మా వూరి చెట్లు

మా వూరి చెట్లు మతికొస్తానాయి

ఎందుకో ఈ రోజు మా వూరి చెట్లు గుర్తుకొస్తున్నాయి…

బయట నుండి వచ్చేవాళ్ళకు మా వూరి గుమ్మం తొక్కకముందే రోడ్డుకు కుడివైపున పెద్ద పెద్ద చింతమాన్లు కనపడేవి. అవేవీ మేమో, మా నాన్నలో, వాళ్ళ నాన్నలో నాటినవి గాదు. ఆ చింత చెట్ల ప్రాంతాన్నంతా “పాతూరు” అనేవారు. మా వూరికి ముందున్న వూరు అదే. దాని అసలు పేరు అగ్రహారం. అగ్రహారానికి ఉత్తరంగా చెరువు. అదే కల్పనాయుని చెరువు. ఆ చెరువు గట్టున వున్న శివాలయం అప్పటి అగ్రహారానికి ఒక సాక్ష్యమైతే, అప్పుటి యిళ్ళ పెరళ్ళలో పెంచుకున్న చింతమాన్లు రెండవ సాక్ష్యం. ఈ చింతమాన్లకు తోడుగా రెండు మామిడి మాన్లూ వుండేవి. ఒకటేమో శివాలయం పక్కనే, చెరువు గట్టు మీద వుండేది. రెండోది కొంచం దూరంగా పాతూర్లో వుండేది. ఆ రెండింటికీ వూర్లో వాళ్ళు చెంబెడు నీళ్ళు పోయకపోయినా, అవి మాత్రం మాబోటి పిల్లకాయలకు పదిరాళ్లకు ఓ కాయయినా ఇస్తుండేవి. ఇక ఉగాది పండుగకూ, పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలకూ గుమ్మాలను, పందిళ్ళనూ అలంకరించడానికి మామిడి తోరణాలకు ఆకులిచ్చేవి.

మా వూరి చెట్లుపాడుబడిన వూరు గనుక అందులో ఇళ్ళు కట్టుకోకూడదన్న ఏదో ఆచారం వుండిందేమో, అక్కడెవరూ నివాసం కోసం ఇళ్ళు కట్టుకోలేదు గానీ, ఒక్కో చింతచెట్టునూ కలుపుకొని కంపతో కంచె వేసి ఆక్రమించుకొని వామిదొడ్లుగా మార్చుకున్నారు. మామిడి కొమ్మలు పెళుసు గనుక పిల్లకాయలం అవి ఎక్కడం తక్కువే గానీ చింతచెట్లు మాత్రం ఆ భయం లేకుండా ఎక్కేవాళ్ళం. ఒక వేలెడు కొమ్మకు వేలాడినా అది విరుగుతుందనే భయమే లేదు.

పొద్దున్నే బడికి వెళ్ళడానికి ముందే ఎనుముల్ని తోలుకొని ఈ చింతచెట్ల కిందకే వచ్చేవాళ్ళం. చలికాలం పోయినప్పటి నుండే చింతచెట్లు చిగురించడం మొదలెట్టేవి. అప్పుడు పొద్దున్నే ఎనుముల కాయడంతో పాటు, చెట్లెక్కి చింతచిగురు కోయడమూ ఒక అలవాటు. మామూలు పప్పుతో బోరు కొట్టిన నోటికి చింతచిగురు వేసిన పప్పు తింటే…మధురమైన రుచి. కొంతమందికి ఆ చిగురు జీవనోపాధి కూడా. ఆ చిగురును కోసి సంచులకెత్తుకొని ఉదయాన్నే కడప వెళ్ళే బస్సుకెళ్ళి అక్కడ అమ్ముకొచ్చేవాళ్ళు. చిగురు కాలం పోయాక లేత చింతకాయలు మా నోర్లను వూరించేవి. లేత చింతకాయలను రాతిబండపై దంచి, అందులో వుప్పూ కారం చేర్చి వగుర్చుకుంటు తినేవాళ్ళం. అన్ని విధాలుగా చింతచెట్టును వేధించినా చివరికంటా కాయల్ని కాపాడుకొని చింతపండునూ ఇచ్చేవి. సంక్రాంతి నెలనాళ్ళు వుందనగా ఈ చింత చెట్లు దాసరోళ్ళు, జంగమోళ్ళు ఇలా చాలామందికి తాత్కాలిక వసతి అయ్యేవి. అప్పుడున్న చింతచెట్లలో ఇప్పుడెన్ని మిగిలిన్నాయో వూరెళ్ళినప్పుడు చూడాలి.

చదవండి :  శ్రీభాగ్ ఒప్పందం లేదా ఒడంబడిక
మా వూరి చెట్లు
కల్పనాయుని చెరువు

ఈ పాతూరు గురించి చెప్పేటపుడు మరిచి పోకుండా గుర్తుకు వచ్చేది ఎక్కడ చూసినా కనిపించే తులసి చెట్లు. ఇవి పొలాల్లో కనిపించకుండా ఇక్కడ మాత్రమే విపరీతంగా కనిపించడానికి కారణం…వాటిని అగ్రహారంలోని ప్రతి యింటివారూ బహుశా యింటి వెనుకో, ముందో పెంచుతూ పూజిస్తూ వుండివుంటారు. ఇప్పుడున్న మా వూరిలో ఎవ్వరూ తులసి చెట్టును పెంచడం, పూజించడం చూళ్ళేదు గానీ..ఏవైనా పూజలప్పుడు బాపనయ్య తులశాకు కావాలన్నప్పుడు పాతూరుకు పరుగెత్తుకెళ్ళి పిడికెడు పట్టుకొచ్చేవాళ్ళం.

అలా చింతచెట్లను చూస్తూ మావూర్లో అడుగుట్టబోయేముందు వచ్చే మొదటి కొట్టం, బడికొట్టం. దాని పక్కనే ఒక సుంచాకుల(సుంకేసుల?) చెట్టు వుండేది. దాని పక్కనే పిల్లలు ఆడుకునేందుకు జారుడు బండ, వూయలలు, తూగుడు బండ వుండేవిట. నాకు గుర్తుంది మాత్రం తూగుడుబండే. ఆ తర్వాత అదీ మాయమయింది. ఈ సుంచాకుల చెట్లకు బాగా పలుకుబడి వుండేదనుకుంటా. వూరి మొదట్లోనే బడి కొట్టం పక్కన ఒకటి వుండేదన్నానా. మా యింటి ముందూ ఓ పెద్ద సుంచాకుల చెట్టు వుండేది. ఈ చెట్టు కిందే వేసవిలో మంచం పైన కూర్చుని మా నాన్న నాకు గణితంలో చిట్కాలు చెప్పడం గుర్తుంది. ఈ చెట్టుకిందే friendకు స్పెల్లింగ్ చెప్పలేక మానాన్నతో తిట్టించుకోవడం గుర్తుంది. ఈ చెట్టుకిందే పెద్ద రోలుండేది. ఓ రోజు రాత్రి వానాగాలికి ఆ చెట్టు వేళ్ళతో సహా కూలిపోయింది. మా యింటి ఎదురుగా వుండే ఈరప్ప గారింటికి పోయే చోట రెండు చెట్లుండేవి. ఆ రెండు చెట్ల కిందే ఎద్దులకు లాలాలు (నాడాలు) కొట్టే సాయిబు వస్తే దుకాణం పెట్టేవాడు. మా యింట్లోని ఒక మంచి కోడెకు లాలాలు కొట్టడానికి ఈ చెట్లకింద పడదోసినప్పుడే కాలిరిగింది. ఈ సుంచాకుల చెట్ల పూలు ఎర్రగా భలే అందంగా వుండేవి. పూల మధ్యన కాడలు, ఆ కాడల చివరన చిన్న గింజలాంటిది వుండేది. వాటితో పుంజూ-పెట్ట ఆట ఆడేవాళ్ళం.

చదవండి :  ప్రకృతీ అంతే! ప్రభుత్వాలూ అంతే!

మా వూరి చెట్లు

మళ్ళీ కొద్దిగా వెనక్కు వస్తే రామస్వామి యింటి పక్కన జువ్వి చెట్టు వుండేది. మా వూరంతటికి అదొక్కటే జువ్విచెట్టు. దాని ఆకులు పీకలు చేసుకోవడానికి భలే అనువుగా వుండేవి. ఆకుల్ని చుట్టగా చుట్టి, ఓ చివరన ఒత్తి నోట్లో పెట్టుకొని బూరవూదుతూ తిరిగేవాళ్ళం.

ఆ యింటి పక్కనే రామయ్య పెద్దయ్య యింటి పెరట్లో మునగ చెట్టు వుండేది. ఎప్పుడన్నా కడుపునొప్పి అన్నామో ఈ మునగ చెట్టు నుండి ఆకు తెచ్చి వేపుడు వండి తినమనేవాళ్ళు. నాకయితే పేపర్లు అంటించడానికి ఈ మునగచెట్టు భలే బంక (జిగురు) ఇచ్చేది. బంక కావాలంతే మొదట ఈ చెట్టు దగ్గరికి పరుగెత్తడం లేదంటే ఇక సుంచాకుల చెట్టును వెతకడం.

ఇంకా ముందుకెళ్ళి నాలుగురోడ్ల కూడలి నుండి కుడివైపుకు తిరిగితే ఆ వీధి చివర ఒక యింటి(పేరు మర్చిపోయా) పెరట్లో పెద్ద చింత చెట్టు వుండేది. వీధి కొసన, చెరువు అంచున ఓ పాడుబడ్డ బావి వుండేది.

మా వూరి చెట్లు

కూడలి నుండి ముందుకు వెళితే రామాలయం పక్కనే ఓ వేపచెట్టు వుండేది. చిన్నప్పుడు వేమయ్య సామి అని గుర్రం మీద ఒక సామి, వెంట శిష్యులతో వచ్చి ఈ చెట్టుకిందే ఆశ్రయం పొందేవాడు. ఆయన ఆ వేపచెట్టు కొమ్మతో దీపం వెలిగించడాన్ని వింతగా చూసేవాళ్ళం. ఆయన వచ్చే గుర్రం గురించి వింతగా చెప్పుకునేవాళ్ళం. మేము గుర్రాన్ని ప్రత్యక్షంగా చూడటం అదే తొలి.

చదవండి :  కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

వూరి బయట వున్న నేరేడు చెట్టుది ఒక ప్రత్యేకత. పెళ్ళికి ముందు వరుడు మేళతాళాలతో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మూడు నేరేడు మండలను తెంచాలి. వాటిని తెచ్చి పందిరిని అలంకరించడం మా వూర్లో పెళ్ళి తంతులో ఒక భాగం.

వూరికి దక్షిణంగా వున్న ఈరప్పగారి బాయి దగ్గర మేడి చెట్టు వుండేది. ఎప్పుడోగానీ అటెళ్ళలేదు గానీ ఒకట్రెండుసార్లు మేడిపళ్ళు తిన్న గుర్తు.

మా వూరి చెట్లు

ఇక సిగిరి చెట్టు అనే చెట్టు మా యింటిపేరున్నోళ్ళకు యింటి దేవత. కానీ ఎవరూ ఆ చెట్టును నాటి సాకగా చూళ్ళేదు. పెళ్ళిళ్ళు లాంటి శుభాకార్యాలకు ఆ చెట్టు ఎక్కడ వుంటే అక్కడ నాలుగు రాళ్ళతో గుడి కట్టి, అందులో ఒక రాయిని ప్రతిమను చేసి ఆ ప్రతిమను “గురుదేవుడు”గా పూజించి, ప్రసాదం వండి పంచడం ఆచారం. మా నాన్న తరం వరకు ఆ గురుదేవుడి పేరుతో ఇంట్లో ఒకరికైనా “గురవయ్య”, “గురునాథ్”, “గురమ్మ” లాంటి పేర్లు పెట్టుకోవడం తప్పనిసరి. ఈ జానపద ఆచారాలను వదిలి తిరుపతి వెంకటేశ్వరున్ని యింటివేల్పును చేసుకోవడంతో పేర్లలో “గురు” అంతమై “వెంకట” చేరడం ఒక విషాదం. ఇదంతా మరో గాధ.

అదీ మా వూరి చెట్ల కథ. ఇప్పుడు ఎన్ని వున్నాయో.. ఎన్ని కాలంలో కలిసిపొయ్యాయో!

– ప్రసాద్ చరసాల

రచయిత గురించి

ప్రసాద్ చరసాల కడప జిల్లాకు చెందిన ఒక ప్రవాస భారతీయుడు. రామాపురం మండలంలోని ‘కల్పనాయుని చెరువు’ వీరి స్వస్థలం. ఇంజనీరింగ్ లో పట్టభద్రులైన వీరు అమెరికాలో స్థిరపడినారు. వివిధ సామాజిక సమస్యలపైన ప్రసాద్ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. పీడితులకు, బాధితులకు బాసటగా ప్రసాద్ తన వాణిని వినిపిస్తుంటారు.

ఇదీ చదవండి!

కొండపొలం

ప్రకృతీ అంతే! ప్రభుత్వాలూ అంతే!

పల్లెలో పండుగ సందడి కన్పించటం లేదు. టౌన్నించి ఆటో దిగే వాళ్ల చేతుల్లో సగం సంచినిండా కూడా పండుగ సరకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: