పోట్లదుర్తి – యాట కుక్కపైన కుందేళ్లు తిరగబడిన చోటు

పోట్లదుర్తి చెన్నకేశవాలయం

పోట్లదుర్తి (ఆంగ్లం : Potladurthi or Potladurti) – కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని ఒక ఊరు మరియు గ్రామపంచాయతి. స్థానికంగా ఈ ఊరిని పోట్లదుత్తి అని పిలుస్తారు.  ఈ ఊరు ఎర్రగుంట్ల – ప్రొద్దుటూరు రహదారిపై ప్రొద్దుటూరు నుండి 6 కి.మీల దూరంలో పెన్నానది (పెన్నేరు)  గట్టున ఉంది.

కలమళ్ళ, మాలెపాడు మీదుగా ప్రవహించే ఒక వంక (వాగు)  పోట్లదుర్తి సమీపంలో పెన్నానదిలో కలుస్తుంది.

ఊళ్ళో గ్రామసచివాలయం, మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాల, పశువైద్యశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి.

కులాలు / మతాలు :

పోట్లదుర్తిలో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి   జీవిస్తున్నారు.

కులాలు : మాల, మాదిగ, తొగట, కాపు (రెడ్డి), వెలమ, బ్రాహ్మణ, కోమటి

మతాలు : హిందూ, ముస్లిం మరియు క్రిస్టియన్

పేరు వెనుక కథ :

పెరళ్ళలో, తోటల్లో పెంచే పొట్లకాయ మొక్క వలన ఈ ఊరికి పోట్లదుర్తి అనే వచ్చింది అని ఒక కథనం (ఆధారం : మెకంజీ కైఫీయతు 1119-214)

సారు మహారాజు ఈ ఊరున్న తావులో కుందేళ్ళ పైకి యాటకుక్కను ఇడిసిపెడితే ఆ యాటకుక్కపైన కుందేళ్లు తిరగబడినాయంట. ఈ తావు శౌర్యం కలిగినదని భావించి  ఇక్కడ ఊరు కట్టించగా అది ‘పోట్లదుర్తి’ అనే పేరు పొందిందట (ఆధారం : మెకంజీ కైఫీయతు 1229-108).

చదవండి :  పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం "దుర్గం కోట "

స్థానికుల చెప్పిన దానిని బట్టి ముస్లిములతో వెలమలు పోట్లాడి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నందున దీనికి పోట్లదుర్తి అనే పేరు వచ్చిందట (ఆధారం : Fairs and Festivals of Cuddapah District, 1961, Page number : 33)

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 6,901. పురుషుల జనాభా 3,604,  స్త్రీల జనాభా 3,297, ఇళ్ల సంఖ్య 1,711

చరిత్ర 

పోట్లదుర్తి శాసనం

పోట్లదుర్తిలో కూడా రేనాటి చోళుల శాసనం దొరికింది కాని, 1970 దశకంలో చేసిన శాసనాల సర్వే కాలం నాటికే, ఆ శాసనం కనపడలేదు అని రాశారు.

పోట్లదుర్తి శాసనం
పోట్లదుర్తి శాసనం

పండే పంటలు

వరి, శనిక్కాయ (వేరుశనగ), కూరగాయలు,  జొన్నలు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు, దోస, కందులు, ఆవాలు మొదలైనవి

దేవాలయాలు లేదా దేవళాలు :

  • అగస్త్యేశ్వరాలయం, వీరభద్రాలయం , చౌడమ్మ గుడి, చెన్నకేశవాలయం, రామాలయం, పెద్దమ్మ గుడి, దుర్గమ్మ గుడి
పోట్లదుర్తి
పోట్లదుర్తి అగస్తీశ్వరాలయం

ఊరికి ఆనుకుని కలమల్ల వంక పెన్నానదిలో కలిసే చోటుకు దగ్గర్లో ఏర్పడిన ఒక మట్టి గడ్డ మీద అగస్త్యేశ్వరాలయం కట్టారు. అందుకే దీన్ని నడిగడ్డ శివాలయం అని కూడా అంటారు. ఇక్కడ అగస్త్యేశ్వర శివలింగం, కడప జిల్లాలోని మిగతా అగస్త్యేశ్వర శివలింగాల లాగా భారీగా, తలమీద ప్రత్యేకమైన శిగ కలిగి ఉంటుంది. పార్వతీ దేవి ఆలయం, వీరభద్రాలయం ఇక్కడ మనం చూడొచ్ఛు.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1977

గుడికి బయట, రోడ్ పక్కన, 400 సంవత్సరాల కాలం నాటి చౌడమ్మ గుడి ఉంది.

చెన్నకేశవాలయం :

ముప్పది రెండు వేల సంకీర్తనలతో శ్రీనివాసుని కీర్తించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు పోట్లదుర్తి చెన్నకేశవుని దర్శించుకొని ఆ స్వామిపైన కీర్తన కూడా రాసినాడు.

ఇక్కడ చెన్నకేశవస్వామిని విగ్రహం లాగా కాకుండా, ఒక పెద్ద రాతికి మలిచినట్లు చెక్కారు. విగ్రహం మకరతోరణం మీద దశావతార శిల్పాలు గమనించవచ్చు.

పోట్లదుర్తి చెన్నకేశవుడు
పోట్లదుర్తి చెన్నకేశవుడు

ఇక్కడ గుడి లో స్వామి పడమర దిశ వైపు ప్రతిష్టించబడి ఉంటారు. మాములుగా శివాలయాలలో ఉండే నవగ్రహ మండపం ఈ ఊర్లో మనం చెన్నకేశవాలయంలో గమనించవచ్చు. ఈ మండపం పక్కనే విజయనగర రాజుల కాలం నాటి 3 శాసనాలు ఉన్నాయి. ఆ కాలంలో ప్రజల నుండి సేకరించిన పన్నులని చెన్నకేశవుని పూజల కోసం వినియొగించాలి అని శాసనాలు చెప్తున్నాయి.

చదవండి :  ఎర్రగుంట్ల కౌన్సిలర్లపై అనర్హత వేటు

ఈ చెన్నకేశవ ఆలయంలో, అమ్మవారి కి ఒక గుడి, ఆళ్వారుల విగ్రహాలు, విష్వక్షేనుని విగ్రహాలు ఉన్నాయి. పెద్ద రాతి ధ్వజ స్థంభం ఉంది. ఇటీవల గుడిని పునర్మించారు. పెద్ద ప్రాంగణంలో గుడి ఉంది. పాత ఆలయంలోని శిల్పకళా స్థంభాలని గుడి బయట నిలబెట్టి ఉంచారు. వాటి చుట్టూ చెత్త డబ్బాలు ఏర్పాటు చేయడం ఒక బాధాకరమైన విషయం.

విశ్వక్షేనుడు

తిరునాళ్ళు / జాతర్లు :

కార్తీక మాసంలో ఒకసారి, ఆశ్వయుజ శుధ్ద దశమి నాడు  మరియు సంక్రాంతి (పుష్యమి) నాడు చెన్నకేశవుడు, అగస్తీశ్వరుడు ఊరేగుతయారు.

జాతరకు ఊళ్ళో గ్రామదేవతలైన పెద్దమ్మ, చౌడమ్మ, అంకాలమ్మలకు యాటలు (జంతుబలులు) సమర్పిస్తారు.

శ్రీరామనవమికి రాముడు ఊరేగుతాడు.

పిన్ కోడ్ : 516360

పోట్లదుర్తికి ఇలా  చేరుకోవచ్చు

ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మధ్య నడిచే ఆర్టీసీ బస్సులు, షేర్ ఆటోలు పోట్లదుర్తి మీదుగా వెళుతుంటాయి.

దగ్గరి బస్ స్టేషన్ : ప్రొద్దుటూరు (6 KM), ఎర్రగుంట్ల (7 KM)

దగ్గరి రైల్వే స్టేషన్ : ఎర్రగుంట్ల (6 KM)

దగ్గరి విమానాశ్రయం : కడప (42 KM)

సహకారం : పురుషోత్తం చౌడం, డా.కేతు విశ్వనాథరెడ్డి (కడప ఊర్లు -పేర్లు)

ఇదీ చదవండి!

జువారి సిమెంట్స్

‘జువారి సిమెంట్స్’కు ఉత్తమ యాజమాన్య అవార్డు

కడప: 2015-16 సంవత్సరానికి గానుఅం.ప్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ యాజమాన్య అవార్డుకు ఎర్రగుంట్లలోని ‘జువారి సిమెంట్స్’ కర్మాగారం ఎంపికైందని ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: