ఒకప్పుడు రామాయణ, భారత, భాగవత కథలు జానపదుల జీవితంలో నిత్య పారాయణాలు. వారికి ఇంతకంటే ఇష్టమైన కథలు మరేవీ ఉండవేమో!
పితృవాక్య పరిపాలనకై శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు వచ్చినాడు. ఆ సమయంలో భరతుడు అక్కడ లేడు. వచ్చిన తర్వాత జరిగిన ఘోరానికి బాధపడి తల్లి కైక దురాశను నిందించి అడవిలో అన్నను కలుసుకుంటాడు. భరతుని రాకకు సంతోషించిన రాముడు అయోధ్యలోని అందరి యోగక్షేమాలు అడిగినాడు. భరతుడు గుండెలవిసేట్లు ఏడుస్తూ తండ్రి చనిపోయిన విధం చెప్పి ఇందులో తన నేరమేమీ లేదని, మళ్ళా అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించమని అన్నను అభ్యర్థించినాడు. అందుకు శ్రీరామచంద్రుడు ‘సర్వ జగత్తు’ మేలుని కోరి కైకమ్మ తనను అడవులకు పంపిందని, నా మూలంగా కన్నతల్లిని కష్టపెట్టక ఉండమని కొన్ని ధర్మ సూక్ష్మాలు వివరించినాడు. తర్వాత తన పాదుకలిచ్చి వాటికి పట్టాభిషేకం చేసి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయమని పంపించినాడు.
సంభాషణల రూపంలో చక్కగా సాగిన ఈ పాటను జానపదులు ఇలా పాడుకుంటారు.
వర్గం: చెక్కభజన పాట
పాడటానికి అనువైన రాగం: ఖరహరప్రియ స్వరాలు – మిశ్రచావు
రాముడు:
భరతుడా! నా చిన్ని తమ్ముడా
క్షేమమా తలిదండ్రులూ
గురువు విశ్వామిత్రులకూ
కుశలమా పురజనులకూ
భరతుడు:
అన్న వినుమా కన్నతండ్రీ
మొన్ననే చనిపోయెను
సుతులు లేని సమయమందున
జనకుడు మరణించెను
రాముడు:
తమ్ముడా భరతయ్య మనమిక
ఉండి ఏమి సేతము
ఏమి వేడుకలంచు వస్తివి
విపిన భూమూలందుకు
భరతుడు:
అడవి కొచ్చిన నేరమేమో
అన్న నాతో తెలుపుమా
ముని కుమారుని తల్లిదండ్రులు
ముందుపెట్టిన శాపమా
రాముడు:
తమ్ముడా భరతయ్య నాది
తప్పుగా భావించకూ
పదిలముగ పదునాలుగేండ్లూ
వుండి మల్ల వస్తమూ
తప్పులెన్నకు జగతి మేలును
కోరినందున తమ్ముడా
అడవి కంపెను కన్నతల్లిని
కష్టపెట్టక ఉండుమా
భరతుడు:
కన్నతల్లిని కష్టపెట్టుట
కారణంబేమున్నది –
నేను తల్లి కైక మొగమును
ఎట్ల చూచి చరింతును
రాముడు:
కన్నతల్లి మొదటి దైవము
మనసు నుంచి మసలుమా
ధర్మ సూక్ష్మము తెలిసి తల్లిని
ప్రేమతో సేవింపుమా
పాదుకా పట్టాభిషేకము
నీకు ఇస్తిని తమ్ముడా
ధర్మమును విడనాడకును
నగరమును పాలింపుమా
పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య