హృదయమున్న విమర్శకుడు – రారా!

హృదయమున్న విమర్శకుడు – రారా!

రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక వ్యక్తి చెయ్యగలిగిన కృషికన్నా అనేక రెట్లు ఎక్కువ చేసిన అక్షర కర్షకుడు రా.రా.

రాచమల్లు రామచంద్రారెడ్డి

కళ -హృదయం- మేధ

[box type=”shadow” ]

కళ హృదయ సంబంధి అయిఉండాలా? లేక పాఠకుడి ‘మేధ’కు అపీల్ చెయ్యలా?-ఇది సాహిత్య విమర్శ రంగంలో రా.రా. లేవనెత్తిన చర్చల్లో అన్నింటికన్నా ముఖ్యమయినది. చర్చ నిర్వహించడమంటే గోడమీద పిల్లిలా ఉంటూ, ఇరుపక్షాల వాదాలనూ ‘సమన్వయం’ చెయ్యడమేననే భ్రాంతి రా.రా.కు ఎప్పుడూ లేదు. అందుకే, కళ మౌలికంగా హృదయ సంబంధమయిన వ్యాపారమే నని ఢంకా బజాయించి మరీ చెప్పాడాయన. ఆరెస్ సుదర్శనం లాంటి పండితుల ‘మేరమీరిన మేధ’ను ఆయన ఘాటుగా విమర్శించారు. అందుకే ఆయన్ను ‘హృదయమున్న రసైకజీవి’ అనేది.

చదవండి :  బేస్తవారం కడపకు బాలయ్య

తనవాదాన్ని సమర్థించుకునే క్రమంలో రా.రా. ప్రాక్పశ్చిమ సాహిత్య సిద్ధాంతాలను వడపోసి, సారాంశాన్ని పాఠకుడికి అందించారు. రా.రా. సాహిత్య వ్యాసాల సంకలనం ‘సారస్వత వివేచన’లో ఈ సమాచారం మొత్తం దొరుకుతుంది. (త్వరలోనే ఈ పుస్తకం పునర్ముద్రణ వెలువడనుంది.)

ఏకైక దిక్సూచి!

రా.రా.పేరు ఇప్పటికీ తల్చుకునేలా చేసే విషయాలు చాలానే ఉన్నా అన్నిటికన్నా ముఖ్యమయింది ‘సంవేదన’ త్రైమాసిక. 1968-69 సంవత్సరాల్లో కడప నుంచి -కేవలం ఏడాదిన్నరకాలం మాత్రమే – వెలువడిన సాహిత్య పత్రిక ‘సంవేదన’. ఈ పత్రికను ‘యుగసాహితి’ నిర్వహించింది. యుగసాహితిలో రా.రా.తోపాటుగా గజ్జెల మల్లారెడ్డి, వైసీవీ రెడ్డి, ఆర్వియార్, సొదుం జయరాం, నల్లపాటి రామప్ప నాయుడు, టి.సాంబశివారెడ్డి, చెన్నారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, ఐ.సుబ్బారెడ్డి, చవ్వా చంద్రశేఖర రెడ్డి, వి. రామకృష్ణ తదితరులు చురుకయిన పాత్ర పోషించారు. వీళ్లలో ఒకరిద్దరు తప్ప తక్కినవారందరి రచనలూ ‘సంవేదన’లో కనిపిస్తాయి. అయితే, ‘సంవేదన’ పత్రికకు దిక్సూచిగా నిలబడింది మాత్రం రా.రా.గారే.

నిజంగా మన భాగ్యం!

సొదుం జయరాం రాసిన ‘వాడిన మల్లెలు’ కథను ఏదో ‘పరువయిన’ పత్రిక తిప్పి పంపించిందట. ఆ కథ ఆధారంగా ఓ వర్క్‌షాప్‌లాంటిది నిర్వహించి రా.రా. దానికి అసాధారణ ప్రాచుర్యం కల్పించారు. జయరాం కాకుండా మరో ముగ్గురు ఆ కథను సొంత పద్ధతిలో రాసి, నాలుగింటినీ కొడవటిగంటి కుటుంబరావు పరిశీలనార్థం పంపారు. ఆయన జయరాం కథే అన్నింటిలోకీ ఎందుకు మెరుగ్గా ఉందో వివరంగా విశ్లేషించి చూపించారు. ఇలాంటి ప్రయోగం మరొకటి జరిగినట్లు ఎక్కడా వినలేదు! అదీ సంపాదకుడిగా రా.రా. విశిష్టత. చలం, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, మహీధర రామమోహనరావు తదితర ఆధునిక-అభ్యుదయ రచయితల కృషికి ‘సంవేదన’లో రా.రా. నివాళులెత్తారు. అయితే అవన్నీ అక్షరాలా ‘క్రిటికల్’ అప్రీసి యేషన్సే కావడం గమనార్హం. ‘సంవేదన’లో రా.రా. వ్యాసాల్లో ముఖ్యమయినవన్నీ ‘సారస్వత వివేచన’లో చేర్చడం నిజంగా మన భాగ్యం.

చదవండి :  గువ్వలచెన్న శతకకర్త ఘటికాశతగ్రంథి పట్టాభిరామన్న

అనువాద నాదం!

1969-76 సంవత్సరాల మధ్యకాలంలో రా.రా. మాస్కోలోని ప్రగతి ప్రచురణాల యంలో అనువాదకుడిగా పనిచేశారు. అంతకు చాలాకాలం ముందే-దాదాపు దశాబ్దం ముందే- రా.రా. చరిత్రాత్మకమయిన ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ను అనుపమానమయిన రీతిలో తెలుగు చేశారు. రా.రా.గారు మార్క్స్-ఎంగెల్స్‌ల ‘ఆత్మ’ను పట్టుకుని, తెలుగు పాఠకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫుట్‌నోట్స్ సమకూర్చి, అనువాదాన్ని తీర్చిదిద్దడమే, ఈ పుస్తకం అంతగొప్పగా ఉండడానికి మూలకారణం! ఇలా, అనువాద కళ తాలూకు సున్నితమయిన ఛాయలు కూడా క్షుణ్ణంగా తెలిసినవాడు కావడం వల్లనే రా.రా. ‘అనువాద సమస్యలు’ పుస్తకాన్ని అంత అద్భుతంగా రాయగలిగారు. సామాన్య పాఠకుడికి సైతం ఆసక్తికరంగా సాగే అకడమిక్ గ్రంథం ఇది. (‘విశాలాంధ్ర’ సంస్థ ఈ సంవత్సరమే ఈ పుస్తకాన్ని తృతీయ ముద్రణగా వెలువరించింది. వెల రూ.125- మాత్రమే!)

చదవండి :  ఈ రోజు కడపకు శివరామక్రిష్ణన్

రెండంచుల వాడి కత్తి!

[box type=”success” ]

‘వేయిపడగల విశ్వనాథ’ను చెరిగిపోసినందుకూ – దిగంబర కవులను చావగొట్టి చెవులు మూసినందుకూ – కాళోజీ అనువాద సరళిని నరికిపోగులు పెట్టినందుకూ – అద్దేపల్లి రామమోహనరావు అన్వయ వైపరీత్యాన్ని కడిగి ఎండేసినందుకూ – రారాను చాలామందే విమర్శించారు. కానీ, ఎవ్వరూ, ఎన్నడూ ఆయన్ను స్వపక్ష వలపక్ష వాదిగా మాత్రం నిందించలేదు.

‘సృజన’ చలం ప్రత్యేక సంచికను ‘సంవేదన’లో సమీక్షిస్తూ మంచి వ్యాసం (మహానుభావుడు చలం?) రాశారు రా.రా. దానిమీద బోలెడంత చర్చ జరిగింది. ఆ చర్చలో రా.రా.కు సన్నిహితులుకూడా పాల్గొన్నారు. తనతో విభేదించిన ఓ మిత్రుణ్ని కూడా నిర్దాక్షిణ్యంగా చెలిగేశారు రా.రా.

ఇలాంటి సమదృష్టి ఏ కాలంలోనయినా చాలా అరుదు. అందుకే రా.రా. చనిపోయి ఇరవయ్ మూడేళ్లు అవుతూన్నా ఇప్పుడు కూడా ఆయన్ను తల్చుకునేది!

–  మందలపర్తి కిషోర్

వార్తా విభాగం

ఇవీ చదవండి

1 Comment

  • rara nu nirdaakshinya karaku vimarshakudu annaru!vimarsha nangi nangiga etu edi thelchkunda undaraadu!asale telugulo vimarsha deepam chinnadi!maro rara kaavaali!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *