మనమింతే!

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే రాష్ట్రప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా రాయలసీమలో ఇంకెక్కడైనా సరేనంటోంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని, కొప్పర్తిలో కుదరకపోతే జమ్మలమడుగులోనైనా ఈ లాబ్ ఏర్పాటుచెయ్యమని రక్షణశాఖ మంత్రికి ఒక విన్నపం పంపేదానికి త్రివిక్రమ్ అనే ఆయన (ఈయన గతంలో కడపకు శివరామకృష్ణన్ కమిటీ వస్తోందని చివరి నిమిషంలో తెలిస్తే బెంగుళూరు నుండి అప్పటికప్పుడు వచ్చి వాళ్ళను కలిసి కడపలో రాజధాని ఎందుకు ఏర్పాటు చెయ్యాలనే వివరాలతో ఒక విజ్ఞాపన పత్రాన్ని వాల్లకిచ్చాడు) పూనుకున్నారు. అంతకు ముందు ఈయన కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారికి ఒక విజ్ఞాపనతో కూడిన ఉత్తరం (ఈమెయిల్) పంపినారు. ఓ వారం రోజులైనా వారి నుండి తిరుగు టపా కానీ, acknowledgement కానీ లేదు. ఈ నేపధ్యంలో ఇందుకోసమై రక్షణ మంత్రిత్వ శాఖకు పంపేదానికి ఆయన ఒక ఆన్-లైన్ పిటీషన్ (http://www.ipetitions.com/petition/request-to-establish-electronic-warfare-lab-in/) తయారు చేసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసినాడు – ఈ విషయంలో మిగతా కడప జిల్లా వాళ్ళు, ఇతరులు ఎవరైనా సరే సంతకం చేసి తన ప్రయత్నానికి మద్దతు తెలపాలని విన్నవించాడు.

పది రోజుల క్రితం పిటీషన్ తయారు చేసిన త్రివిక్రమ్ మూడు రోజుల తర్వాత చూస్తె కేవలం తను కాక ముగ్గురే  అందులో వారి పేర్లు (సంతకం) రాశారు. ఈ లెక్కన వంద మంది నుండి సంతకాలు కావాలంటే కనీసం వంద రోజులు వేచి చూడాలి. ఇలా అయితే కష్టమని భావించిన త్రివిక్రమ్ తనకు తెలిసిన మిత్రులందరికీ ఈమెయిలు పంపినాడు. వీరిలో అధికులు కడప జిల్లా వాళ్ళే. ఈమెయిలు చదివిన వాళ్ళలో ఒకరిద్దరు తప్ప ఎవరూ వాళ్ళ పేర్లు రాయలేదు. కొంతమంది కడప మిత్రులను ఫోను ద్వారా కాంటాక్ట్ చేసి సంతకాలు చెయ్యమని అభ్యర్తించినాడు.

చదవండి :  సాగునీళ్ళలో సీమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన కోస్తా ఇంజనీర్

త్రివిక్రమ్ ఈమెయిలు అందుకున్న కడప.ఇన్ఫో ఈ ప్రయత్నానికి అండగా నిలవాలని ఒక పోస్టు (https://kadapa.info/వార్‌ఫేర్-లాబ్/) ప్రచురించి సంతకాలు చెయ్యమని అభ్యర్తించింది. అంతేకాదు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విన్నపాలు పంపింది. అంతే కాకుండా పిటీషన్ మీద సంతకం చెయ్యమని ఒక బ్యానర్ ను కూడా కడప.ఇన్ఫో కు జత చేశాం. ఇలా చేస్తే ఒక వారం రోజుల్లో మొత్తానికి 30 మంది స్పందించి సంతకాలు చేశారు. అప్పటికి మొత్తం సంతకాలు చేసిన వారి సంఖ్య కేవలం 40 మాత్రమే. ఇంకా 60 మంది సంతకాలు కావాలి. facebook మెసెంజర్ ద్వారా ఒక్కొక్కరిని పింగ్ చేసి, విషయం చెప్పి రెండు వందల మందిని అడిగితే అందులో మరో పదిమంది మాత్రమే వాళ్ళ పేర్లు రాశారు. ఇంత ప్రయత్నమూ చేస్తే ఈ రోజు వరకూ మనోళ్ళు రాసిన పేర్లు 52 మాత్రమే!

www.kadapa.info వాళ్ళ ఫేస్బుక్ పేజీలో ఈ అంశాన్ని దాదాపు 1800 మంది వీక్షిస్తే అందులో 13 మంది లైకులు కొట్టినారు. అందులో వాళ్ళ పేర్లు రాసింది కేవలం ముగ్గురు మాత్రమే! 6 వేల పైచిలుకు మంది సభ్యులున్న kadapa district గ్రూపులో ఈ విషయాన్ని పిన్ చేస్తే స్పందించిన వాళ్ళ సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అదే తుళ్ళూరు భూములకు సంబంధించి లేదా రాజకీయాల గురించి మనోళ్ళు ఫేస్బుక్లో ఎంత కష్టపడి స్పందిస్తున్నారో, అవసరమైన చోట్ల బూతులు తిట్టడానికి కూడా వెనుకాడకుండా. ఇక రాజకీయాల గురించి చెప్పే పనే లేదు. వైఎస్ గొప్పా? బాబు గొప్పా? జగన్ గొప్పా? ఇలాటి అంశాల మీద రాత్రీ పగలూ తేడా లేకుండా కూర్చుని వ్యాఖ్యలు రాస్తారు. ఈ సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారిలో అత్యధికులు 12వ తరగతి పైన చదువుకున్న వాళ్ళూ, టెకీలూ, ఇతరత్రా ఉద్యోగస్తులూ, విద్యార్తులూనూ.  ఇదంతా ఇప్పుడెందుకూ అంటే స్థానిక సమస్యలపైనా లేదా అభివృద్ది పైనా మనోల్ల చైతన్యం ఏపాటిదో గుర్తు చెయ్యటానికి.

చదవండి :  నిరాదరణకు గురైంది తెలంగాణా కాదు, రాయలసీమే -శ్రీ కృష్ణ కమిటీ

తుళ్ళూరు భూముల గురించో, రాజధాని గురించో అక్కడి వారు మాట్లాడగలరు. అవసరమైతే ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ కోసం మాట్లాడతాయి. సామాజిక ఉద్యమకారులూ మాట్లాడతారు. ఇంకా కావాలంటే మన నాయకులు వాళ్ళ కోసం మాట్లాడతారు. మరి మన కోసం మాట్లాడటానికి ఎవరున్నారు? వాళ్ళ చైతన్యం ఏపాటిదో ఆయా మాధ్యమాలలో వారికి లభిస్తున్న ఆదరణ చూస్తే తెలుస్తుంది. అలాగని ఆ సమస్య గురించి మనోళ్ళు మాట్లాడకూడదని కాదు. మన సమస్యలను గుర్తించి స్పందించాలి.

చదవండి :  ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

మన జిల్లాలో ఉన్న మంగంపేట గనుల్లో కేటాయింపులను రద్దు చేసి ఏకపక్షంగా అక్కడున్న మిల్లులను మూసివేస్తే దానికి సామాజిక మాధ్యమాలతో సహా ఏ మాధ్యమంలోనూ తగిన ప్రచారముండదు. దానిపైన పోరాటాలూ ఉండవు. సామాజిక ఉద్యమకారులు అక్కడ కనపడరు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణత్యాగాలు చేసిన మనం మనకు ఇవ్వాల్సిన ప్రభుత్వ ఉక్కు పరిశ్రమ ఊసు లేకుండా పోయినా, ప్రత్యామ్నాయం చూపకుండా నిర్మాణంలో ఉన్న ఉక్కు పరిశ్రమను రద్దు చేసినా మాట్లాడం. మన విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమై ఆగిపోయినా మనం అడగలేం. పోతిరెడ్డిపాడు ద్వారా మనకు కేటాయించిన వంద టిఎంసిలు రాకపోయినా – పంటలయినా ఎండిపోనీ కానీ నోరు మెదపం. దేవుని కడప బ్రహ్మోత్సవాలను నాసిరకంగా, తూతూమంత్రంగా జరిపినా మనకు పట్టదు. ఉన్నపళంగా మహిళా డెయిరీలను మూసివేసినా మనకెందుకులే అని ఊరుకుంటాం. సమీక్షా సమావేశాల పేర అడిగి ఇదిగో అంటూ గాలి వార్తలు రాసి సాగునీటి ప్రాజెక్టులకు డబ్బుల కేటాయింపులు చేయకపోయినా అడగం. ఆయా అభివృద్ది ప్రాజెక్టులన్నీ ఒకే ప్రాంతానికి తరలిపోతున్నా అడగలేని మొహమాటస్తులం మనం. ఎవరో చెప్పిన మాటలు విని సమైక్యాంధ్ర అని ఉద్యమిస్తాం – కానీ రాయలసీమ వాటా కోసం లేదా కడప వాటా కోసం ఉద్యమించం. మన సంస్కృతిని కించపరిచే వ్యాఖ్యానాలు చేసినా నిరసన చెప్పం.

ఇన్ని విషయాలలో స్పందించని మనం త్రివిక్రమ్ అడిగితే మాత్రం పిటీషన్లో (http://www.ipetitions.com/petition/request-to-establish-electronic-warfare-lab-in/) పేరెందుకు రాస్తాం!  మనమింతే!!

ఇదీ చదవండి!

మిడిమేలపు మీడియా

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: