ఆదివారం , 6 అక్టోబర్ 2024

మేడిదిన్నె కైఫియత్

మేడిదిన్నెకు కరణంగా ఉండిన ప్రధమలు చంచురాజు అనే ఆయన ఈ కైఫీయత్ ను రాయించినాడు.

చిన్న పసుపుల గ్రామానికి దగ్గర్లో పూర్వం ఎత్తైన స్థలం (దిన్నెలేదా గడ్డ)లో ఒక పెద్ద మేడి (అవుదుంబర) చెట్టు ఉండేదట. కొన్నాళ్ళకు ఆ మేడిచెట్టు ఉన్నటువంటి దిన్నె మీద ఒక ఊరు ఏర్పడిన తరువాత ఆ ప్రాంతము మేడిదిన్నెగా వాడుకలోనికి వచ్చినది.

పూర్వము నుంచీ ఈ ప్రాంతం ఉదయగిరి రాజ్యంలో భాగమైన గండికోట సీమలో భాగంగా ఉండేదిట. ఇలా ఉండగా కృష్ణదేవరాయలు విద్యానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించే సమయంలో తాడిపత్రి మాధవభట్ల (ఈయన ఆశ్వలాయన సూత్ర సూత్రేరుకు శాఖాధ్యాయులైన విశ్వామిత్ర గోత్రజులట)  గారి పెద్ద కొడుకైన నాగంభట్లు విద్యానగారానికి పోయి అక్కడ రాయలవారి దగ్గర చాలా రోజులు ఆశ్రయం పొందినాడట. ఈ తాడిపత్రి మాధవభట్లకు నలుగురు కొడుకులట – నాగంభట్లు, మల్లిభట్లు, చిట్టుభట్లు మరియు రామాభట్లు అని వీరికి పేర్లు.

రాయలవారిని ఆశ్రయించి ఉండిన నాగంభట్లు ఒక అగ్రహారం ఇప్పించమని అడిగినాడట. అప్పుడు రాయలవారు నాగంభట్లుకు ఒక అగ్రహారము ఇవ్వాలని నిశ్చయించుకొని కడప రాజ్యంలో పసుపుల సీమలో అంతర్భాగంగా ఉన్నటువంటి గుండ్లకుంటకు తూర్పున, ఉమామహేశ్వరపురం అనే ప్రాచీన పేరు కలిగిన బోడితిప్పనపాడుకు దక్షిణాన, చిదిపిరాల్ల (సదిపిరాళ్ళ) గ్రామానికి పశ్చిమంగా, చిన్న పసుపుల గ్రామానికి ఉత్తరంగా ఉన్న మేడిదిన్నెకు కృష్ణరాయపురంగా పేరు మార్చి మాన్యము ఇచ్చి పుత్రపౌత్రాదులు అనుభవించేతట్లు నాగంభట్లుకు దానం చేశాడట. ఈ దాన వివరాలను తామ్ర శాసనం రాయించి ఇచ్చినారట.

చదవండి :  కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

నాగంభట్లుకు మాన్యంగా ఇచ్చిన భూమి – గ్రామ కంఠానికి గాను ౨౨ (22) క్షేత్రాల తెగుబడి (దుక్కి) భూమి @3 మూడు పుట్లున్నూ, చవిటి కలిసిన భూమి @3 మూడు పుట్లున్నూ దత్తం చేసినాడు.

అగ్రహారికుల వద్ద ఉన్న శాసనం నకలు కాగితంలో ఇలా వుందిట – దత్తమయిన భూమిలో నాగభట్లు తమ్ములైన మల్లిభట్లుకు 3 వృత్తులు (ఇది ‘వంతులు’ అయి ఉండొచ్చని మా అభిప్రాయం), చిట్టిభట్లకు 4 వృత్తులు, రామాభట్లుకు  5 వృత్తులు, మిగిలిన మొత్తం భూమి, అగ్రహారం అంతా నాగంభట్లు అనుభవించాలని ఉన్నదిట.

చదవండి :  అన్నమయ్య దర్శించిన మేడిదిన్నె హనుమంతాలయం

పైన పేర్కొన్నట్లు మేడిదిన్నె అగ్రహారం మొత్తం బ్రాహ్మణులకు సర్వమాన్యముగా ఉండినది.

మేడిదిన్నె గ్రామానికి తూర్పున ఉన్న ఆంజనేయస్వామి దేవళంలో ఒక శిలాశాసనం పాతి ఉండేది – దీని ప్రకారం సదాశివరాయలు విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో కృష్ణరాయ సముద్రం (ఇది మేడిదిన్నె గ్రామానికి మరొక పేరు) అనే అగ్రహారంలో విప్రవినోది (వినోదవృత్తిచే జీవించు బ్రాహ్మణులలో నొక తెగ) వల్లభయ్య కుమారుడు పర్వతయ్య, కేశవయ్య కుమారుడు చెన్నయ్య అనబడే ఇద్దరూ – గ్రామస్తులు యాటా (ప్రతి సంవత్సరం) వారికి ఇచ్చే సొమ్మును అదే మాదిరిగా  మేడిదిన్నెలోని చెన్నకేశవ స్వామి వారి దశమి మహోత్సవాలకు గాను దానపూర్వకముగా ఇచ్చినారట.

విజయనగర సామ్రాజ్యం పతనం అయి దేశం మొత్తం మహమ్మదీయుల పాలనలో ఉండగా, హజరతు సరాఫరాజు ఖాను సాహేబు వారు రాజ్యం చేసేటప్పుడు అగ్రహారములో భట వృత్తులు చేసే వారికి కొంచెం భూమిని ఉంచి తక్కినదంతా రాజ్యానికి (ప్రభుత్వానికి) చెందేట్లు దఖలు చేసుకున్నాడు. అప్పటి నుంచి మేడిదిన్నె శాలివాహనశక సంవత్సరం ౧౭౩౩ (AD 1811) – ప్రజోత్పత్తి సంవత్సరం కార్తీక శుద్ధ నవమి అయిన నేటి వరకూ పెద్దపసుపులలో భాగంగా ఏలుబడిలో ఉండెను.

చదవండి :  ఉరుటూరు గ్రామ చరిత్ర

(ఇదంతా రాయించిన కరణం కైఫీయత్ చివరలో మేడిదిన్నె ఏర్పాటుకు మూలం అయిన తామ్ర శాసనం గురించి ఇలా చెప్పుకొచ్చినాడు…)

అగ్రహారికుల వద్ద తామ్రశాసనాలు లేవు. దక్షిణాదికి పోయిన అగ్రహారికుల సంబంది అయిన ఒక బ్రాహ్మడి వద్ద ఆ తామ్రశాసనం ఉందని అగ్రహారికులు చెప్పుకుంటారు అని.

మెకంజీ కైఫీయత్ పుటలు: 226, 227, 228 & 229. మేడిదిన్నె జమ్మలమడుగు తాలూకా, పెద్దముడియం మండలంలోని ఒక గ్రామము. ఈ మేడిదిన్నె కైఫీయత్ రాతప్రతి యొక్క నకలు కడపలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం (గ్రంధాలయం)లో ఉంది. అసలు రాత ప్రతి చెన్నైలోని ‘Governmnet Oriental Manuscripts Library’లో ఉంది.  అలాగే  సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం వారు ప్రచురించిన ‘మెకంజీ కైఫీయత్తులు – కడప జిల్లా’ మూడో భాగంలో  (పుట: 238)లో కూడా ఉంది.

ఇదీ చదవండి!

మాలెపాడు శాసనము

కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: