సభా పిల్లలకోసం రాసిన కథల్లో అరగొండ కథలు, సీసా చరిత్ర, ఐకమత్యం, చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారత విప్లగాథలు ముఖ్యమైనవి. ‘రైతురాజ్యం, పాంచజన్యం’ వంటి బుర్రకథలు కూడా వీరు రాశారు. ‘్భక్షుకి, మొగిలి, దేవాంతకుడు అనే నవలలు రాశారు. 1980 నవంబరు 4న వీరు కన్నుమూశారు.

చదవండి :  మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

కర్నూలు మొదటి కథకుడు- శ్రీమహావిష్ణు
————————————–

కర్నూలు జిల్లాలో మొదటి తరం కథకులలో సముద్రపు శ్రీ మహావిష్ణు అగ్రగన్యులుగా కన్పిస్తారు. ‘కర్నూలు కథ’ సంకలనం దీనిని బలపర్చింది కూడా! వీరు 15 జూన్ 1923లో జన్మించారు. 1946-47 మధ్య కథలు రాశారు. హృదయవీణ, వెలుగురేఖలు, కాంతి కిరణాలు అనే కవితా సంపుటాలు, నవశానికి నాంది అనే దీర్ఘగేయం, రామకథ, బాలకాండ కథాగానము, వీరి రచనలు. దాదాపు నలభై సంవత్సరాలకుపైగా కర్నూలులో నివసించిన వీరు 2004, అక్టోబర్ 30న పరమపదించారు. వీరి ‘పరిష్కారం’ కథ ‘కర్నూలు కథ’ సంకలనంలో మొదటి కథగా ముద్రించి వీరిని గౌరవించారు.

చదవండి :  వేంపల్లి గంగాధర్‌కు రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం

కడప మొదటి కథకుడు-్భరతం నాదమునిరాజు
————————————————

వేంపల్లిలో 1930వ సంవత్సరంలో జన్మించిన భారతం నాద మునిరాజు ‘నీలవేణి’ కథా సంపుటిని వెలువరించారు. దాదాపు మూడువందల కథలు వీరు రాశారు. నదీనదాలు, జలతారు తెరలు అనే నవలలు కూడా రాశారు. క్రింది, మధ్యతరగతి జీవితాల్లోని విషాదాలే నాదమునిరాజు కథల్లోని ప్రధాన ఇతివృత్తాలుగా కన్పిస్తాయి. శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. భారతి, స్రవంతి అభ్యుదయ, ప్రజాశక్తి మొదలైన పత్రికల్లో వీరి వ్యాసాలు, కథలు ప్రచురితమయ్యాయి. ఉపాధ్యాయ పత్రికలో ‘నవ్యాంధ్ర సారస్వత స్రవంతి’ అనే శీర్షికద్వారా ఆధునిక కవుల్ని పరిచయం చేశారు. 1966లో వీరు కన్నుమూశారు.

చాలా ఆలస్యంగా…!
—————-

సీమలో కథా సాహిత్యానికి బీజం చాలా ఆలస్యంగా జరిగింది. భండారు అచ్చమాంబ మొదటి కథ వచ్చిన (1901) తర్వాత 1941 నాటికిగానీ సీమలో మొదటి కథ నమోదు కాలేదు. 1910లోనే అనంతపురం జిల్లాలో పత్రికా ప్రచురణ మొదలైనా కథకు అది పునాది కాలేకపోయింది. రాయలసీమలో ఆధునిక జీవితం, జీవనం ఆలస్యంగా మొదలు కావడమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ ఇదేవిధమైన సాంస్కృతిక, సాహిత్య వెనుకబాటుతనమూ ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. కానీ సీమ కథకులు ప్రపంచ కథా సాహిత్యానికి ధీటుగా కథా సాహిత్యాన్ని సృష్టించారు.

చదవండి :  అంజనం (కథ) - వేంపల్లె షరీఫ్

రాయలసీమలో మొదటి కథ వెలువడిన 1941నాటి నుంచి 1970వరకు మొదటి తరం కథకులు, 1970నుంచి 1995వరకు రెండవతరం, 1995నుంచి నేటివరకు మూడవ తరం కథకులుగా విభజించుకోవచ్చు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు రెండువందలవరకూ మొత్తం కథకులు నమోదు కావచ్చు. వారు సృష్టించిన కథా సాహిత్య ప్రపంచం ఒక కొత్త లోకమనే చెప్పవచ్చు.

అనంతపురం జిల్లా రచయితలు రాసిన కరువు కథలు ‘ఇనుపగజ్జెలతల్లి’ అనే సంకలనంగానూ, కర్నూలు జిల్లానుంచి 62 కథలతో ‘కర్నూలు కథ’, 48 కథలతో ‘కడపకథ’, 15 కథలతో మదనపల్లె రచయితల ‘కథాగుచ్ఛం’ సింగమనేని నారాయణ సంకలనం చేసిన ‘తెలుగు కథకులు- కథన రీతులు’, మధురాంతకం నరేంద్ర, వి.ఆర్.రాసానిల ‘కథావార్షికలు’, నాగప్పగారి సుందర్రాజు రాసిన ‘మాదిగోడు కథలు’, కక్షల నేపథ్యంలో వచ్చిన ‘సీమ కక్షల కథలు’, కె.లక్ష్మినారాయణ సంకలనం చేసిన ఎనిమిది సంపుటాల ‘దళిత కథలు’ ‘మొలకల పున్నమి’ కథలు, ‘సగిలేటి కథలు’ వంటి ఎన్నో కథా సంపుటాలు రాయలసీమ చరిత్రను, కథా సాహిత్య పరిణామక్రమాన్ని రికార్డుచేస్తూ వస్తున్నాయి. సీమ కథావృక్షం ఆకాశంలోకి కొమ్మల్ని పోనిస్తూ అంబరాన్ని చుంబించే దిశగానే వుంది. సీమ కథ మరో కొత్త మలుపు తీసుకొని ముందుకు సాగే పరిణామంలోనే వుంది. ఇది శుభసూచికం.

(Andhrabhoomi,  March 28th, 2010)

ఇదీ చదవండి!

వానరాయుడి పాట (కథ) – వేంపల్లి గంగాధర్

“ఉత్తరాన ఒక వాన ఉరిమి కురవాల దక్షిణాన ఒక వాన దాగి కురవాల పడమరా ఒక వాన పట్టి కురవాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: