
యితనాల కడవాకి….! – జానపదగీతం
వర్గం: ఇసుర్రాయి పదాలు
యితనాల కడవాకి యీబూతి బొట్లు
యిత్తబోదము రాండి ముత్తైదులారా
గొర్తులేయ్యీమను గుంటకలెయ్యీ
కొటార్లు తోలమను కోల్లైనగూసే
గొరుదోలే రామనకు గొడుగు నీడల్లు
బిల్లల మలతాడు బిగువు తాయితులు
యిత్తేటి సీతమకు యిరజాజి పూలు
నూగాయి సరిపెండ్లు నూటొక్కమాడా
గొర్తి ఎద్దులకేమో కొమ్ము కుప్పుల్లూ
పచ్చల్ల పణకట్లు పట్టు గౌసేన్ లూ
అక్కిడేసే రంబాకూ అంచుచీరల్లూ
నాలుబడిగల రైక నాను తీగల్లు
గుంటక లచ్చుమయకు గోటంచు పంచా
పులిగోరు తాయితులు బొమ్మంచు సెల్లా
గుంటకెద్దులకేమొ కుచ్చుల్ల తాడు
బోరుబోరు గజ్జెల్లు బొడ్డు గంటల్లు
పైసాల చెన్నయకు పగిడి కడియాలు
గజ్జెల్ల మలతాడూ గిరక సెప్పుల్లూ
పైసాల యెద్దులకూ పగిడి కుప్పుల్లూ
కుచ్చుల్ల పణకట్లు కురుమల్లితాడూ
పాడినవారు: వడ్డే గుత్తెమ్మ, రాకట్ల, రాయదుర్గం తాలూకా, అనంతపురం జిల్లా