మనకు జరగబోయే మరో మోసాన్ని ప్రతిఘటిద్దాం

కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం వస్తే ఇక్కడి జీవితాలకు కొంతైనా ఒక ఆదరువు, భరోసా లభించినట్లే. తరతరాలుగా దగాపడ్డ రాయలసీమ ఎన్నో కరువు, కాటకాలను చూసింది. రాయలసీమలో క్రిష్ణదేవరాయుల కాలంలో వజ్రాలను, వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారని విన్నాం. కానీ యిప్పుడు నీరులేక – పంటలు ఎండిపోయి కరువులతో జీవిస్తున్న రైతులు ఒకవైపు…చదివిన చదువుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వలసలు వెళ్ళే యువతరం ఒకవైపు..ఉపాధి లేక ఏమీ తోచని పరిస్థితులలో మధ్య వయస్కులు మరొక వైపు వున్న రాయలసీమను చూస్తున్నాం.

ఇలాంటి సమయంలో రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం అన్న మాట కొంత మేర ఓదార్పు కలిగించింది. విభజన చట్టంలోని ఈ హామీ…యువతకు తమ చదువుకు తగ్గ ఉపాధి స్థానికంగానే దొరుకుతుందనే భరోసా కల్పించింది. మధ్యవయస్కుల్లో ఉక్కు పరిశ్రమ కారణంగా జీవనోపాధి దొరికితే బతుకు బండిని ఎలాగోలా లాగించేయవచ్చనే ధైర్యాన్నిచ్చింది.

గతంలో డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు రెండు ఉక్కు పరిశ్రమలను ప్రకటించారు. ఒకటి జమ్మలమడుగు దగ్గరలోని బొమ్మేపల్లి వద్ద బ్రహ్మణి భారీ ఉక్కు పరిశ్రమ. రెండవది తాడిగొట్ల వద్ద మినీ పరిశ్రమ. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ కోసం 2007లో 10,670 ఎకరాలు కేటాయించారు. మైలవరం జలాశయం నుండి 4 టియంసి నీటిని కేటాయించారు. అనేక ఆరోపణల నడుమ, వైఎస్ మరణంతో బ్రహ్మణి ఆగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బ్రహ్మణి ఒప్పందాన్ని రద్దు చేసి 2014 లో యిచ్చిన భూమిని వెనక్కు తీసుకుంది, నీటి కేటాయింపులను రద్దు చేసింది. కడప జిల్లా ప్రజల కలలు కల్లలు అయ్యాయి. ఇదే సమయంలో బ్రాహ్మణి కర్మాగారాన్ని చేపట్టేందుకు సెయిల్ ముందుకు వచ్చినా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి కూడా..

చదవండి :  ఉక్కు పరిశ్రమ కోసం ‘అఖిల‌ప‌క్షం’ ఆందోళన

రాష్ట్ర విభజన చట్టంలో కడప జిల్లాలో ప్రభుత్వరంగ సంస్థ సెయిల్ ( స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ) ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని పేర్కొనడంతో జిల్లా ప్రజల ఆశలు మళ్ళీ చిగురించాయి. సెయిల్ బృందం జిల్లాలో పర్యటించిoది. కంబాలదిన్నె ప్రాంతంలోనూ, కొప్పర్తి ప్రాంతంలోనూ పరిస్థితులను అధ్యయనం చేసి జిల్లాలో ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో నిజంగానే ఉక్కు పరిశ్రమ వస్తుందని నమ్మాo.

కానీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఉక్కు కర్మాగారం (సెయిల్) కడప జిల్లాలో కాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంకు తరలించే ప్రయత్నం జరుగుతూ వుంది. ఇటువంటి ప్రయత్నాన్ని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే తెరపైకి తీసుకురావడం విషాదకర పరిణామం.కడప జిల్లా లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే ముడి ఇనుము తరలింపుకు ఎక్కువ ఖర్చుఅవుతుందనే నెపంతో మార్చే ప్రయత్నం మొదలు పెట్టారు. నిజానికి కడప జిల్లాను ఆనుకుని ఉన్న ప్రకాశం జిల్లాలో మాగ్నటైట్ గనులు విస్తారంగా ఉన్నాయి.

చదవండి :  రాయలసీమను వంచించారు

కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని హామీ యిచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మాట మార్చి కోస్తా పెట్టుబడిదారులకు లొంగిపోయాయి.

జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే :

1. ప్రస్తుతం ఉన్న పరిస్తితులల్లో కడప జిల్లా లో ఉక్కు పరిశ్రమ నెలకొల్పితే ప్రత్యక్షంగా 15,000 మందికి ఉపాధి లభిస్తే పరిశ్రమకు అనుబంధoగా 2000 చిన్న, పెద్ద పరిశ్రమలు స్థాపనకు సాధ్యమవుతుంది. తద్వారా లక్షమందికి పైగా పరోక్ష ఉపాధి లభిస్తుంది. ( విశాఖ ఉక్కు పరిశ్రమ చుట్టూ 1950 పరిశ్రమలు వచ్చాయి.)

2. చదువుకున్న యువతీయువకులు ఉద్యోగం కోసం వలసలు వెళ్ళే పరిస్థితి తగ్గుతుంది.

3. గిరిజన మహిళలు వ్యభిచార గృహాలకు బలి కావడం తగ్గుతుంది.

యిలా చెప్పుకొంటూపోతే ప్రజల ఆర్ధిక అసమానతలు తగ్గి, స్థూల తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

ఇప్పుడు ఉన్న పాలకులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అభివృధి చెందిన ప్రాంతాలకే (పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు) మళ్ళీ మన హక్కైన ఉక్కు కర్మాగారంను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. కడప జిల్లా లో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని, రాయలసీమలో కరువు వున్నా ఉపాధి దొరుకుతుందని, ప్రజల కష్టాలు కొంతయినా తీరుతాయని ఆశించే వారి కలలను వమ్ము చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

చదవండి :  ‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

“కడప ఉక్కు – రాయలసీమ హక్కు” అని చాటిచేప్పుదాo. కడప జిల్లాకు పాలకుల ద్వారా జరగబోయే మోసాన్ని ప్రతిఘటిద్దాం ..

– తవ్వా సురేష్‌రెడ్డి

రచయిత గురించి

సురేష్ రెడ్డి తవ్వా, కడప జిల్లాకు చెందిన ఒక ఆక్యుపంక్చర్ వైద్య నిపుణులు. వీరు జనవిజ్ఞాన వేదిక ఆం.ప్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా. కడప జిల్లాకు సంబంధించిన వివిధ సమస్యలపైన, సామాజిక రుగ్మతలపైన పోరాడటంలో వీరు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వీరు ప్రొద్దుటూరు పట్టణంలోనే కాక జిల్లా వ్యాప్తంగా పర్యటించి వివిధ సామాజిక, ఆరోగ్య అంశాలపైన విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రాయలసీమ అభివృద్ది ఉద్యమ వేదిక, ప్రొద్దుటూరు కన్వీనర్ గా వ్యవహరిస్తున్న సురేష్ స్వస్థలం మైదుకూరు. సురేష్ ఫోన్ నంబర్: +91-9705333305

ఇదీ చదవండి!

ఉక్కు పరిశ్రమ కోసం ఆందోళన

ఉక్కు పరిశ్రమ కోసం ‘అఖిల‌ప‌క్షం’ ఆందోళన

కడప: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలోనే ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కడప విమానాశ్రయం …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: