
రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు – అన్నమయ్య సంకీర్తన
రాగము: దేసాళం
రేకు: 1650-5
సంపుటము: 26-298
॥పల్లవి॥
రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు
గట్టిగా నేఁడిపుడు తగవు దేర్చరే
॥చ1॥
చెలము సాదించరాదు సముకానఁ గొంచరాదు
పలుమారు మాటలాడి పదరీ వీఁడు
మొలకచన్నులు నావి మొనలెత్తీఁదనమీఁద
చెలులార మాకు బుద్దిచెప్పఁగదరే
॥చ2॥
పందెములడువరాదు పంతము విడువరాదు
కందువలు చూపి పొత్తుగలసీ వీఁడు
అందపు నాచూపు లివి అంటుకొనీఁ దనమీద
చందపు మావలపులు చక్కఁబెట్టరే
॥చ3॥
తమక మాఁపఁగరాదు తాలిమి చూపఁగరాదు
అమర గూడె శ్రీవెకటప్పఁడు వీఁడు
చెమటల నామేను చేఁతసేసీఁ దనమీఁద
జమళి మమ్మిద్దరిని సారె మెచ్చరే