మచ్చలేని కుటుంబం మాది -మాజీ మంత్రి వైఎస్ వివేకా
పులివెందుల, ఆగస్టు 11 : అవినీతి, అక్రమాల విషయంలో మచ్చలేని కుటుంబం తమదని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక లయోలా కళాశాల అవరణలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాల పర్వం తమ వంశంలోనే లేదన్నారు. మంచి తనం నేర్పించిన తమ తల్లిదండ్రులు మంచి బుద్ధిని కూడా ప్రసాదించారని తెలిపారు. వారిచ్చిన స్పూర్తితోనే రాజకీయాల్లో నడుచుకున్నామన్నారు. వారి అడుగుజాడల్లో పయనించి రాష్ర అభివృద్ధికి దివంగతనేత వైఎస్ ఎంతో కృషి చేశారని తెలిపారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో భూ కేటాయింపులు జరిగివుంటే అప్పటి కేబినేట్ ఆమోదం మేరకు జరిగి ఉంటాయన్నారు. కానీ భౌతికంగా వైఎస్ లేని సమయంలో ఆయనపై బురద జల్లడం బాధాకరమన్నారు. జగన్ ను అప్రతిష్ట పాలు చేయడానికి వైఎస్ అధికార బలంతోనే జగన్ అక్రమాస్తులు సంపాదించారని ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. జగన్ సంపాదించిన ఆస్తులు, ఆదాయాలకు సంబంధించి ఆయన పన్ను కూడా చెల్లించారన్నారు. రాష్ట్రంలో వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత వైద్యం, విద్య, సాంకేతిరంగం, మహిళా ప్రగతి, రైతు సంక్షేమం తదితర రంగాలు ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారన్నారు. ఏ రకంగా ముందుకు పోవాల అన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు నడిపించారన్నారు. సాగుకు యోగ్యమైన ప్రతిఎకరాకు సాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు వైఎస్ చేసిన కృషిని వివరించారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉండేలా వైఎస్ చేసిన సేవలు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి విద్యాబుద్దులు నేర్పించి మంచి ఫలితాలను తీసుకువచ్చేందుకు చేసిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఉద్యోగ, ఉపాధి అవకాశాల పొందడానికి అనేక ప్రాంతాల్లో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామ సీమలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని పదేపదే కోరేవారని తెలిపారు. ప్రజలకు దశాదిశా నిర్థేశించి, రాష్రాన్ని ప్రగతి పథంలో నిడిపించిన మహానేత వైఎస్ కలల సాకారం కోసం ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి సాధించినప్పుడు వైఎస్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ దేవుడే సమాధానమిస్తాడని వివేకా పునరుద్ఘాటించారు.