
కల్లబొల్లి రాతల రక్తచరిత్ర
గంజి కరువు
దిబ్బ కరువు
ధాతు కరువు
డొక్కల కరువు
నందన కరువు
బుడత కరువు
ఎరగాలి కరువు
పెద్దగాలి కరువు
పీతిరి గద్దల కరువు
దొర్లు కరువు
కరువులకు
లేదిక్కడ కరువు
ఎండిపోయిన చెట్లు
బండబారిన నేలలు
కొండలు బోడులైన దృశ్యాలు
గుండెలు పగిలిన బతుకులు
ఇదే అనాదిగా కనిపిస్తున్న
రాయలసీమ ముఖ చిత్రం
దగాపడిన దౌర్భాగ్యులకు
ఈ నేల నెలవైంది
వంచించబడి వధ్యశిల నెక్కడం
ఇక్కడ మామూలైపోయింది
ఈ అధవసీమ ముఖంపై
ఎవడో ఎక్కడివాడో
ఎడతెరపిలేకుండా రాస్తున్నాడు
కల్లబొల్లి రాతల రక్తచరిత్ర !
– తవ్వా ఓబులరెడ్డి
[author image=”https://kadapa.info/wp-content/uploads/2012/04/TOR-smile-150×150.jpg” ]
జర్నలిజం, సాహిత్యం ప్రవృత్తిగా రచనలు చేస్తున్న తవ్వా ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామంలో జన్మించారు. వీరి సంపాదకత్వంలో వెలువడిన ” కడప కథ, రాయలసీమ వైభవం” సంకలనాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.వీరు రాసిన ‘గండికోట’ అం.ప్ర ప్రభుత్వం వారి ఉత్తమ పర్యాటక రచన పురస్కారానికి ఎంపికైంది.
[/author]