
నేడు జిల్లాకు ముఖ్యమంత్రి
కడప: సాగునీటి ప్రాజెక్టులపైన అఖిలపక్షం ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు (శుక్రవారం) జిల్లా పర్యటనకు వస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ఆయన గాలేరు – నగరి సుజల స్రవంతి కాల్వలను వాయుమార్గంలోపరిశీలించనున్నారు. మధ్యాహ్నం గండికోట జలాశయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
అనంతరం నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపి, రైతులతో ముఖాముఖిలో మాట్లాడనున్నారు.
రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించిన సమయంలో జిల్లాలో చేపట్టనున్న కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై సీఎం అసెంబ్లీ ప్రకటించారు. గత ఏడాది నవంబరు 8న మొదటి సారిగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రైల్వేకోడూరు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని జిల్లాకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించారు. వీటిపై ఇంతవరకూ ఎటువంటీ పురోగతీ లేదు.
మొత్తానికి విపక్షాల ఆందోళనలతో హుషారైన ముఖ్యమంత్రి కడప జిల్లా ప్రాజెక్టులను సమీక్షించేదానికి పూనుకున్నారు. సమీక్ష అనంతరం ఆయా ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులను, అనుమతులను ప్రభుత్వం మంజూరు చేస్తేనే ఉపయోగం ఉంటుంది. ముఖ్యమత్రిగారు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కాంక్షిద్దాం!