“నారాయణ” లీలలు: రాజధాని కమిటీ మాయ : 1

ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగానే…

‘కడప’ లెక్కను పరిగణలోకి తీసుకోని శివరామకృష్ణన్

న దేశంలో రాష్ట్రాల విభజనగానీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటుగానీ కొత్త కాదు. కానీ గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రాజధాని గురించిన ఆలోచన లేక ఆందోళన ఒక పీడించే (obsession) స్థాయికి చేరడం ఇప్పుడే చూస్తున్నాం. రాజధాని అవసరం ఒక శాసనసభ (అసెంబ్లీ), ఒక సచివాలయం (సెక్రటేరియట్) వరకే. ఈ వాస్తవాన్ని విస్మరించి, ఐ-పాడ్ లతో పేపర్లెస్ క్యాబినెట్ సమావేశలు నిర్వహించే స్థాయికి ఈ-పాలనను తీసుకుపోయిన ప్రభుత్వమే, దశాబ్దాల కిందటే రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశాల్లో వీడియో కాన్ఫరెన్సులకు పెద్దపీట వేసిన ప్రభుత్వమే మిగతా పనులన్నీ పక్కనబెట్టి రాజధానిని మాస్ హిస్టీరియాలా అందరికీ ఆవహింపజేయబూనడమే అర్థం కాకుండా ఉంది. రాష్ట్రవిభజన నిర్ణయం వెలువడ్డాక చంద్రబాబునాయుడు గారు చెప్పిన మాట “ఒక్క రాజధాని నిర్మాణానికే నా.లు.గై.దు. ల.క్ష.ల. కోట్లౌతుందని”! ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేటైన ఆయన చెప్పిన రెండు సంఖ్యల మధ్య తేడానే లక్ష కోట్లు!!

సరే, తర్వాత కేంద్రప్రభుత్వం రాజధాని కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటుచేశాక మొదలైంది నాటకంలో ఇంకో అంకం. శివరామకృష్ణన్ కమిటీ నిపుణుల కమిటీయే అయినా ఎందుకనో రాజధాని గురించి ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. నేరుగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడం మొదట ఎంపికచేసిన నగరాలకే పరిమితం చేసినా తర్వాత్తర్వాత మొక్కుబడిగానే ఐనా విడతలవారీగా (శ్రీకాకుళం, విజయనగరం తప్ప) దాదాపు అన్ని జిల్లాలూ తిరిగారు.

కొన్ని జిల్లాల్లో వారాంతాల్లోనూ, లేదా ఒకటి కంటే ఎక్కువసార్లు లేదా ఎక్కువ రోజులు పర్యటించి ప్రజాభిప్రాయాలను సేకరించిన శివరామకృష్ణన్ కమిటీ కడపలో కూడా మొక్కుబడిగా రెండు గంటల పాటు ఒక సమావేశం నిర్వహించింది – అది కూడా అందరూ ఆఫీసులకు వెళ్ళవలసివచ్చే సోమవారం రోజున. ఈ రెండు గంటల్లో జిల్లా అధికారులు స్థానికంగా ఉన్న స్థితిగతులను వివరించడానికి (ఇక్కడ అధికారులు ఎంత గొప్పగా ప్రదర్శించి వివరించారంటే కడప జిల్లాకు సరిహద్దులుగా తూర్పున అనంతపురం, పడమట నెల్లూరు జిల్లాలు ఉన్నాయట!), విద్యార్థి సంఘాల నిరసనలకు గంటకు పైగా గడిచిపోయింది. మిగతా సమయంలో ఎమ్మెల్యేలు, రకరకాల సంఘాల ప్రతినిధులకు అరగంట, కమిటీ ఏర్పాటు, దాని ఉద్దేశాల గురించి కమిటీ తరపున అరోమర్ రేవి వివరణ, ఆ తర్వాత విలేకరుల ప్రశ్నలు-సమాధానాలకు అరగంటపోగా వందకుపైగా ఉన్న మాలాంటి సామాన్య పౌరులకు అసలు సమయమే దొరకలేదు. లిఖితపూర్వకంగా ఉన్న వినతులు-విజ్ఞాపనలను మాత్రమే కట్టగట్టి తీసుకునివెళ్ళారు. ఇది జరిగింది 2014 ఆగస్టు 11, సోమవారం నాడు.

చదవండి :  ఆయన ఒక్కడే అవినీతి పరుడా?

ఆ తర్వాత కొంత కాలానికి (27 ఆగస్ట్ 2014న) శివరామకృష్ణన్ కమిటీ 187 పేజీల నివేదికను కొత్తఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ కు అందజేసింది. అంటే సుమారుగా కడపలో నామమాత్రంగా సమావేశం జరిగిన రెండు వారాల తర్వాత. చివర్లో అలా కడపకు వచ్చి ఇలా వెళ్ళిన కమిటీ సదరు సమావేశాన్ని లెక్కలోకి తీసుకున్నట్లు కానీ అక్కడి విజ్ఞాపనలను కనీసం చూసినట్లు కానీ కనిపించదు.

ఇందుకు రుజువు కమిటీ నివేదికలో కనిపిస్తుంది. నివేదిక (36వ పేజీ)లో ఆ కమిటీ వివిధ సందర్భాల్లో నిర్వహించిన సమావేశాల వివరాలను ఇచ్చారు (Annexure – II: Meetings Held by the Expert Committee లో III. Visits undertaken by the Committee). దాన్నిబట్టి చూస్తే సదరు కమిటీ సభ్యులు ప్రభుత్వ ఖర్చులతో కంటితుడుపుగానో, మొక్కుబడిగానో కడప జిల్లాలో పర్యటిస్తున్న నాటికే కమిటీ అధ్యక్షులైన శివరామకృష్ణన్ గారు “పన్నెండు జిల్లాల ఆంధ్ర ప్రదేశ్” కు సంబంధించిన నివేదికను ఖరారు చేసినట్లు అనిపిస్తోంది.

మాలాంటి అమాయకులు ఆఫీసులెగ్గొట్టీ, సొంతపనులు మానుకునీ శ్రమపడి నివేదికలు/విజ్ఞాపన పత్రాలు సిద్ధం చేసుకుని, దూరప్రాంతాల నుంచి వచ్చి మరీ సమర్పించుకుంటే వాటికి పూచికపుల్లంతైనా విలువివ్వకుండా, చెత్తబుట్టలో పారేశారు! కాబట్టే కడపలో జరిగిన సమావేశం ఊసే నివేదికలో పొందుపరచలేదు అని నా అనుమానం. పైగా తిరుపతి, చిత్తూరులను విడి విడి జిల్లాలుగా లెక్కేశారు!!

దీన్నిబట్టి చూస్తే ఆ నివేదికలో ప్రజాభిప్రాయం పేరుతో ఇచ్చినవి కూడా (4728 మందిలో 1156 మంది విజయవాడ-గుంటూరుకు వోటేశారని) దొంగ లెక్కలు లేదా సృష్టించబడిన లెక్కలు (manipulated figures) అని అర్థమౌతుంది. ఐతే ‘ఈనాడు’ లాంటి అగ్రశ్రేణి తెలుగు పత్రికలు నిపుణుల కమిటీ ఇచ్చిన అభిప్రాయాన్ని (Expert Opinion) పక్కనబెట్టి ఈ సృష్టించబడిన లెక్కలతో తయారైన ’ప్రజాభిప్రాయం’ అనే అంశాన్ని గురించే భూనభోంతరాలు దద్దరిల్లేలా ప్రచారం చేశాయి. ఆ కమిటీ సభ్యులతో ఎక్కువసార్లు సమావేశమైంది, రాసుకు పూసుకు తిరిగింది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో నారాయణ (ఈయనే ఇప్పుడు తన శాఖ కాకపోయినా అద్భుత ఊహాలోకం ’అమరావతి’ పనుల్లో మునిగి తేలుతున్నారు) గారే (Annexure I: Meetings Held by the Expert Committee) అని ఎవరు మరిచిపోగలరు? న్యాయంగా చూస్తే ఒక నిపుణుల కమిటీ నివేదికకు ప్రజాభిప్రాయం ప్రాతిపదిక కాకూడదు. ప్రజాభిప్రాయమే కావాలంటే సర్వేలో రెఫరెండమో చేయించాలి.

చదవండి :  రైళ్లకూ మొహం వాచిన రాయలసీమ!
Capital Suitability Index
Capital Suitability Index

శివరామకృష్ణన్ కమిటీ తన విషయ నిపుణతనంతటినీ క్రోడీకరించి తయారు చేసిన నివేదిక సారాంశమంతా Capital Suitability Index అన్న ఒక్క టేబుల్లో కనబడుతుంది (జోడించిన బొమ్మ చూడండి). నిజానికి సదరు కమిటీ Capital Suitability Index గురించి మరింత వివరంగా తమ అభిప్రాయాన్ని(Expert Opinion) వివరించి ఉండవలసింది. సరైన వివరణలు, వివరాలు లేకపోవడం వల్ల ఇదో బ్రహ్మపదార్థంగా మిగిలిపోయింది. వివరణల కోసం శివరామకృష్ణన్ గారికి, IIHS డైరెక్టర్ అరోమర్ రేవి గారికి పంపిన మెయిళ్ళకు సమాధానమే రాలేదు! శివరామకృష్ణన్ నుంచి ఇక ఎప్పటికీ రాదు :(.

ఆ సూచికలో మొదటి (Risk), నాలుగవ (Land) నిలువు వరుసలు (columns) మాత్రమే అధిక ప్రాధాన్యత కలవి. ఎందుకంటే మిగతా నిలువు వరుసలలో సూచించిన అంశాలలోని స్థానాలు మానవ ప్రయత్నం చేత మార్చడానికి సాధ్యమయ్యేవి (వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధిచెయ్యాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే).

పట్టికలోని మొదటి నిలువు వరుసలో పేర్కొన్న విపత్తు (Risk) సంభావ్యతను బట్టి చూస్తే వరదలు, తుఫాన్లు, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి “అత్యంత సురక్షితంగా” ఉండే నగరం కడప అని తేటతెల్లమౌతుంది. నాలుగవ నిలువు వరుసలో ఇచ్చిన భూలభ్యత (Land) విషయంలో కూడా కడప జిల్లా రాష్ట్రం మొత్తమ్మీద మూడో స్థానంలో ఉంది.

ఇక మిగతా సూచికల విషయానికొస్తే…

రెండో నిలువు వరుసలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతోనే కాకుండా అన్ని పొరుగు రాష్ట్రాల రాజధానులతో ఉన్న సంధాయకత (కనెక్టివిటీ) సౌలభ్యానికి సమాన వెయిటేజితో ర్యాంకింగు ఇచ్చారు. హైదరాబాదు, చెన్నయ్, బెంగళూరు నగరాలతోబాటు అప్రధానమైన, తెలుగువారికి పెద్దగా సంబంధంలేని ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాల రాజధానులకు ఎంత దూరంలో ఉందనేది అంత ప్రాధాన్యతాంశమా? పైగా, ఇప్పుడెలాగూ కడప విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది కాబట్టి సంధాయకత విషయంలో కడప అనుకూలత బాగా పెరిగింది.

చదవండి :  ప్రాంతాల మధ్య కాదు, ప్రాంతాలలోనే అసమానతలు

మూడో నిలువు వరుస (Water) నీటి లభ్యత గురించి. కడప ఈ విషయంలో రాష్ట్రంలో అట్టడుగున ఉంది. ఐతే… ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇదే నివేదికలోని 16వ పేజీలో ఇలా ఉంది “… if Chennai, Hyderabad, and Delhi can access water from distant sources there is no insurmountable reason for Kurnool and Anantapur not to do so.” అని. చిత్రమేమిటంటే, కరువుసీమలోని కర్నూలు, అనంతపురం నగరాలకు నీటిలభ్యత ఒక సమస్యే కాదని, మనసుంటే మార్గముంటుందని వక్కాణించిన కమిటీ అదే మాటను కడప గురించి చెప్పకపోవడం. అప్పటికి కొన్నేళ్ళ కిందటే సోమశిల రిజర్వాయర్ నుంచి కడప, అనంతపురం ప్రాంతాల తాగునీరు, పారిశ్రామిక అవసరాల నిమిత్తం నీటిని అందించడానికి ఉద్దేశించి మొదలుపెట్టిన ప్రాజెక్టు కేవలం గత ప్రభుత్వాల నిర్లక్ష్యధోరణి వల్ల కొండెక్కినట్లు సదరు కమిటీకి తెలియదు కాబోలు!

ఐదవ నిలువు వరుస: వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధిచెయ్యాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే అన్ని నగరాలూ/ప్రాంతాలూ ఈ విషయంలో సమాన స్థాయికి చేరుకుంటాయి. సహజంగానే కోస్తా ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు జిల్లాలు, కోస్తాయేతర ప్రాంతంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి.

– త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

మిడిమేలపు మీడియా

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: