Nandamuri Taraka RamaRao
Late Nandamuri Taraka RamaRao (Photo: Twitter/LahariMusic)

రామారావు విజేతా? పరాజితుడా?

“రామారావు తెలుగువాడిగా పుట్టటం మన అదృష్టం. ఆయన దురదృష్టం” అంటారు ఆయన అభిమానులు. అయన అంతటి ప్రతిభాశాలి కావడం, ఆ సినిమాలను మళ్ళా మళ్ళా చూసి ఆస్వాదించగలగడం తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఆయన దురదృష్టం ఏమిటంటే (బహుశా) తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడే మొదలైన డ్యాన్సులు చెయ్యలేక, చెయ్యకుండా ఉండలేక, డ్యాన్సుల పేరుతో ఆయన చేసిన ఎక్సర్‌సైజులు హాస్యాస్పదంగా, రొమాన్స్ పేరుతో హీరోయిన్ల మీద ప్రదర్శించే హింసాకాండ చూడడానికి ఇబ్బందిగా ఉంటాయి. విదేశీ సినిమాల్లో అయితే ఆ బాధ ఉండేది కాదనుకుంటా (నేను జురాసిక్ పార్క్, ఆ తర్వాత రెండు మూడుకు మించి విదేశీ సినిమాలేవీ చూసినట్లు గుర్తుకులేదు. సినిమాల గురించి తెలిసినవాళ్ళు చెప్తే నా అభిప్రాయాన్ని సవరించుకుంటా).

ఐతే, ఆ కాలంలోనే కాదు, నాటి నుంచి నేటి వరకు ఏ కాలంలోనూ బహుశా కృష్ణ తప్ప ఏ తెలుగు నటుడు కూడా చెయ్యలేని వైవిధ్యమైన పనులు చేసి మెప్పించినాడు ఎన్టీయార్. తెలుగు సినిమా హీరోల్లో అక్కినేని నాగార్జున లాంటివాళ్ళు చిత్ర నిర్మాతలుగా ఉన్నారే తప్ప ఎన్టీయార్ మాదిరి దర్శకత్వం, సినీ రచన(?) కూడా చేసినవాళ్ళు, చేసి మెప్పించినవాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరు.

చదవండి :  కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

ఆంధ్ర ప్రదేశ్ లో 1983 నాటికి కాంగ్రెస్ పార్టీ మూడు దశాబ్దాలుగా అప్రతిహతంగా అధికారంలో ఉండడంతో పోగుచేసుకున్న భీకరమైన ప్రభుత్వ వ్యతిరేకతతో బాటు కాంగ్రెస్ అధిష్ఠానం+ముఖ్యమంత్రి వ్యవహారశైలి, వీటన్నిటి మూలంగా అవతల కాస్త ధీటైన పోటీ ఇచ్చే ప్రతిపక్షం ఏది నిలబడినా తప్పక గెలిచే పరిస్థితుల్లో సినిమాలంటే తెలుగువాళ్ళకు ఉన్న వెర్రి వ్యామోహం, తొలిసారి ఎన్టీయార్ అంతటి సమ్మోహనకారుడైన సినీనటుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం వల్ల చరిత్రాత్మక విజయం అతడి సొంతమైంది.

విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం ఐదేళ్ళ పాలనా కాలంలో చంద్రబాబు నాయుడి నేతృత్వంలో అదే తెలుగుదేశం పార్టీ 2019లో మూటగట్టుకున్న పరాజయంతో 1953 నుంచి ముప్ఫయ్యేండ్లు నిరాటంకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 1983లో పొందిన పరాజయాన్ని పోల్చి చూడండి. అప్పటి ఎన్టీయార్, ఇప్పటి జగన్ విజయాల్లో వారి వారి సొంత ఘనత ఎంతో తేటతెల్లమైతాది.

విజయాన్ని సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సవాల్. 1983లో వచ్చిన విజయాన్ని 1984లో అనుభవరాహిత్యంతో తాత్కాలికంగా కోల్పోయినాడు ఎన్టీయార్. అది ఆయన తప్పు కాదని ప్రజలు అనుకున్నారు. అందుకే మధ్యంతర ఎన్నికల్లో మళ్ళా గెలిచినాడు. ఆ గెలుపు దక్కింది అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరమే కాబట్టి, దాన్ని విడిగా లెక్కించలేం. ఆయనకు జరిగిన ద్రోహానికి పరిహారంగా ఆయన అధికారానికి ప్రజలు ఇచ్చిన పొడిగింపుగా అనుకోవచ్చు.

చదవండి :  శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తొలిగిపోయిందిలా!

ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఓటమి. తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ మునుపటి తప్పులే పునరావృతం చెయ్యడం వల్ల, ప్రత్యామ్నాయంగా తెదేపా సిద్ధంగా ఉంది కాబట్టి 1994 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక వోటుతో తెదేపాకు అధికారం దక్కింది. తిరిగి ఎన్టీయార్ ముఖ్యమంత్రి కాగానే మళ్ళా పార్టీలో తిరుగుబాటు. “ఒకసారి మోసపోతే మోసం చేసినవాడిది తప్పు. మళ్ళా మోసపోతే అది మోసపోయినవాడి అసమర్థత”. అందువల్లే రాజకీయాల్లో ఎన్టీయారుకు దక్కిన విజయాలు సమయానుకూలం, ఆయన ఓటములు స్వయంకృతం. మొత్తంగా చూస్తే నాయకుడిగా ఆయన అట్టర్ ఫెయిల్యూర్.

సూటిగా చెప్పాలంటే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ఏకధాటిగా ఐదేండ్ల కాలానికి మించి ముఖ్యమంత్రులుగా ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి(?), చంద్రబాబు నాయుడు, వయ్యెస్సార్, జాతీయ రాజకీయాల్లో రాణించిన పి.వి. నరసింహారావు, నీలం సంజీవ రెడ్డి – వీళ్ళతో పోలిస్తే ఎన్టీయార్ ఏ కోశానా నాయకుడనిపించుకోడు. వీళ్లలో కూడా సొంత నాయకత్వంలో వరుసగా రెండు సార్లు జనరల్ ఎలక్షన్లలో విజయం సాధించిన ఘనత ఒక్క వయ్యెస్సార్ దే.

చదవండి :  ఆశలన్నీ ఆవిరి

ఎన్టీయార్ ఘనత ఏదైనా ఉందీ అంటే అది కేవలం సినిమా రంగంలోనే. ఇంకా చెప్పాలంటే రాష్ట్రాన్ని, రాజకీయ పార్టీని పక్కన పెడితే, ఒక కుటుంబాన్ని సజావుగా నిర్వహించలేక, గంపెడు సంతానం ఉండీ అవసాన కాలంలో ఏ ఒక్కరూ దరి చేరడానికి ఇష్టపడక పరాజితుడిగా తనువు చాలించిన అసమర్థుడు ఎన్టీయార్.

– త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో (వికీపీడియా సహా) వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. ‘ఈ-మాట’ అంతర్జాల పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్న వీరు కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

బస్సు ప్రయాణం

తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’

మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: